ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలగాణ పర్యటన బీజేపీ, టీఆర్‌ఎస్ నాయకుల మధ్య రాజకీయ రగడకు కారణమైంది. రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు 12వ తేదీన మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఇప్పటికే మోదీ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం లేక ఇంతకుముందులాగా దూరంగా ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశం బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య కాక రేపుతోన్న నేపథ్యంలో మోదీ పర్యటనకు కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలే కనిపిస్తున్నాయి. పైగా కొద్ది రోజులుగా కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం, మోదీ మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ పేరుతో ఒక జాతీయ పార్టీని కూడా ప్రకటించారు. నేరుగా మోదీ టార్గెట్‌గా మీడియా సమావేశాల్లో కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక్కో వేషంలో కనిపిస్తారంటూ సెటైర్లు పేల్చారు. ఈ తరుణంలో రాష్ట్రానికి వస్తున్న మోదీకి కేసీఆర్ దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మోదీ పర్యటనకు ప్రోటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ హాజరుకావాలి. బేగంపేట ఎయిర్ పోర్ట్‌కి వెళ్లి రాష్ట్ర గవర్నర్ తో కలిసి ఆహ్వానం పలకాల్సి ఉంటుంది. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం హోదాలో మోదీతో కలిసి కేసీఆర్ పాల్గొనాలి. అయితే ప్రొటోకాల్ ప్రకారం మోదీ పర్యటనలో సీఎం కేసీఆర్ పాల్గొనబోవడం లేదని తెలుస్తోంది. గతంలో మూడుసార్లు మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కూడా సీఎం కేసీఆర్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లి ఆహ్వానం పలకలేదు. తన తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పంపించారు. మరి ఈ సారైనా ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా అంటే పాల్గొనరు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి కూడా తన తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను మోదీని ఆహ్వానం పలకడానికి పంపించే అవకాశం ఉంది. గతంలో రెండు సార్లు కేసీఆర్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవే బేగంపేట విమానాశ్రయంలో మోదీకి ఆహ్వానం పలికారు. కేసీఆర్ నిర్ణయంపై బీజేపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు తేడా తెలియదా అని కేసీఆర్‌ను ప్రశ్నించరు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. మోదీ పర్యటనలో పాల్గొనాలా…వద్దా అనేది కేసీఆర్ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.