తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కారు దిగి చెయ్యికి జై కొట్టారు. పోచారం లాంటి సీనియర్ నేత పార్టీని వీడడంతో గులాబీ పార్టీకి నష్టమేనా? అంతటి సీనియర్ నేత రావడంవల్ల కాంగ్రెస్ కు లాభమేనా? తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్న తాజా రాజకీయ పరిణామాలు ఎవరికి ఎంత మేలు చేయబోతున్నాయి ? ఎవరికి ఎంత చేటు తేబోతున్నాయి?
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డియే స్వయంగా హైదరాబాద్ లోని పోచారం నివాసానికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. పోచారంతో పాటు ఆయన తనయులు డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డి, సురేందర్ రెడ్డి అలాగే పోచారం సోదరుడు శంభురెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి 1977 లో రాజకీయ అరంగేట్రం చేశారు. 1994 లో టిడిపి నుంచి పోటీ చేసి తొలిసారిగా బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇప్పటివరకూ 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
2011 లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచి భారతీయ రాష్ట్ర సమితి పార్టీలో చేరిన పోచారం
తెలంగాణ శాసనసభ స్పీకర్గా పని చేసి తనదైన ముద్ర వేశారు. ఆయన మొన్నటి ఎన్నికల్లో కామారెడ్డి జిల్లా బాన్సువాడనుంచి పోటీ చేసి ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజా రాజకీయ పరిణామాల కారణంగా గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన పోచారం త్వరలోనే మంత్రి అవుతారననే టాక్ బలంగా నడుస్తోంది.. ఆయన చిన్న కొడుకు డీసీసీబీ మాజీ చైర్మన్ భాస్కర్ రెడ్డికి కూడా రాష్ట్ర స్థాయి పదవి వరిస్తుందని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు.
brs హయాంలో బాన్సువాడ నియోజక వర్గం రాష్ట్రంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృధ్ధి చెందింది.
రాష్ట్రంలోనే ఎక్కువగా 11 వేల డబుల్ బెడ్ రూం లు బాన్సువాడ నియోజక వర్గంలో నిర్మాణం అయ్యాయి..
అభివృద్ధి పనులు కూడా బాగా జరిగాయి.. ఐతే వాటికి సంబంధించిన నిధులు కూడా కోట్ల రూపాయల్లో పెండింగ్ లో ఉన్నాయని.. brs దిగిపోయి కాంగ్రెస్ రావడంతో బిల్లులు ఆగిపోయాయని రాజకీయవర్గాల్లో చెప్పుకుంటున్నారు.
పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని పలువురు కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆయన రాకను అడ్డుకుంటామని వారు ఇదివరకే బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారతాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తూ వచ్చిన పోచారం కారు దిగడంతో ఆ పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని విశ్లేషిస్తున్నారు..
అయితే దశాబ్దాలుగా పోచారం వెంట ఉన్న నాయకులు ఆయనతో కలిసి కాంగ్రెస్ లో చేరుతారా?
బీఆర్ఎస్ లోనే ఉండిపోతారా? అన్నదానిపై ప్రస్తుతం చర్చ జోరుగా నడుస్తోంది..
పోచారానికి మద్దతుగా బిఆర్ ఎస్ నుంచి కొంతమంది నేతలు మాత్రమే ఇంతవరకూ రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడకు తిరిగి రావచ్చని నియోజకవర్గంలో బిఆర్ ఎస్ ను బలోపేతం చేయొచ్చని అంటున్నారు. ఎందుకంటే బాజిరెడ్డి గోవర్ధన్‌కు బాన్సువాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది.
ఆయనకు నియోజక వర్గంలో చాలామంది అనుచరులుకూడా వున్నారు. అంతే కాదు ఆయన గతంలో పోచారంపై ఒకసారి గెలిచారు కూడా.
పోచారం పార్టీ మార్పు తర్వాత బాజిరెడ్డి మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన పోచారం తన పదవికి రాజీనామా చేయాలని, ఉప ఎన్నికలో తనతో పడాలని సవాల్ విసిరారు. దాంతో ఉమ్మడి నిజామాబాద్ రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే బిఆర్ ఎస్ తరఫున గెలిచారు. వారిలో ఒకరైన పోచారం కాంగ్రెస్లో చేరడంతో బిఆర్ ఎస్‌కు కేవలం ఒక్కరు మాత్రమే మిగిలారు.
దాంతో బాల్కొండ నియోజకవర్గాన్నించి గెలిచిన మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీకి పెద్దదిక్కుగా వుండబోతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…