పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలు కావడంతో జహీరాబాద్ ఎంపీ సీటు కోసం బీజేపీలో ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు సెగ్మెంట్లు, ఉమ్మడి మెదక్ జిల్లాలోని మూడు సెగ్మెంట్లు జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్‌ను ఓడించి కమలం జెండా ఎగరేయడంతో ఇప్పుడు జహీరాబాద్ ఎంపీ సీటుకు డిమాండ్ బాగా పెరిగింది. ఈసారి ఇక్కడ హస్తం, కమలం పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో ఈ సీటు కోసం పోటీ పడుతున్న నేతలెవరో చూద్దాం.
ఉత్తర తెలంగాణలో ముగ్గురు ఎంపీలున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో దక్కిన ఎనిమిదిలో ఏడు సీట్లు కూడా అక్కడే ఉన్నాయి. పైగా ప్రస్తుత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌లను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓడించి బీజేపీ అభ్యర్థి జయింట్స్ కిల్లర్‌గా నిలిచారు. కామారెడ్డి నియోజకవర్గం జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి రావడమే ఇప్పుడు అక్కడ బీజేపీ ఎంపీ సీటుకు డిమాండ్ పెరగడానికి కారణం అని చెప్పవచ్చు. బీజేపీ నేత మేడపాటి ప్రకాష్ రెడ్డి ఎంపీఆర్ ట్రస్ట్ ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నాలుగేళ్ళ నుంచి కమలం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో బోధన్ టికెట్టు కోసం తుదివరకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ సమయంలోనే మేడపాటికి జహీరాబాద్ ఎంపీ టికెట్టు ఇస్తామని ఢిల్లీ పెద్దలు భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మేడపాటి ప్రకాష్ రెడ్డి ఢిల్లీ స్థాయిలో టికెట్టు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీని నిలుపుకోవడంతో ఈ ప్రాంతంలో బీజేపీకి ఆదరణ మరింత పెరిగింది. పెరిగిన బలాన్ని కాపాడుకోవడమే గాకుండా..మరింతగా పెంచుకోవడం కోసం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించకుండా నిజామాబాద్ పాటు జహీరాబాద్ లోక్ సభ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
జహీరాబాద్ లోక్ సభ స్థానంపై బీజేపీ అగ్రనాయకులు భారీగానే ఫోకస్ పెట్టారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో పాటు బీజేపీకి పట్టు పెరిగిన నేపథ్యంలో ఇక్కడ గెలవాలనే లక్ష్యంతో కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 17న నిజామాబాద్ వచ్చి పార్టీ శ్రేణులతో పాటు కీలక నాయకులతో అంతర్గతంగా విడతలవారీగా సమావేశాలు నిర్వహించిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నిజామాబాద్, జహీరాబాద్ స్థానాలపై భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా సంఘపరివార్ నేపథ్యం ఉన్న నేతలతో సైతం సుదీర్ఘ చర్చలు జరిపారు. లోక్‌సభ ఎన్నికల విషయంలో ఏమాత్రం తేడా రాకుండా ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇక జహీరాబాద్ పార్లమెంట్ సీట్ కోసం మాజీ ఎంపీ ఆలె నరేంద్ర కుమారుడు, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్ రాజ్ సైతం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భాస్కర్ రాజ్ పార్టీ తరఫున నిరంతరం అనేక కార్యక్రమాలతో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఈ టికెట్టు రేసులో మెదక్ మాజీ ఎంపీ ఎం బాగారెడ్డి కుమారుడు జైపాల్ రెడ్డి సైతం ఉన్నారు. జైపాల్ రెడ్డి శాసనసభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. మరోవైపు 2019 ఎన్ని కల్లో బీజేపీ నుంచి జహీరాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన బాణాల లక్ష్మారెడ్డి సైతం టికెట్టుపై ఆశలు పెట్టుకున్నారు.
తాజా అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని కామారెడ్డిలో మాత్రమే బీజేపీ గెలిచింది. జహీరాబాద్, బాన్సువాడలో బిఆర్ఎస్ అభ్యర్దులు, ఆందోల్, నారాయణ్ ఖేడ్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కమలం పార్టీ మాత్రం ఎంపీ సీటు తప్పకుండా తమ ఖాతాలో వేసుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ దిశగానే బీజేపీ కేడర్ రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పని చేస్తోంది. ఇంతకీ జహీరాబాద్ బీజేపీ ఎంపీ టిక్కెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…