జాతీయపార్టీతో వేరే రాష్ట్రాల నేతలకు వల విసురుతున్న బీఆర్ఎస్లో సొంతింటి కుంపట్లు పెరుగుతున్నాయి. మొన్న మేడ్చల్ జిల్లా నేతల నిరసనల స్వరం. ఇప్పుడు ఖమ్మంలో నేతల ఆధిపత్యపోరాటం. కొత్త సంవత్సరంలో ఖమ్మం బీఆర్ఎస్ నేతల విందు రాజకీయాలు పార్టీ నాయకత్వంలో గుబులు పుట్టిస్తున్నాయి. ముచ్చటగా మూడు వర్గాలున్న ఖమ్మం బీఆర్ఎస్లో కొందరు నేతలు ఎగిరిపోయేలా కనిపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని కీలకనేతలు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కి పొలిటికల్ టచ్ ఇచ్చారు. ఒకప్పుడు తుమ్మల టీడీపీ, పొంగులేటి వైసీపీ. ఇప్పుడు ఇద్దరూ గులాబీపార్టీ గూటిలోనే ఉన్నారు. నేతలిద్దరూ అనుచరులకు భారీ విందుతో న్యూ ఇయర్‌కి వెల్కమ్ చెప్పారు. బలప్రదర్శనలాగే సాగింది వీరి విందు రాజకీయం. ఆమధ్య తుమ్మల వ్యాఖ్యలు టీడీపీ పాత శ్రేణులతో ఆయన ఆంతరంగిక సమావేశం అధికారపార్టీలో గుబులు పుట్టించాయి. తర్వాత తుమ్మల కేసీఆర్‌ని పొగడటంతో ఆయన మళ్లీ దారికొచ్చారనుకుంది గులాబీపార్టీ. కానీ పాలేరులో టికెట్ ఇవ్వలేకపోతే తుమ్మల సంచలన నిర్ణయం తీసుకునేలా ఉన్నారు.
మరోవైపు కొన్నాళ్లుగా బీఆర్ఎస్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముసుగులో గుద్దులాటకు ముగింపు పలికారు. కొత్త సంవత్సర విందు కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఓపెన్ వార్నింగ్ ఇచ్చేశారు. తేల్చారో సరేసరి లేదంటే మాదారి మేం చూసుకుంటామన్న సంకేతాలిచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు ఆచితూచి మాట్లాడుతూ గుంభనంగా వ్యవహరించినా పొంగులేటి మాత్రం కుండబద్దలు కొట్టేశారు.
తుమ్మలకైనా పాలేరు ఒక్కటే ప్రయారిటీ. పొంగులేటి అలా కాదు. ఆయనకు ఎంపీ సీటుతో పాటు ఆయన అనుచరులకు ఎమ్మెల్యేల టికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం మూడు నాలుగు నియోజకవర్గాల విషయంలోనైనా తన మాట నెగ్గాలనుకుంటున్నారు పొంగులేటి. బీఆర్ఎస్లో అది సాధ్యపడకపోతే ఏం చేయాలన్నదానిపై ఆయన వ్యూహం ఆయనకుంది. తనకు అనుకూలమైన పార్టీని ఆయన చూసుకునేలా ఉన్నారు. సొంత బలగాన్ని నమ్ముకున్న పొంగులేటి ఏ పార్టీ నుంచైనా నెగ్గుకొస్తాననే ధీమాతోనే గొంతుపెంచారు. మొత్తానికి బీఆర్ఎస్ని నిలబెట్టడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తుంటే స్టేట్పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి.