పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరడానికి ముహుర్తం ఖరారయింది అని ఒక్క సారిగా వార్తలు గుప్పుమన్నాయి. అది ధృవీకరణ కాదు ఉత్త గాసిప్. తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారు ఎవరూ నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే ఆయనకు ఎదురుగా బీజేపీ నుంచి అదే ఆఫర్ ఉంది. ఇప్పుడు ట్రెండింగ్ పార్టీ బీజేపీ. అదీ కూడా పొంగులేటి లాంటి బడా కాంట్రాక్టర్లు ఎంచుకునే పార్టీ బీజేపీ. ఆ పార్టీని కాదని కాంగ్రెస్ లోకి వెళ్తారని అనుకోవడం లేదు. అదే సమయంలో పొంగులేటికి ఉన్న తెర వెనుక సంబంధాలు కూడా ఆయనకు బీజేపీకే దగ్గర అనే ప్రచారం జరగడానికి కారణం అవుతోంది. కాంగ్రెస్‌లో చేరుతారన్న ప్రచారం ఎందుకు ప్రారంభమయింది. దీని వెనుక ఓ పెద్ద వ్యూహం ఉందని అనుకోవచ్చు అదేమిటంటే బీజేపీతో తన ప్రతిపాదనలను ఓకే చేయించుకోవడం.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికి ఒక్క సారి మాత్రమే ఎంపీగా గెలిచారు. అదీ కూడా బీఆర్ఎస్ తరపున కాదు. వైసీపీ తరపున. ఆ పార్టీ నుంచి బీఆర్ఎస్‌లో చేరినప్పటికీ కేసీఆర్ ఆయనకు కాంట్రాక్టులు ఇచ్చారు కానీ రాజకీయంగా అవకాశాలు కల్పించలేదు. దీనికి కారణం ఏమిటన్న విషయం పక్కన పెడితే పొంగులేటి మాత్రం ఎంపీగా సీటు ఇవ్వకపోయినా తన వర్గాన్ని మాత్రం గట్టిగా కాపాడుకుంటూ వస్తున్నారు. బీఆర్ఎస్ లో ఉన్నప్పటికీ ప్రతి నియోజకవర్గంలోనూ తనదైన వర్గాన్ని పెంచి పోషించుకున్నారు. తనకు బలం ఉందని ఎప్పటికప్పుడు హైకమాండ్‌కు నిరూపించే ప్రయత్నం చేశారు. అందుకోసం పార్టీకి నష్టం చేయడానికి కూడా వెనుకాడలేదు. అంతే కాదు ఈ సారి ఎన్నికల్లో తనతో పాటు తన వర్గానికి ప్రాధాన్యం ఇవ్వకపోతే పార్టీ మారిపోతానని బెదిరించారు. కానీ కేసీఆర్ ఇలాంటి వాటికి లొంగలేదు దీంతో ఆయన బయటకు వచ్చారు వచ్చినప్పటి నుండి ఆయన ఏ పార్టీలో చేరలేదు కానీ అభ్యర్థుల్నిప్రకటిస్తూ పోతున్నారు. తాను ఏ పార్టీలో చేరినా వారందరికీ టిక్కెట్ ఖాయమని చెబుతున్నారు. దీంతో పొంగులేటి వ్యూహంపై ఖమ్మం జిల్లాలోనే కాకుండా మొత్తం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి ఏర్పడింది.
పొంగులేటిని చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కంచుకోట లాంటి ఖమ్మం జిల్లాలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. గట్టి ఎంపీ అభ్యర్థి కూడా లేరు అదే పొంగులేటి వస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటున్నారు. పొంగులేటి ఎలాంటి షరతులు పెట్టినా కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరిస్తుంది. కానీ బడా కాంట్రాక్టర్ అయిన పొంగులేటి చూసి చూసి కాంగ్రెస్ లో చేరగలరా సమస్యే లేదు బీజేపీకి ఆ ధైర్యం ఉంది. అందుకే కాంగ్రెస్ లా ఆఫర్లు ఇవ్వడం లేదు కానీ పొంగులేటికి ఆహ్వానం పలుకుతోంది. గతంలోనే ఆయన అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జరిగింది. కానీ పొంగులేటి పెట్టిన షరతులను బీజేపీ హైకమాండ్ పట్టించుకోలేదని చెబుతున్నారు. తనతో పాటు ఖమ్మం జిల్లాలో తన అనుచరులకు టిక్కెట్లు ఇవ్వాలన్న షరతును పెట్టారు. మరికొన్ని ఇతర ప్రయోజనాలను కూడా ఆశించినట్లుగా చెబుతున్నారు. అయితే ఎంతో అత్యవసరం అయితే తప్ప చేరే నేతలు పెట్టే కండిషన్లకు బీజేపీ అంగీకరించదు. ఇక్కడా అదే జరిగిందని చెబుతున్నారు. అందుకే బీజేపీపై ఒత్తిడి పెంచడానికి కాంగ్రెస్ లో చేరుతున్నా అనే పుకార్లను ఆయన వర్గమే సృష్టించిందన్న అంచనాలు ఉన్నాయి.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పొంగులేటికి ప్రత్యేక అనుబంధం ఉంది. అది ఎలాంటిదంటే సీఎం జగన్ సొంత మనుషులకు దక్కే కాంట్రాక్టుల్లో కొంత భాగాన్ని పొంగులేటి సంస్థలకు కేటాయిస్తున్నారు. విద్యుత్ మీటర్ల ప్రాజెక్టులో కొంత భాగాన్ని అదానీ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ తో పాటు పొంగులేటి కంపెనీకి కూడా ఇచ్చారు. మరికొన్ని కాంట్రాక్టులు కూడా దక్కాయి. అందుకే పొంగులేటి తరచూ జగన్ ను కలుస్తున్నారు. శుక్రవారం కూడా జగన్ ను కలిశారు. అయితే తెలంగాణలో వైసీపీ లేదు మళ్లీ ఆ పార్టీని యాక్టివ్ చేసే ఆలోచనల్లో లేరు కాబట్టి వైసీపీలో చేరే చాన్స్ లేదు. కానీ తెలంగాణలో ఏ పార్టీలో చేరాలో ఆయన సూచించే అవకాం ఉంది. ఇలాంటి పరిస్థితి వస్తే జగన్ సూచించేది బీజేపీనే. ఎందుకంటే కేంద్రంలో ఉండే ఉండబోయే ప్రభుత్వంలో తన కంటూ ఓ మనిషి ఉండాలని ఆయన కోరుకుంటారు. అలాంటి మనిషి పొంగులేటి అవుతారు. అందుకే ఆయనను బీజేపీలోకి పంపడానికే ప్రాధాన్యం ఇస్తారు.
ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్ది ఆయారాం గయారాంలు ఎక్కువగానే ఉంటారు. అందులోనూ పొంగులేటి లాంటి రిచ్ పొలిటికల్ లీడర్స్ మెరుగైన భవిష్యత్ కోసం రాజకీయ పార్టీని ఎంపిక చేసుకునే క్రమంలో అన్ని కోణాలను చూసుకుటారు. మైండ్ గేమ్ ఆడుతారు చివరికి తాము అనుకున్న డిమాండ్లు నేరవేర్చుకుని చేరాలనుకున్న పార్టీలో చేరుతారు. ఇప్పుడా మైండ్ గేమ్ ను పొంగులేటి ప్రారంభించారని అనుకోవచ్చు.