బీఆర్‌ఎస్ ప్రభుత్వం గవర్నర్ మధ్య కొనసాగుతున్న ఘర్షణ ఇవాళ పలు మలుపులు తిరిగింది. కొంతకాలంగా తెలంగాణలో గవర్నర్ తిమిళిసై, కేసీఆర్ సర్కార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి విషయంలో తెలంగాణ ప్రభుత్వం సిఫార్సును గవర్నర్ తిరస్కరించినప్పటి నుంచి ఈ వైరం మొదలైంది. అది రానురాను శృతిమించి ఈరోజు హైకోర్టుకు చేరింది. చివరకు ఈ వ్యవహారం పలు మలుపులు తిరిగి ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. బడ్జెట్‌కు అనుమతి కోసం ఈనెల 21న గవర్నర్‌కు కేసీఆర్ సర్కార్ లేఖ రాసింది. అయితే గవర్నర్ తన అనుమతి ఇవ్వలేదు. గత సంవత్సరం గవర్నర్ ప్రసంగం లేకుండానే ప్రభుత్వం బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. దానిపై అప్పట్లోనే గవర్నర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇప్పుడు అదే విషయాన్ని గుర్తు చేస్తూ బడ్జెట్ సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉందా లేదా చెప్పాలని రాజ్‌భవన్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. అక్కడితో ఆగకుండా రిపబ్లిక్ డే నాడు గవర్నర్ తన ప్రసంగంలో ప్రభుత్వానికి కేసీఆర్ కు చురకలంటించారు. దాంతో రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ మరింత ముదిరింది. బీఆర్‌ఎస్ నాయకులు గవర్నర్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌కు గవర్నర్ ఆమోదం తెలపకపోవడంపై కేసీఆర్ సర్కార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. బడ్జెట్‌ను ఆమోదించేందుకు గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారణకు హైకోర్టు స్వీకరించింది. రాష్ట్ర బడ్జెట్ ముసాయిదా ప్రతులకు గవర్నర్ ఆమోదం తెలపకపోతే కష్టతరమవుతుందని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
అయితే గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ వ్యవహారంలో తామెలా జోక్యం చేసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అసలు గవర్నర్‌కు కోర్టు నోటీసులు ఇవ్వొచ్చా లేదా.. అనేది ఆలోచించుకోవాలని ప్రభుత్వ తరపు న్యాయవాది అడ్వొకేట్ జనరల్‌ను ప్రశ్నించింది. మేము జోక్యం చేసుకుంటే కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని మీరే అంటారని ఏజీకి చురకలు అంటించింది. ఈ దశలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తామని ప్రభుత్వ తరపు లాయర్ దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. రాజ్యాంగపరంగా నిబంధనలన్నీ నిర్వర్తిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 3న గవర్నర్ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6న బడ్జెట్ ప్రవేశపెడుతుందని సమాచారం. ఇక్కడితో గవర్నర్, కేసీఆర్ సర్కార్ మధ్య మనస్పర్థలు సమసిపోయినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.