బైంసా అంటే ఎందుకంత ఇది ?

By KTV Telugu On 28 November, 2022
image

బైంసాకు బండి సంజయ్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు
పాదయాత్రకు హైకోర్టు అనుమతి

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రతో బైంసా పట్టణం పేరు వార్తల్లోకి వచ్చింది. తెలంగాణలోని నిర్మల్‌ జల్లాలో ఉన్న బైంసా కు వెళ్లి తీరతానని బండి పట్టపబడితే అక్కడికి వెళ్లడానికి వీల్లేదని పోలీసులు ఆంక్షలు విధించారు. అయినప్పటికీ అక్కడికి బయలుదేరిన బండిని అరెస్టు చేశారు. బైంసాకు వెళ్లాలంటే వీసా తీసుకోవాలా అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. అసలింతకూ బైంసా పట్టణం ఎందుకు అంత వివాదాస్పదం అయ్యింది. నిర్మల్‌ జిల్లాలో ఉంది బైంసా. 2011 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడి జనాభా సుమారు 50 వేలు. అన్ని మతాల ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి జీవిస్తారు. అయితే ఉన్నట్లుండి 2008 అక్టోబరులో భైంసాలోను చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు తలెత్తాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం పేరు ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. అల్లర్లు అదుపులోకి రాకపోవడంతో చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది.

అప్పటి నుంచి ఈ ప్రాంతానికి అత్యంత సున్నితమైన ప్రాంతంగా ముద్రపడింది. దేశంలో మతపరంగా ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా దాని ఎఫెక్టు బైంసా మీద పడుతుంది. 2020లో రెండు సార్లు, 2021లో ఒకసారి ఇక్కడ రెండ వర్గాలకు చెందినవారు తలపడడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి చోట ఐదో విడ‌త ప్ర‌జా సంగ్రామ పాద‌యాత్ర తలపెట్టారు బండి సంజయ్‌. కానీ బైంసా మీదుగా బీజేపీ పాదయాత్ర సాగితే మళ్లీ మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు బండి సంజయ్‌కు అనుమతి ఇవ్వలేదు. అత‌న్ని మార్గ‌మ‌ధ్యంలో అడ్డుకున్నారు. దాంతో బండి సంజయ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలు విన్నతరువాత పాద‌యాత్ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తి మంజూరు చేసింది హైకోర్టు. విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పాద‌యాత్ర‌లు, ర్యాలీలు రాజ్యాంగం క‌ల్పించిన హ‌క్కుగా పేర్కొంది. పాద‌యాత్ర‌కు అనుమ‌తి నిరాక‌రించ‌డం స‌రైంద‌ని కాద‌ని హైకోర్టు వ్యాఖ్యానించింది. బైంసా వెలుప‌ల మూడు కిలోమీట‌ర్ల దూరంలో స‌భ పెట్టుకోవాల‌ని సూచించింది. అలాగే బైంసా ప‌ట్ట‌ణం మీదుగా పాద‌యాత్ర వెళ్ల‌కూడ‌ద‌ని ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని న్యాయ‌స్థానం సూచించింది.