మెదక్ గేమ్ లో పైచేయి ఎవరిదీ..

By KTV Telugu On 13 October, 2023
image

KTV TELUGU  :-

మైనంపల్లి రోహిత్ రావు ఎంట్రీతో మెదక్ నియోజకవర్గం సీన్ మారిపోయింది. బీఆర్ఎస్  ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి కష్టకాలం తప్పదనిపిస్తోంది. తండ్రి మైనంపల్లి హన్మంతరావు వేస్తున్న స్కెచ్ ఇప్పుడు రోహిత్ కు బాగానే ఉపయోగపడుతోందని  చెప్పాలి. దానితో పద్మాదేవేందర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  పైగా మెదక్ బీఆర్ఎస్లో గ్రూపు  తగాదాలు కూడా పద్మా  దేవేందర్ కు ఇబ్బందికరంగా మారాయి.

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పుత్రసమేతంగా కాంగ్రెస్లో  చేరిన తర్వాత మెదక్ సీన్ మారిపోయింది. ఆయన తన కుమారుడికి మెదక్ టికెట్ కోసమే బీఆర్ఎస్ పై అలిగి పార్టీ మారారని ప్రత్యేకంగా  చెప్పాల్సిన  పనిలేదు. మైనంపల్లి హన్మంతరావు వదిలిన డైలాగులు …బీఆర్ఎస్ నాయకత్వం పట్ల ఆయనకు ఉన్న కసిని కూడా బయటపెట్టాయి. బీఆర్ఎస్లో తనకు దక్కనిది కాంగ్రెస్ తో చేతికి  అందుతుందన్న  హామీతో హన్మంతరావు పార్టీ మారారు. తనకు  మల్కాజ్ గిరి టికెట్, తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ రావడం ఖాయమని నిర్ధారించుకుని కాంగ్రెస్ పార్టీలోకి దిగిన హన్మంతరావు ఆ రోజు నుంచి మెదక్ పైనే ప్రత్యేక దృష్టి పెట్టారు. పైగా పద్మా దేవేందర్ కు నియోజకవర్గంలో వ్యతిరేకత   పెరిగిందని అర్థం చేసుకున్న హన్మంతరావు సకాలంలో పావులు  కదిపారనుకోవాలి. పాత కక్షలను  తీర్చుకునేందుకు కూడా  రోహిత్ రావు ఎంట్రీ ఉపయోగపడుతుంది. నిజానికి రోహిత్ రావు మెదక్ లో ఔట్ సైడర్ అని కూడా చెప్పలేము. డాక్టర్ రోహిత్ రావు వైద్య వృత్తిలో స్థిరపడాల్సిన తరుణంలో సామాజిక కార్యక్రమాలవైపుకు దృష్టి  పెట్టారు. కొన్ని దాతృత్వ కార్యక్రమాలతో పాటు  మురికివాడల ప్రజలకు ఉచిత నీటి ట్యాంకులు సరఫరా చేయడం, ప్రత్యేక కంటి శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం, పేదల కోసం వేలాది ఉచిత బోరు బావులు తవ్వడం వంటివి చేస్తున్నారు. మరో పక్క పద్మా దేవేందర్ మాత్రం  జనంలో ఉండటం లేదన్న ఫీలింగ్ వస్తోంది. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఆమె అసలు దృష్టి  పెట్టడం లేదన్న ఆగ్రహమూ జనంలో ఉంది.

తెలంగాణ ఏర్పడిన తర్వాత మైనంపల్లి మెదక్ వదిలేసి మల్కాజ్ గిరి వచ్చినా… ఆయన కుటుంబం మాత్రం మెదక్ ను వదులుకునేందుకు ఇష్టపడటం లేదు.తాను దూరం జరిగినందునే మెదక్ లో పద్మా దేవందర్ కు తిరుగులేకుండా పోయిందని హన్మంతరావు  భావిస్తున్నారు. పైగా ఇప్పుడు  బీఆర్ఎస్లో రెండు గ్రూపులు ఆధిపత్య పోరు కొనసాగిస్తున్నాయి.   రోహిత్‌ ఎంట్రీకి ముందే నియోజకవర్గంలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. ఒకటి మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి వర్గం కాగా, మరొకటి ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి వర్గం. రెండు గ్రూపుల  మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో మైనంపల్లి రోహిత్ ఎంట్రీ ఇచ్చారు.  మూడో సారి పద్మా దేవేందర్ కు టికెట్ ఇవ్వరని, అది తనకు వస్తుందని ఎదురు చూసిన శేరి సుభాష్ రెడ్డి  ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నారు. తన గ్రూపును  బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పైగా  మైనంపల్లి కుటుంబానికి పోల్ మేనేజ్ మెంట్ బాగా తెలుసు. బీఆర్ఎస్ శ్రేణులను తనవైపుకు ఎలా తిప్పుకోవాలో మైనంపల్లి ఇప్పటికే స్కెచ్ వేసేశారని చెబుతున్నారు. పద్మా  దేవేందర్,  మైనంపల్లి వర్గాల  మధ్య సోషల్ మీడియా వార్ కూడా జరుగుతోంది. అందులోనూ  మైనంపల్లి  పైచేయిగా ఉన్నారు.

వరుసగా రెండు సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు సహజంగానే కొంత  వ్యతిరేకత ఏర్పడుతోంది మెదక్ లోనూ అదే పరిస్థితి ఉంది. స్థానిక ప్రజలు మార్పును   కోలుకుంటున్నారని  వార్తలు వస్తున్నాయి. గ్రామీణ నియోజకవర్గమైన మెదక్ లో క్రమంగా కాంగ్రెస్ పట్ల సానుకూలత పెరిగిందని చెబుతున్నారు. ఆ సంగతి తెలిసే మైనంపల్లి తెలివిగా పార్టీ మారారని అంటున్నారు.ఎన్నికల సర్వేలు కూడా బీఆర్ఎస్ కు ప్రతికూలంగా వస్తున్నాయి. అవే నిజమైతే మైనంపల్లి రోహిత్ రావు పొలిటికల్ ఎంట్రీకి బీజం పడినట్లే అనుకోవాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి