కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదని ప్రచారం జరుగుతోంది. లోక్ సభ ఎన్నికల బరిలో దిగకూడదని ఆమె నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తోన్న సోనియా గాంధీని తమ తమ రాష్ట్రాల నుండి పోటీ చేయవలసిందిగా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల బరిలో కాకుండా రాజ్యసభలో అడుగు పెట్టాలని సోనియా గాంధీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
2006 నుండి సోనియా గాంధీ రాయ్ బరేలీ నియోజక వర్గం నుండి వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ప్రభంజనం బలంగా ఉన్న సమయంలో గాంధీల కంచుకోట అయిన అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి చెందారు. అటువంటి గాలిలోనూ సోనియా గాంధీకి రాయ్ బరేలీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆమెకు మరోసారి విజయాన్ని అందించి తాము కాంగ్రెస్ వైపే ఉంటామని చాటుకున్నారు.1950 నుండి రాయ్ బరేలీలో కాంగ్రెస్ జెండాయే ఎగురుతోంది.
ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ, ఇందిరా గాంధీ లు కూడా రాయ్ బరేలీ నుంచి రెండేసి సార్లు గెలిచారు. సోనియా గాంధీ వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి పార్లమెంటులో అడుగు పెట్టారు.
ఈ సారి కూడా సోనియా ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణా లో సోనియా గాంధీని బరిలో దించాలని తెలంగాణా కాంగ్రెస్ నేతలు భావించారు. ఖమ్మం లేదా మల్కాజగిరి లోక్ సభ నియోజక వర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పోటీచేయాలని ఆమెను కోరారు కూడా.
సోనియా గాంధీ మాత్రం వేరే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల బరిలో దిగకుండా రాజ్యసభకు నామినేట్ అవ్వాలని ఆమె భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాజస్థాన్ నుండి రాజ్యసభకు నామినేట్ కావాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే మధ్య ప్రదేశ్ నుండి రాజ్యసభకు వెళ్తే పార్టీకి మంచి ఊపు వస్తుందని ఎంపీకాంగ్రెస్ నేతలు సూచించినట్లు సమాచారం. రాజ్యసభకు ఎక్కడి నుండి నామినేట్ కావాలన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు.
సోనియా గాంధీ రాజ్యసభ వైపు మొగ్గు చూపుతుండడంతో కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్ బరేలీ నియోజక వర్గం నుండి ప్రియాంక గాంధీని బరిలో దించాలని పార్టీ నాయకత్వం భావిస్తోందంటున్నారు.
2019 ఎన్నికల్లోనే ప్రియాంక గాంధీని ప్రధాని నరేంద్ర మోదీకి పోటీగా వారణాసి నుండి బరిలో దించుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. ఉత్తర ప్రదేశ్ లో పార్టీ ప్రచార బాధ్యతలను రాహుల్ గాంధీ తన చెల్లెలు ప్రియాంకకు అప్పగించడంతో ఆమె ఎన్నికల బరిలో దిగలేదు. ఈ సారి మాత్రం ఆమె చట్టసభలో అడుగు పెట్టడం ఖాయమంటున్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినా ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ ఘోర పరాజయాలు మూటకట్టుకుంది. ఆ తర్వాత 2022 లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రియాంక ప్రచారం కానీ కాంగ్రెస్ ఎన్నికల హామీలు కానీ కాంగ్రెస్ ను గెలిపించలేకపోయాయి. కర్నాకట, తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రాహుల్ తో పాటు ప్రియాంక గాంధీ చేపట్టిన ప్రచారానికి మంచి స్పందన లభించింది. అదే సమయంలో రెండు చోట్లా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇదే జోష్ ను పార్లమెంటు ఎన్నికల్లో కొనసాగించడానికి ప్రియాంకను ఎన్నికల బరిలో దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పార్టీ నాయకత్వం ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…