యూపీలో కాంగ్రెస్ ఖాతా తెరిచే ఛాన్సే లేదని తేల్చేశారు ప్రధాని మోదీ. వైట్‌వాష్ ఖాయమన్నారు. అంటే రాయ్‌బరేలిలో రాహుల్ గాంధీ ఓడిపోతున్నారా..? అమేథీతోపాటు రాయ్‌బరేలీ కూడా కాంగ్రెస్ చేజారిపోతున్నట్టేనా..? అమేథీ, రాయ్‌బరేలీ బాధ్యతలు ప్రియాంక వాద్రాకు అప్పగించి.. కాంగ్రెస్ వ్యూహాత్మక తప్పిదం చేసిందా..? మోదీ కాన్ఫిడెన్స్ ఏంటి? కాంగ్రెస్ ప్లాన్ ఏంటి?
ఉత్తర్‌ప్రదేశ్‌లో దశాబ్దాలుగా గాంధీ కుటుంబ కంచుకోటలుగా పేరొందాయి రాయ్‌బరేలీ, అమేథీ లోక్‌సభ నియోజకవర్గాలు.
2019లో అమేథీలో రాహుల్ గాంధీ ఓటమితో కాంగ్రెస్ ఒక్కసారిగా ఖంగుతింది. ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయం కోసం వ్యూహాలు అమలుచేస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు
పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా.
రాయ్‌బరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కిశోరీలాల్ శర్మ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. వీరిద్దరి తరపున
అన్నీతానై ప్రచారరథాన్ని నడిపిస్తున్నారు ప్రియాంక. తెరవెనుక వ్యూహాలను రచించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. గాంధీ కుటుంబంతో ఈ నియోజకవర్గాలకు తరతరాలుగా ఉన్న అనుబంధాన్ని ప్రజలకు గుర్తుచేసే ప్రయత్నం చేస్తున్నారు. అదే సమయంలో జాతీయ అంశాలనూ ప్రస్తావిస్తూ.. బీజేపీకి కౌంటర్లు ఇస్తున్నారు.మే 4వ తేదీ నుంచి రాయ్‌బరేలీలోనే మకాం వేశారు ప్రియాంక వాద్రా. ఈ నెల 20న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
గడిచిన 45 సంవత్సరాల్లో దాదాపు 31 ఏళ్లు అమేథీ లోక్‌సభ నియోజకవర్గానికి గాంధీ కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించారు. 1980లో తొలిసారి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి గెలిచారు. ఆయన ఆకస్మిక మరణంతో 1981లో ఉపఎన్నిక వచ్చింది. బైపోల్‌లో పోటీచేసి గెలిచిన రాజీవ్ గాంధీ.. 1991 వరకు అమేథీ ఎంపీగా కొనసాగారు. 1998లో సోనియాగాంధీ పోటీ చేయగా.. 2004లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే తన పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించి.. 2004, 2009, 2014ల్లో వరుస విజయాలు సాధించారు. 2019లో బీజేపీ నేత స్మృతి ఇరానీ 55 వేలఓట్ల తేడాతో రాహుల్‌ను ఓడించడంతో.. కాంగ్రెస్ కంచుకోట బద్ధలైంది. ఈసారి వయనాడ్‌తోపాటు అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీచేస్తారని ప్రచారం జరిగినా.. చివరికి గాంధీ కుటుంబానికి చెందని KL శర్మకు టికెట్ దక్కింది.
అమేథీకి నో చెప్పిన రాహుల్ గాంధీ.. సేఫ్ సీట్‌గా పరిగణించే రాయ్‌బరేలీలో పోటీకి నిలిచారు. రాయ్‌బరేలీ గాంధీలకు పెట్టనికోట. 1952 నుంచి 2019 వరకు ఇక్కడ కాంగ్రెస్ కేవలం మూడు సార్లే ఓడిపోయింది. తొలుత ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ, 1967 నుంచి 1980 వరకు ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి పోటీచేశారు. 1977లో మినహా అన్నిసార్లూ ఆమె విజయం సాధించారు. 2004 నుంచి రాయ్‌బరేలీ ఎంపీగా ఉన్నారు సోనియా గాంధీ. ప్రత్యక్ష ఎన్నికలకు దూరం జరిగి సోనియా రాజ్యసభకు వెళ్లడంతో.. తల్లి స్థానంలోకి వచ్చారు రాహుల్ గాంధీ. 2019లో అమేథీలో ఓడిపోయిన రాహుల్ గాంధీ.. ఈసారి రాయ్‌బరేలీకి మారిపోవడంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.
అయోధ్యలో రామమందిరం ఎఫెక్ట్‌తో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హవా బలంగా వీస్తోంది. ఈ సమయంలో కంచుకోటలను నిలబెట్టుకోవడం కాంగ్రెస్‌కు దాదాపు అసాధ్యమే అంటున్నారు రాజకీయ పండితులు. ప్రధానీ మోదీ సైతం ఇదే మాట చెప్పారు. యూపీలో కాంగ్రెస్ గుండు సున్నా కావడం ఖాయమని.. రాహుల్ గాంధీ ఓటమి తప్పదనే సంకేతాలిచ్చారు. మరి ప్రియాంక వాద్రా కష్టం ఫలిస్తుందా..? బీజేపీ చెప్పినట్టు జరుగుతుందా..? తెలియాలంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…