కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సారి ఆయన తెలంగాణపై దృష్టి పెట్టారా. సోనియా పోటీ చేయాలన్న తెలంగాణ నేతలు డిమాండ్లు నెరవేరలేదని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతమున్న వాయ్ నాడ్ నియోజకవర్గాన్ని వదులుకుని ఆయన ఖమ్మం వైపుకు వస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి…
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కంటూ ఒక నియోజకవర్గం లేదా. దానితో రాహుల్ అనివార్యంగా రూటు మార్చుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన పోటీ చేస్తే స్థానాలపై స్పష్టత రాకపోయినా ప్రస్తుత నియోజకవర్గం వాయ్ నాడ్ నుంచి దూరం జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందుకోసం కాంగ్రెస్ నేత వేరే రెండు నియోజకవర్గాలను వెదుకుతున్నారు. ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని పార్టీ వ్యూహకర్తలు సంప్రదిస్తున్నారు.రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో అమేఠీ, వాయ్ నాడ్ నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అమేఠీలో ఓడిపోయారు. వాయ్ నాడ్ లో నాలుగు లక్షల మెజార్టీతో గెలిచారు.అయితే అప్పట్లో మిత్రపక్షాలు,పొత్తు భాగస్వాములు రాహుల్ రాకను వ్యతిరేకించాయి. మోదీ మీద పోటీ ఉంటే ఉత్తరాదిన తేల్చుకోవాలి గానీ, కేరళలో పోటీ చేసి తమకున్న నాలుగు స్థానాల్లో ఒక దానికి తీసేసుకోవడమేంటని నిలదీశాయి. గత ఐదేళ్లలో పలువురు కమ్యూనిస్టు నేతలు సైతం మరో సారి వాయ్ నాడ్ లో రాహుల్ పోటీని వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇప్పుడు కేరళ పాలిటిక్స్ హీటెక్కాయి. పొత్తులో భాగంగా తమకు కనీసం మూడు స్థానాలు కావాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ డిమాండ్ చేస్తోంది. వాళ్లు పోటీ చేయాలనుకున్న మూడు నియోజకవర్గాల్లో వాయ్ నాడ్ కూడా ఉంది. కమ్యూనిస్టు పార్టీలు కూడా వాయ్ నాడ్ పై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కేరళలోని 20 లోక్ సభా స్థానాల్లో అత్యధికం తాము గెలిచే అవకాశం ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ అక్కడ పోటీ చేయకూడదని వామపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీపీఐ తరపున ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా సతీమణి అన్నే రాజా….వాయ్ నాడ్ నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది. సీపీఐ ఎలక్షన్ కమిటీ కూడా సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనేక చోట్ల కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పొత్తు ఉన్న తరుణంలో సీపీఐపై రాహుల్ పోటీ చేయడం సహేతుకం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది….
వాయ్ నాడ్ నుంచి పోటీ చేయకూడదనుకుంటున్న రాహుల్ ఇప్పుడు వేరే ఆలోచనలో ఉన్నారు. తాను రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియను పార్టీ వ్యూహకర్తలు చూసుకుంటున్నారు..
వాయ్ నాడ్ సెట్ కాదని రాహుల్ నిర్ణయించుకున్న తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన కోసం నియోజకవర్గాల ఎంపికలో పడిపోయింది. రాహుల్ ఈ సారి కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. ఆయన తెలంగాణ లేదా కర్ణాటకలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. తెలంగాణలోని ఖమ్మం నియోజకవర్గాన్ని ఆయన ఎంపిక చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. సోనియాగాంధీ ఖమ్మం నుంచి పోటీ చేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా రోజుల క్రితం ఏఐసీసీకి విజ్ఞప్తి చేశారు. అయితే సోనియా నిర్ణయం మార్చుకుని రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నారు. దానితో ఖమ్మం నియోజకవర్గం నుంచి రాహుల్ పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ మొదలైంది. అదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో అంతర్లీనంగా చర్చకు తెరతీసింది. రాహుల్ పోటీ చేస్తే బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఎలా ఉంటుందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. వాళ్లిద్దరూ చేయి కలిపి రాహుల్ ను ఓడిస్తే జరిగే నష్టాన్ని కూడా అంచనా వేసుకుని మరీ రంగంలోకి దిగాలన్న వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు వ్యవహారం బయట పడిన తర్వాతే రాహుల్ ఖమ్మం నుంచి పోటీ చేసే అంశంపై స్పష్టమైన ప్రకటన చేయాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. అంతవరకు సస్పెన్స్ కొనసాగించాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ తరపున ఖమ్మం నుంచి మళ్లీ నామా నాగేశ్వరరావు, బీజేపీ తరపున ఒక వ్యాపారవేత్త పోటీ చేస్తారని తెలుస్తోంది. ఆ రెండు పార్టీలు కలిస్తే మాత్రం ఖమ్మం నియోజకవర్గం బీఆర్ఎస్ కే వెళుతుంది. ఇవన్నీ లెక్క గట్టుకుని రాహుల్ పోటీపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరో పక్క ఉత్తర ప్రదేశ్లోని అమేఠీ నుంచి కూడా రాహుల్ పోటీ చేయాల్సిన అంశంపై కూడా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది..
రాహుల్ ఖమ్మంలో పోటీ చేస్తే మాత్రం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అది మరింత బలాన్నిచ్చే నిర్ణయమవుతుంది.ఇప్పటికే రాష్ట్రంలో దూసుకుపోతున్న పార్టీకి మరికొంత శక్తిని జోడించినట్లవుతుంది. సీఎం రేవంత్ చెప్పినట్లుగా 14 లోక్ సభా నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు సాధ్యమవుతుంది. అయితే రాహుల్ ఖమ్మం నుంచి పోటీ చేస్తారన్నది ఇంకా అధికారికంగా ఎక్కడా వినిపించడం లేదు. దానితో స్పష్టత వచ్చే వరకు ఆగాలని స్థానిక కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…