జనంలోకి కాంగ్రెస్ పార్టీ చొచ్చుకెళ్లగలిగిందా ? నీరసంగా పడున్న కాంగ్రెస్ కేడర్ లో నూతనోత్తేజం వచ్చిందా ? కేసీఆర్ ప్రభుత్వం పట్ల జనంలో పెరుగుతున్న అసంతృప్తిని క్యాష్ చేసుకునే అవకాశం వచ్చిందా… ? రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో విభేదాలను పరిష్కరించుకుంటే…. భవిష్యత్తుకు పూలబాట వేయడం ఖాయమా ?
ఐదో రాష్ట్రంలో కాంగ్రెస్ జోడో యాత్ర
యాత్రను చూసిన వారికి ఉత్సాహం, ఉత్సుకత, ఆశ
ఆర్ఎస్ఎస్, బీజేపీకి సైద్థాంతిక సవాలు
పోగొట్టుకున్న రాజకీయ పరపతిని నిలబెట్టుకునే అవకాశం
ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలకు బీజం
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత జోడో యాత్రకు తెలంగాణలో విశేష స్పందన లభిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆశించిన విధంగా తెలంగాణలోని అన్నివర్గాలతో యాత్ర కనెక్ట్ అవుతోంది. రాహుల్ చెప్పుకుంటున్నట్లుగా ఆయన ప్రతి ఒక్కరిని పలుకరిస్తూ.. ఇంక్రెడిబుల్ తెలంగాణ సహజ స్వరూపాన్ని ఆస్వాదిస్తున్నారు. దేశ రాజకీయాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా రాహుల్ సాగిస్తున్న యాత్రలో మర్యాదపూర్వకమైన రాజకీయ సంస్కారం కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్, బీజేపీకి సైద్ధాంతిక సవాలు విసిరే దిశగా యాత్ర సాగుతోందన్న రాహుల్ వాదనను ఆస్వాదిస్తూ పౌర సమాజం ఆయనకు స్వాగతం పలుకుతోంది.
తెలంగాణ ఇచ్చినా కనిపించని ప్రయోజనం
అధికారాన్ని కోల్పోయి ఎనిమిదేళ్లు
శక్తిమంతమైన టీఆర్ఎస్, బలపడుతున్న బీజేపీ
రోజురోజుకు డీలా పడుతున్న కాంగ్రెస్ కేడర్
తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. తెలంగాణ తెచ్చిన టీఆర్ఎస్ కు ఓటేసిన జనం….. రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష స్థాయికి పరిమితం చేశారు. అధికారాన్ని కోల్పోయి ఎన్నిమిదేళ్లు కావడంతో ద్వితీయ శ్రేణి కాంగ్రెస్ నేతల్లో నిస్సత్తువ పెరిగిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత అధికార టీఆర్ఎస్ .. బాహుబలిలా తయారైంది. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలను సైతం తన వైపుకు లాక్కొని ప్రతిపక్షాన్ని మరింత బలహీనపరుస్తోంది. మరో పక్క చాప కింద నీరులా బీజేపీ విస్తరిస్తోంది. ఈ రెండు పార్టీలను తట్టుకుని నిలబడటమెలాగో అర్థం కాక తెలంగాణ కాంగ్రెస్ నేతలు తలపట్టుకు కూర్చున్న నేపథ్యంలోనే రాహుల్ యాత్ర వారికి టానిక్ లా, ఒక ఉత్ప్రేకరంగా పనిచేసే అవకాశాలున్నాయి. అధిష్టానం అండదండలు తమకున్నాయని పార్టీ కేడర్ విశ్వసించే అవకశమూ వచ్చింది.
అధిష్టానమే నేరుగా ప్రజలతో కనెక్ట్ కావడం
అండగా ఉంటామని రాష్ట్ర నేతలకు హామీ ఇవ్వడం
నౌ ఆర్ నెవ్వర్ ఆన్న ఆలోచన రావడం
పార్టీ పునర్నిర్మాణంలో రాహుల్ కు తోడుగా ఉండాలన్న భావన పెరగడం
రాహుల్ పాద యాత్ర అనుకోకుండానే అనేక ప్రయోజనాలు కలిగిసోంది. సామాన్యులకు అందుబాటులో ఉండని మోదీకి.. ప్రజల్లోనే ఉండాలనుకుంటున్న రాహుల్ కు మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకునే అవకాశం సగటు మనిషికి తెలిసొస్తోంది. మరో రాహుల్ స్వయంగా వచ్చినప్పుడు కేసీఆర్ కు భయపడి తాము తలుపులు మూసుకుని కూర్చోవడం కరెక్ట్ కాదన్న అభిప్రాయానికి కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వచ్చేశారు. తెలంగాణ ప్రజల అవసరాలు, ఆకాంక్షలను రాహుల్ తెలుసుకునే అవకాశం రావడంతో ఎన్నికలప్పుడు హామీల మేనిఫెస్టో రూపకల్పనకు సహజంగా ఎదురయ్యే అవరోధాలు తొలగిపోతున్నాయన్న అభిప్రాయమూ కలుగుతోంది. నౌ ఆర్ నెవ్వర్.. అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అవకాశం రాదన్న ఆలోచనకు ఈ యాత్ర తెరతీసింది. యాత్రతో వస్తున్న మైలేజీని వాడుకుంటే 2023 ఎన్నికల్లో ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ ఇప్పటికే గ్రహించేసింది. కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నప్పటికీ.. అసలు నేత రాహుల్ అనడానికి కేడర్ సందేహించడం లేదు. దానితో మోదీ ప్రభంజనంలో కొట్టుకుపోయిన పార్టీ పునర్నిర్మాణంలో తాము సైతం చేయి వేయాలన్న కోరిక నేతల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది…
కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి
ఉప ఎన్నికలొచ్చినప్పుడల్లా పథకాలు గుర్తుకు వస్తాయంటున్న జనం
అన్ని వర్గాలను కలుపుకుపోవడం లేదన్న అసంతృప్తి
నానాటికి పెరుగుతున్న విద్యా, కుటుంబ వ్యయం
తెలంగాణ ప్రజలకు కోటి ఆశలు
టీఆర్ఎస్ తప్పిదాలను సరిదిద్దుతారని విశ్వాసం
కాంగ్రెస్ అంటేనే గ్రూపు తగాదాలు
రెండు ఎన్నికల్లో గత్యంతరం లేక టీఆర్ఎస్ కు ఓటేశామన్న ఆలోచన ఇప్పుడిప్పుడే తెలంగాణ ప్రజల్లో కలుగుతోంది.. టీఆర్ఎస్ ప్రభుత్వం బారెడు పొడుగు హామీలిచ్చి.. జానెడు ప్రయోజనం కూడా కలిగించడం లేదని జనం చాలా రోజులుగా వాపోతున్నారు. . పేరుకు పదుల సంఖ్యలో పథకాలు అమలవుతున్నా… ప్రజలకు పైసా అందడం లేదు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు గుర్తుకొస్తాయని జనం ఆగ్రహం చెందుతున్నారు. గొర్రెలస్కీము నుంచి ఏ స్కీము అయినా సరే… ఉప ఎన్నికలతో ముడిపెడుతున్నారు. డబుల్ బెడ్ రూమ్స్ ఇళ్లు కేటాయింపుకు నోచుకోలేదు. నీళ్లు, నిధులు, నియామకాలు ఒట్టి మాటే అయ్యాయి. కేజే టూ పీజీ పేరుతో విద్యారంగంలో జనాన్ని మోసగించిన కేసీఆర్… ఇంజినీరింగ్ ఫీజులు పెంచేశారు. తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెట్టారు. లక్ష ఉద్యోగాల హామీ ఇంకా నెరవేరలేదు. దళితబంధు అమలు కాలేదు. గ్రామాలకు ఏదో ఒరిగిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. సొంతూరు చింతమడకకు కూడా ఏమీ చేసుకోలేకపోయారన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఆలయాల విషయంలోనూ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యింది. యాదగిరి గుట్ట నిర్మాణ ఖర్చు పెరుగుతోంది. వర్షం వస్తే గుడి లీక్ అవుతోంది. వరంగల్, భద్రాద్రి హామీలు నెరవేరలేదు. ఎలాంటి సాయమూ అందక చేనేత కార్మికులు లబోదిబోమంటున్నారు. ఈ వర్గాలన్ని ఇప్పుడు సహేతుకమైన చర్యల కోసం రాహుల్ వైపు చూస్తున్నాయి. కాంగ్రెస్ వస్తే సంక్షేమానికి పెద్ద పీట వేస్తారని జనం నమ్ముతున్నారు గతంలో అలాంటి పురోగామి అనుభవాలుండటంతో విశ్వసించడానికి ఇబ్బందేమీ లేదని అంటున్నారు. నిజానికి ఇదీ రాజకీయ యాత్ర అయినప్పటికీ ఎన్నికల యాత్ర మాత్రం కాదు. దానితో ఫలానా పని చేస్తామని నిర్దిషంగా హామీ ఇచ్చే అవకాశం లేదు. ప్రజలు కోరుకున్నది చేయగలరన్న నమ్మకం కలిగించడంలో సక్సెస్ అయితే అంతకన్నా కావాల్సిందేముంది.
ముఠాతత్వాన్ని పక్కన పెట్టాల్సిన తరుణం
అధిష్టానం దిశా నిర్దేశం చేసే అవకాశం
ప్రస్తుతానికి అంతర్గతంగా కాంగ్రెస్ పరిష్కరించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. గ్రూపు తగాదాలకు స్వస్థి చెప్పాలి. ముఠాతత్వాన్ని పక్కన పెట్టి పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి. పది పన్నెండు రోజులు రాష్ట్ర నేతలతో కలిసి తిరిగిన అనుభవంతో నేతల మధ్య ఉన్న విభేదాలను, వారి ఇగోలను సైతం రాహుల్ అర్థం చేసుకునే అవకాశం ఉంది. దాని ఆధారంగా బుజ్జగింపుల నుంచి హెచ్చరికల వరకు ఏదైనా జరగొచ్చు. అల్టిమేట్ గా పార్టీ విజయమే పరమావథి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది… ఈసారి అధికారంలోకి రాకపోతే.. శంకరగిరి మాన్యాలు పట్టుకుని పోవడమేనని తెలంగాణ కాంగ్రెస్ నేతలకు తెలుసు. అందుకే వాళ్లు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పని చేస్తారు…