కేసీఆర్‌కు అంత డబ్బెక్కడి నుంచి వచ్చింది

By KTV Telugu On 5 April, 2023
image

బిజినెస్ మెన్ అనే సినిమాలో హీరో రాజకీయ వ్యాపారం చేస్తాడు. తాను నేరుగా రాజకీయాల్లో ఉండరు కానీ రాజకీయ నేతలకు పెట్టుబడులు పెడతారు. అలా అధికారం పొందిన వారి వద్ద అంతకంతా వసూలు చేసుకుంటారు. అయితే అది సినిమా. అలాగే కేసీఆర్ కూడా పొలిటికల్ బిజినెస్ చేయాలనుకుంటున్నట్లుగా ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రకటించడం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోనూ సంచలనం అవుతోంది. అయితే కేసీఆర్ నేరుగా రాజకీయాల్లో ఉంటూ ఇలా చేయాలనుకుంటున్నారట. తనను బీజేపీ వ్యతిరేక కూటమికి చైర్మన్‌గా చేస్తే కూటమిలో ఉన్న అన్ని పార్టీల ఆర్థిక అవసరాలు తానే తీరుస్తారని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారట. ఇలా చెప్పే వాటికి ఆధారాలు ఉండవు కానీ అవాస్తవమని తోసిపుచ్చలేం. ముఖ్యంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రాజకీయ అడుగుల్ని పరిశీలిస్తే ఇందులో అవాస్తవం ఉందని కూడా ఎక్కువగా అనుకోరు.

ఏపీలో ఒంటరిగా పోటీ చేయడం లేదా బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడం చేస్తే రూ. వెయ్యి కోట్లు అయినా సరే ఎన్నికల ఖర్చు అంతా భరిస్తానని కేసీఆర్ జనసేనానికి ఆఫర్ ఇచ్చారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది . దీన్ని జనసేన చీఫ్ అంగీకరించారా లేదా అన్న విషయం పక్కన పెడితే దీన్ని బీఆర్ఎస్ నేతలెవరూ ఖండించలేదు. ఇప్పుడు జాతీయ స్థాయిలో ప్రముఖ జర్నలిస్ట్ అయిన రాజ్ దీప్ సర్దేశాయ్ కూడా అదే చెబుతున్నారు. బీజేపీపై పోరాడే ప్రంట్‌కు చైర్మన్‌గా తనను చేస్తే ఆ కూటమిలో ఉన్న పార్టీల ఎన్నికల ఖర్చు అంతా తాను పెట్టుకుంటానని ఆఫర్ ఇచ్చారని రాజ్ దీప్ సర్దేశాయ్ స్పష్టం చేశారు. తన చానల్‌లో ఆయన దేశ రాజకీయాలపై ఓ విశ్లేషణాత్మక వీడియో చేశారు. ఇందులో కేసీఆర్ వ్యూహాల గురించి వివరించారు. కేసీఆర్ చేసిన డబ్బుల ఆఫర్ గురించి కూడా వివరించారు. కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టింది ఖచ్చితంగా ఢిల్లీకి గురి పెట్టే. తన పార్టీని జాతీయ పార్టీగా పేరు మార్చినంత మాత్రాన ఆయన ఢిల్లీ పీఠానికి దగ్గర కాలేరు. ఇంకా ఎంతో చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇతర పార్టీలతో కలిసి నడవాల్సి ఉంటుంది. కానీ ఎంతో మందికి ఢిల్లీ పీఠం ఆశలు ఉన్నాయి. వారందర్నీ వెనక్కి నెట్టాలంటే కేసీఆర్ దగ్గరున్న ఒకే ఒక్క అస్త్రం డబ్బు. దాన్నే ప్రయోగించారని రాజ్ దీప్ చెబుతున్నారు.

ఇప్పటికే కేసీఆర్ అనేక ప్రాంతీయ రాజకీయ పార్టీలకు ఆర్థిక సాయం చేశారన్న అనుమాాలు ఉన్నాయి. కేసీఆర్ గతంలో సమాజ్ వాదీ పార్టీతో పాటు జేఎంఎం వైసీపీ జేడీఎస్ వంటి పార్టీలకు ఆర్థిక సాయం చేసినట్లుగా ప్రచారం ఉంది. ఇప్పుడు ఆ రేంజ్ ను మరింత విస్తరించింది బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకోవాలనుకుంటున్నారు. వైసీపీ నేరుగా కలవకపోయినా సందర్భం వచ్చినప్పుడు కేసీఆర్ మాటే వింటారని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు. జేఎంఎంతో పాటు కొంత మంది నేతలు కేసీఆర్ పిలిచినప్పుడల్లా రావడానికి ఆయన చేసిన ఆర్థిక సాయమే కారణమని అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ తన ఆర్థిక సాయ వ్యూహాన్ని మరింత విస్తృతం చేశారని రాజ్ దీప్ మాటలతో వెళ్లడవుతోందని అంటున్నారు. అయితే రాజ్ దీప్ అక్కడి వరకే చెప్పారు కానీ ఆ నేతలంతా కేసీఆర్ వెంట నడిచేందుకు ఆర్థిక సాయం ఆశ చూపినా సిద్ధపడటం లేదనేది తాజా రాజకీయ పరిణామం.

కేసీఆర్ ఆఫర్‌కు ఎవరూ స్పందించకపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారిందని అంటున్నారు. ఇటీవల విపక్ష పార్టీల సమావేశాలు జరుగుతున్నాయి కానీ కేసీఆర్ ను ఎవరూ పిలవడం లేదు. చివరికి స్టాలిన్ కూడా తన పుట్టిన రోజు సందర్భంగా ఓ సభ నిర్వహిస్తే ఆయనను పిలువలేదు. కానీ కేసీఆర్ మాత్రం సచివాలయం ప్రారంభోత్సవం పేరుతో ఆయనను పిలిచారు. స్టాలిన్ వస్తానన్నారు కానీ అది వాయిదా పడింది. మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ ఇటీవల ప్రత్యేక కూటమి ఏర్పాటు చేయాలని అనుకున్నారు కానీ కేసీఆర్ ను కలుపుకోలేదు. రాహుల్ గాంధీపై విధించిన అనర్హతా వేటును కేసీఆర్ ఖండించారు కానీ ఎప్పుడూ ఆయన విపక్షాల మీటింగ్ కు వెళ్లడం లేదు. దీంతో కేసీఆర్ పై పెద్దగా జాతీయ నేతలు ఎవరూ నమ్మకం పెట్టుకోవడం లేదని అంటున్నారు. మొత్తంగా కేసీఆర్ ప్రగతి భవన్ దాటని రాజకీయం ఆర్థికసాయం అంటే అందరూ తన వెంటే వస్తారన్న నమ్మకంతో జాతీయ పార్టీ పెట్టారన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి. కారణం ఏదైనా కేసీఆర్ వెంట నడవడానికి ఒక్క పార్టీ కూడా రావడం లేదు. మహారాష్ట్ర నుంచి దశాబ్దాల కిందట వార్డు మెంబర్లుగా గెలిచిన వారు వచ్చి కండువాలు కప్పించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వారు కూడా రావడం లేదు. డబ్బుతోనే రాజకీయాలు నడవవని ఇతర పార్టీల నేతలు అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. పైగా కేసీఆర్ తీరు డబ్బులతో రాజకీయ వ్యాపారం చేసినట్లుగా ఉందన్న అనుమానాలు ఉత్తరాది పార్టీల నేతల్లో ఉన్నాయంటున్నారు.

అసలు ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడ్నుంచి వచ్చాయని ప్రధాని మోదీ కూడా ఆశ్చర్యపోయారని ఢిల్లీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ పై విపక్షాలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నాయి. తెలంగాణలో దోచుకుని దాన్ని దేశంలో ఎన్నికలపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారని మండిపడుతున్నారు. మరో వైపు ఇప్పటికే కేసీఆర్ అనేక ప్రాంతీయ పార్టీలకు ఫండింగ్ ఇస్తానని హామీ ఇచ్చారని అంటున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు ఆర్థిక సాయం చేశారని కూడా అంటున్నారు. ఇంత డబ్బు కేసీఆర్‌కు ఎక్కడి నుంచి వచ్చిందని కేంద్ర ఏజెన్సీలు కూడా ఆరా తీస్తున్నాయని చెబుతున్నారు. అంటే ముందు ముందు ఈ డబ్బుల గూడుపుఠాణీని బయటకు తీసేందుకు మరింత ఎక్కువగా ఏజెన్సీలు దృష్టి సారించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే కేసీఆర్‌కు వ్రతం చెడినా ఫలితం దక్కదు.