బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ తోటి విద్యార్థిపై దాడి చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విద్యార్థులపై దాడి ఘటనపై అతను చదువుతున్న మహేంద్ర వర్సిటీ ఫిర్యాదు మేరకు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తన కుమారుడిపై కేసు నమోదు చేయడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలి కానీ పిల్లలను రాజకీయాల్లోకి లాగొద్దని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. నా కొడుకును నేనే పోలీస్టేషన్‌లో సరెండర్ చేస్తా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తావా లాఠీలతో కొట్టిస్తావా చూద్దాం అన్నారు. ఇదిలా ఉండగానే భగీరథ్ మరో విద్యార్థి మీద దాడి చేస్తున్న ఇంకొక వీడియో వెలుగులోకి వచ్చింది.
ఈ నేపథ్యంలో బండి సంజయ్ కుమారుడి వ్యవహారంపై సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్లో ఘాటుగా స్పందించారు. తండ్రికి కొడుకుకు చురకలంటించేలా ట్వీట్ చేశాడు. ఇరాక్‌ను గడగడలాడించిన నియంత సద్దాం హుస్సేన్‌ను మించిన ఆయన కుమారుడు ఉదయ్ హుస్సేన్ నాటి రోజులు అంతరించిపోయాయని భ్రమపడ్డా.. కానీ అతను బండి సంజయ్ కొడుకు భగీరథ్ రూపంలో మళ్లీ పుట్టాడు. తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటున్నాడు. అంటూ ట్వీట్ చేశాడు. ఇందులో బండి సంజయ్ కొడుకును ఒక నియంత కొడుకుతో పోల్చటం ఓ ఎత్తైతే తండ్రిని మించిపోయాడంటూ చెప్పడం మరో ఎత్తు. ఇప్పుడు సోషల్ మీడియాలో భగీరథ్ వీడియోలతో పాటు ఆర్జీవీ ట్వీట్ కూడా వైరల్ అయింది.