కోల్ బెల్ట్ లో టూ మచ్ పొలిటికల్ హీట్

By KTV Telugu On 18 October, 2023
image

KTV TELUGU :-

రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలపై ఎంత ఫోకస్ ఉంటుందో.. ఆ ప్రాంతాల్లోని నియోజకవర్గాలపై అంతే దృష్టిని సారిస్తాయి పార్టీలు. అలా కోల్ బెల్ట్ ఏరియాలో రసవత్తర రాజకీయాలకు కేరాఫైన రామగుండంలో పరిస్థితేంటి..? ఎండాకాలానికి మాత్రమే పరిమితం కాకుండా.. ఎన్నికల వేళ కూడా రాజకీయ అగ్నిగుండంలా కనిపించే రామగుండంలో ఈసారి అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి ఏవిధంగా ఉండబోతోంది…? ప్రధాన ప్రత్యర్థులెవ్వరు..? కాక రేపిన రెబల్స్ ఎన్నికల్లో అధికారపార్టీకి సహకరిస్తారా..? అధికార పార్టీలో అసలెందుకంత అంతర్గత సంక్షోభానికి దారితీసింది..? తెలుసుకోవాలంటే ఓసారి బొగ్గుబావుల వైపు అడుగులేద్దాం పదండి.

ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థిగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్.. గత ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి.. చివరి నిమిషంలో ఏఐఎఫ్బీ నుంచి టిక్కెట్ పొంది గెల్చినవారే. ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకుని కారెక్కిసిన చందర్.. ఈసారి భాజాప్తా బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే, గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పోటీ చేశారు. అయితే ఎన్నికల్లో గెలిచిన చందర్ బి.ఆర్. ఎస్. లో చేరిపోయారు.

చాలాకాలంగా గులాబీపార్టీకే మద్దతు తెలుపుతున్న కోల్ బెల్ట్ ఏరియాలో… నాయకుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అయితే, ఎమ్మెల్యేగా గెల్చాక కోరుకంటి చందర్ మిగిలినందరితో కలిసిపోలేకపోవడంతో… అది కాస్తా ముదిరింది. ఎన్నికల వేళ చందర్ కు టిక్కెట్ ఇవ్వొద్దంటూ రామగుండం బీఆర్ఎస్ లో కీలక నేతలైన కందుల సంధ్యారాణి, మిరియాల రాజిరెడ్డి, కొంకటి లక్ష్మీనారాయణ వంటివారెందరో ర్యాలీలు నిర్వహించడం.. మీడియా సమావేశాల్లో వెల్లడించడం.. ఆ తలబొప్పంతా మంత్రి కేటీఆర్ వరకూ వెళ్లడం.. ఆ తర్వాత సద్దుమణిగినట్టు కనిపించినా… అది తాత్కాలికమే అయి ఇప్పుడు ఎన్నికల వేళ మళ్లీ రెబల్స్ సవాళ్లు విసురుతున్నారు.

రామగుండంలో ఈసారి చతుర్ముఖ పోటీ కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా.. కాంగ్రెస్ నుంచి తనకున్న సానుభూతి పవనాలతో రాజ్ ఠాకూర్ సవాల్ విసురుతున్నారు. ఇక బీజేపీకి రాజజీనామా చేసిన  మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్ గా, లేదా గత ఎన్నికల్లో చందర్ కు కలిసివచ్చిన సింహం గుర్తు పార్టీ ఏఐఎఫ్బీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు  కనిపిస్తున్నాయి. రామగుండం ఎమ్మెల్యే మాకొద్దంటూ ర్యాలీలు తీసి చర్చనీయాంశంగా మారి బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రెబల్ నేత.. పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కూడా బరిలో ఉంటారని అంటున్నారు.

రామగుండం ఫెర్టిలైజర్ కార్పోరేషన్ లిమిటెడ్ తిరిగి ప్రారంభమయ్యే క్రమంలో పలువురు నిరుద్యోగుల నుంచి సుమారు 42 కోట్ల రూపాయల వరకు ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి డబ్బులు వసూళ్లు చేసినవాళ్లలో ఎమ్మెల్యే, ఆయన అనుచరులదే కీలకపాత్ర అనే ప్రచారం ముమ్మరంగా సాగడమే చందర్ పుట్టి ముంచేవరకూ తీసుకెళ్లింది. దాంతో కొందరు అనుచరులపై తాత్కాలికంగా పెట్టీ కేసులు పెట్టించి.. ఆ తర్వాత వాటని కొట్టేయించి.. మళ్లీ తనతో తిప్పుకుంటున్నాడనే అపవాదు బలంగా ఉంది.

రామగుండంలో చందర్ కు టఫ్ ఫైట్ ఇచ్చేదెవ్వరు… అసెంబ్లీ సెగ్మెంట్ ను చేజిక్కించుకునేదెవ్వరు..? సానుభూతితో రాజ్ ఠాకూర్ గట్టెక్కేస్తారా…? సోమారపు సత్యనారాయణ తన అనుభవనాన్ని రంగరించి బరిలో గిరి గీస్తారా…? మహిళా రిజర్వేషన్లకూ కేంద్రం తెరతీసిన నేపథ్యంలో.. అధికార బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా.. ఓ మహిళగా కందుల సంధ్యారాణి సింపతీ గెయిన్ చేయగలరా…? మరి వీటన్నింటినీ చందర్ ఏ మేరకు ఎదుర్కోగలడనే విశ్లేషణలు ఇప్పుడ రామగుండం బొగ్గుబావుల్లో జరుగుతున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి