రియాల్టీ రంగాన్ని దెబ్బకొట్టిన కాంగ్రెస్ సర్కారు..

By KTV Telugu On 20 September, 2024
image

KTV TELUGU :-

హామీల హోరు, ప్రకటనల జోరు, ఆశలు నెరవేరక జనం బేజారు అన్నట్లుగా తయారైందీ తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముంచేసిందని…అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి పెద్ద పీట వేసిందని ఆగ్రహం చెందిన ఓటర్లు కాంగ్రెస్ ను గెలిపిస్తే.. పరిస్థితి దొందు దొందే లాగా తయారయ్యారని సగటు తెలంగాణవాసి ఆవేదన చెందుతున్నారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు చేసిన హడావుడికి ఎన్నికల తర్వాత నత్తనడకన జరుగుతున్న పనులకు పొంతనలేకుండా పోయింది. సోనియమ్మ రాజ్యం రాబోతోందంటూ.. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీల పేరుతో ఇచ్చిన 13 హామీల్లో కనీసం మూడు సక్రమంగా నిర్వర్తించడం లేదు. మహిళలకు ఉచిత బస్సులంటూ ఒక స్కీమును అమలు జరిపి… బస్సుల సంఖ్యను తగ్గించడంతో జనం నానా తంటాలు పడుతున్నారు. రైతు రుణమాఫీలో కూడా సాంకేతిక లోపాలతో కొందరికి అమలు కాలేదు. రెండు లక్షలకు పైగా ఒక్క రూపాయి అప్పు ఉన్నా… వారికి పైసా విదిలించలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ కారణంగా అన్నదాతలకు కొత్త అప్పులు దొరకడం లేదు. వంద రోజుల్లో అన్ని గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని జనం ఆగ్రహం చెందుతున్నారు. దేవుడి మీద ప్రమాణాలు చేసిన చెప్పిందంతా ఒట్టి మాట అయిపోయిందని ఆవేశపడుతున్నారు. ఎకరాకు 15 వేల సాయం, కౌలు రైతులకు 12 వేల భరోసా ఎటు పోయిందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి ఈ లోపే వర్షాలు, వరదలతో ఉత్తర తెలంగాణలో రైతుల నడ్డి విరిచినట్లయ్యింది. దాదాపు వెయ్యి కోట్ల నష్టంలో ప్రభుత్వం ఇచ్చేదెంత అని జనం ప్రశ్నిస్తున్నారు..

తెలంగాణ అంటే హైదరాబాద్… భాగ్యనగరం పచ్చగా ఉంటేనే తెలంగాణ కళకళలాడుతుంది. రాష్ట్రమొత్తం ఆదాయం ఒక ఎత్తు అయితే హైదరాబాద్ ఆదాయం ఒక్కటే ఒక ఎత్తు అని చెప్పాలి. హైదరాబాద్ కు రియల్ ఎస్టేట్ మాత్రమే లైఫ్ లైన్. రియల్ ఎస్టేట్ లేకపోతే హైదరాబాద్ లేదనే చెప్పాలి. రియల్ ఎస్టేట్ ఆదాయమే హైదరాబాద్ కు మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్ కం అని చెప్పక తప్పదు. డిసెంబరులో రేవంత్ రెడ్డి సీఎం పదవిని చేపట్టిన తర్వాత కాస్త ఉత్సాహం కనిపించినా ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం స్థబ్ధుగా ఉందనే చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని భారీ రియల్ ఎస్టేట్ కంపెనీలు అయోమయ స్థితిలోకి వెళ్లిపోయాయి. చిన్న కంపెనీలు దివాలా దిశగా పయనిస్తున్నాయి. దానితో ఆ రంగ నిపుణులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక స్పష్టమైన రియల్ ఎస్టేట్ పాలసీని ప్రకటించలేదు. దానితో నిర్మాణాలు కొనసాగించాలా వద్దా..కొంతకాలం చేతులు ముడుచుకుని కూర్చోవడమే మంచిదా అని రియల్టర్లు తేల్చుకోలేకపోతున్నారు.. రియల్ ఎస్టేట్ రంగానికి ప్రోత్సాహకాల విషయంలో రేవంత్ ప్రభుత్వం ఏమనుకుంటుందో అర్థం కాని దుస్థితి ఉంది. పైగా హైడ్రా అమలుతో హైదరాబాద్ నిర్మాణ పరిశ్రమ డోలాయమాన స్థితిలో పడిపోయింది. దీనితో కొనుగోలుదారులు వెనక్కి వెళ్లిపోతున్నారు. ఏది ఫుల్ ట్యాంక్ లెవెల్, ఏది బఫర్ జోన్ అర్థం కాక జనం ఇళ్లు,ఫ్లాట్స్ కొనేందుకు భయపడుతున్నారు. ఈ పరిస్థితే బిల్డర్లలో నిరాశ, నిస్పృహకు కారణమవుతోంది..

తొమ్మిదిన్నరేళ్లు పాలించిన బీఆర్ఎస్ సర్కారు గద్దె దిగి తొమ్మిది నెలలు దాటుతోంది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొన్ని అనుమానాలు రావడం సహజమే అవుతుంది. వ్యాపారుల్లో అయోమయ స్థితిని తొలగించడం ప్రభుత్వ బాధ్యత అని మరిచిపోకూడదు. మార్కెట్ ను గాడిలో పెట్టే చర్యగా పాత ప్రభుత్వ విధానాలను సమీక్షించి, రియల్ ఎస్టేట్ అనుకూల విధానాలను అమలుకు తీసుకురావాల్సి ఉంటుంది. అయితే తెలంగాణలో పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. ఎలాంటి నిర్ణయాలు ప్రకటించకపోగా రియల్ ఎస్టేట్ కు అనుకూలంగా ఉన్న వాటిని కూడా రివర్స్ చేస్తున్నారు…

రేవంత్ రెడ్డి సీఎం పదవిని చేపట్టిన కొద్ది రోజులకే…రాయదుర్గం నుంచి శంషాబాద్ కు ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని ప్రారంభించిందన్న అక్కసుతోనే రేవంత్ ….రద్దు ప్రకటన చేశారని చెప్పుకోవాలి. దీనితో పడమటి హైదరాబాద్ లో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న రియల్ ఎస్టేట్ రంగం అకస్మాత్తుగా స్లో అయిపోయింది. ఫార్మా సిటీ ప్రాజెక్టును ఆపేస్తున్నామని ప్రకటించడంతో ఆ ప్రాంతంలోనూ రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే పరిస్థితి వచ్చింది. అయితే న్యూ సిటీ లేదా ఫోర్త్ సిటీ ప్రాజెక్టును ప్రకటించడంతో ఆ ప్రాంతంలో మాత్రం కొంతమేర నిలదొక్కుకుంది. అయినా సరే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కూనారిల్లుతోందనే చెప్పక తప్పదు.

తెలంగాణ ప్రభుత్వ వైఖరే రియల్ ఎస్టేట్ దెబ్బతినడానికి కారణమవుతోందని ఆ రంగ నిపుణులు బాహాటంగానే చెబుతున్నారు. తొమ్మిది నెలలుగా రియల్ ఎస్టేట్ బిల్డర్లతో ఒక్క సమావేశం నిర్వహించలేదు. వారి అభిప్రాయాలను తెలుసుకునే చర్యలు చేపట్టలేదు. దానితో అనుమానాలు పెరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్టులు తగ్గిపోయాయి. అమ్మకాలు ముందుకు సాగడం లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 111 జీవోను రద్దు చేసినప్పటికీ విధానపరంగా స్పష్టత ఇవ్వకుండా వదిలేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 111 జీవోపై ఇంతవరకు తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదు. 111 జీవో పరిధిలో నిర్మాణాలపై ప్రభుత్వ వైఖరి ఇంకా వెల్లడి కాలేదు. బిల్డర్లు మాత్రమే కాకుండా సాధారణ పౌరులు కూడా దీనిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాము కొనుక్కున్న 200 లేదా 300 గజాల పరిస్థితేమిటని ప్రశ్నిస్తున్నారు..

కొత్త ప్రాజెక్టులకు అనుమతులివ్వడంలో జరుగుతున్న జాప్యం తీవ్ర నష్టాలకు దారితీస్తోందని వ్యాపారులు వాపోతున్నారు. కొనుక్కున్న స్థలాల్లో ప్రాజెక్టులు ఆగిపోతే వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని వాపోతున్నారు. ప్రాజెక్టులకు పర్మిట్లు ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. పర్మిట్లు ఇస్తున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ అవి తూతూ మంత్రంగా సాగుతున్నాయని, అందులో ఉన్న అవరోధాలు తొలగించేందుకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వమే బాధ్యత వహించి చొరవ చూపించాలని కోరుతున్నారు..

రియల్ ఎస్టేట్ పై హైడ్రా ప్రభావం గణనీయంగా కనిపిస్తోంది. దాని వల్ల నగరంలో రియల్ ఎస్టేట్ లావాదేవీలు బాగా తగ్గాయి. ఆగస్టు నెలలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. జూలైతో పోల్చితే ప్రభుత్వానికి 320 కోట్లు ఆదాయం తగ్గిందని సంబంధిత శాఖలు చెబుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ – మల్కాజ్ గిరి, సంగారెడ్డి జిల్లాల్లో జూలై నెలలో 58 వేల రిజిస్టేషన్లు జరిగితే, ఆగస్టులో అది 41 వేలకు తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. జూలై నెలలో రెవెన్యీ 11 వందల కోట్లుగా ఉంది. ఆగస్టుకి అది 780 కోట్లకు పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగుతోందని, సెప్టెంబరులో కూడా ఆదాయం బాగా పడిపోతుందని చెబుతున్నారు…

ప్రభుత్వానికి ఆదాయం పడిపోయిందని చెప్పేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. రిజిస్ట్రేషన్లు జరగడం లేదంటే.. క్రయవిక్రయాలు ఆగిపోయాయని అర్థం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు శాపంగా మారిందని అర్థం. వందల కోట్లు పెట్టుబడి పెట్టిన రియల్టర్లు నెత్తిన చెంగు వేసుకుని కూర్చున్నారన్నది ప్రధానాంశం. అసలు పోయే, వడ్డీ పోయే అని చెప్పుకోవాల్సిన దుస్థితిలో వారున్నారని గుర్తించాలి. మరి అలాంటప్పుడు ప్రభుత్వం చొరవ చూపాల్సిన అనివార్యత ఉంది.ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక వనరుగానూ, వేలాది మందికి ఉపాధి కల్పించేదిగానూ ఉన్న రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడేందుకు ఒక స్పష్టమైన పాలసీ తీసుకురావాలి. నిర్మాణ రంగంపై నూతన పాలసీ వస్తేనే రియల్ ఎస్టేట్ నిలదొక్కుకుంటుంది. లేనిపక్షంలో బీఆర్ఎస్ ను సాగనంపి రేవంత్ రెడ్డిని అధికారంలోకి తెచ్చినందుకు జనం తలపట్టుకు కూర్చునే పరిస్థితి వస్తుంది. రియల్ ఎస్టేట్ పై ఆధారపడే వ్యాపారులు, మరికొన్ని రంగాలు దెబ్బతినకుండా కూడా చూసుకోవాలి కదా….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి