రేవంత్ జోరు – బీజేపీ, బీఆర్ఎస్ చేతులెత్తేశాయా ?

By KTV Telugu On 3 February, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలో జరగాల్సిన లోక్ సభ ఎన్నికల విషయంలో రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. పార్టీ కి ఉన్న ఊపును కొనసాగించేందుకు ఆయన భిన్నమైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. పరిపాలన జోరు చూపిస్తూనే పార్టీ అంశాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ ఇప్పుడిప్పుడే కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా తెలంగాణ పై సమయం వెచ్చించడం దండగన్నట్లుగా ఉండటంతో  ఈ సారి కి తెలంగాణ గ్రౌండ్ ను కాంగ్రెస్ కు వదిలేసినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.

పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. జాతీయ  పార్టీకి అవసరమైన లోక్ సభ సీట్లను అంచనాలకు తగ్గట్లుగా అందించి  హైకమాండ్ వద్ద మరింత నమ్మకం  పెంచుకునేందుకు రేవంత్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అదే సమయంలో పది కంటే ఎక్కువ స్థానాలు గెలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఊహించని స్థాయిలో బలపడుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు మఖ్య నేతలంతా  లోక్‌సభ సీట్లలో గెలుపును అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుంటున్నారు.  ప్రత్యేక వ్యూహం అమలు చేస్తున్నారు.   బీఆర్ఎస్, బీజేపీలకు అభ్యర్థుల విషయంలో సమస్యలు ఉన్నాయి. కానీ ఆ పార్టీల్లో ఉన్న వారు కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తే .. పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే బలమైన అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని ఈ విషయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కేటాయించిన స్ట్రాటజీనే అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో సునీల్ కనుగోలు టీం ప్రత్యేకమైన నివేదికలు రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఏఐసీసీ స్ట్రాటజిస్టు సునీల్ కనుగోలు సర్వే ఆధారంగానే సీట్లను ఎంపిక చేస్తున్నారు.. అయితే   టీపీసీసీ, ఏఐసీసీ సమన్వయంతో ఓ జాబితాను తయారు చేస్తున్నారు. దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత టీ పీసీసీ కమిటీ స్క్రీనింగ్ చేస్తుంది.  సీఎం రేవంత్ రెడ్డి కూడా అభ్యర్తుల అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.  ఇటీవల ఎమ్మెల్యే టికెట్లు పొందలేని నేతలతో పాటు పోటీ చేసి ఓడిపోయినోళ్లు, కాంగ్రెస్ పార్టీలో మొదట్నుంచి పనిచేస్తున్న నేతలంతా ఎంపీ టికెట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు సీఎం, మంత్రుల చుట్టూ టికెట్ల కోసం తిరుగుతుంటే, మరికొందరు ఏకంగా ఢిల్లీలోనే మకాం వేసి తమ దైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పవర్‌లో ఉన్నందున ఈసారి ఎంపీ టికెట్లకు ఎక్కువ పోటీ నెలకొన్నది.

17 ఎంపీ సీట్లు ఉండగా  హైదరాబాద్ విషయంలో ఆశలు పెట్టుకునే అవకాశం లేదు. ఆదిలాబాద్ కూడా ఆశల్లేని నియోజకవర్గంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి భారీ తేడా రావడంతో రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.   ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు.  ఇంద్రవెల్లి నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇంద్రవెల్లిలో భారీ సభ నిర్వహించిన ఆయన సీఎం అయిన తర్వాత కూడా తొలి సభను అక్కడే నిర్వహించబోతున్నారు. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్మృతి వనానికి శంఖుస్థాపన చేయనున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తొలి సభ కావడం పార్లమెంట్ ఎన్నికల సన్నాహాకం కావడంతో  అందరి దృష్టి ఉంది. ఈ సభ తర్వాత  ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రేసులోకి వస్తుుందని నమ్ముతున్నారు. మొత్తంగా 10 నుంచి 12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.   ఈ సారి కాంగ్రెస్ పార్జీకి పాజిటివ్ వాతావరణం ఉండటంతో చాలా మంది సీనియర్లు తమ కుటుంబసభ్యులను బరిలోకి  దించాలనుకుంటున్నారు. భార్యలను.. తమ్ముళ్లను.. ఇతర బంధువుల్ని ఎంటర్ టెయిన్ చేసే పరిస్థితి లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అభ్యర్థులు అందరూ సీరియస్ క్యాండిడేట్స్ ఉంటారని.. పార్టీ బలానికి వారి బలం కూడా తోడయ్యేలా అభ్యర్థులు ఉంటారని చెబుతున్నారు.

బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తామని చాలా మంది ముందుకు వస్తున్నారు కానీ వారిలో పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఎంత మంది అన్నదానిపై మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది.  ఎవర్ని నిలబెట్టినా సెంటిమెంట్ ప్రభావంతో గెలిచేస్తారన్న వాతావరణం లేదు. పార్టీ బలం కన్నా వ్యక్తిగత ఇమేజ్ కూడా బలంగా ఉన్న లీడర్లు కావాలి. అలాంటి వారు బీఆర్ఎస్ కు కరవయ్యారు. దీంతో బలమైన అభ్యర్థులు దొరకకే రేసులోనుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

మరో వైపు   తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల విషయంలో బీజేపీ పెద్దగా ఆసక్తి లేనట్లుగా వ్యవహరిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక్క సారే అమిత్ షా వచ్చి అంతర్గత సమావేశం నిర్వహించి వెళ్లారు. కానీ పబ్లిక్ మీటింగ్స్ పెట్టలేదు. తాజాగా ఆయన పర్యటనకు రావాల్సి ఉన్నా చివరి క్షణంలో రద్దు చేసేశారు. అంతే కాదు.. ఇప్పటివరకూ తెలంగాణ ఇంచార్జులుగా కీలక బాధ్యతలు నిర్వహించిన తరుణ్ చుగ్, ప్రకాష్ జవదేకర్ వంటి వారిని కూడా వేరే రాష్ట్రాలకు పంపించారు. ప్రకాష్ జవదేకర్ ఎన్నికల ఇంచార్జుగా వ్యవహరించారు.  తరుణ్ చుగ్‌కు లద్దాఖ్ బాధ్యతలు ఇచ్చారు. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి సారించలేకపోతున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. కొన్ని పార్టీ వ్యవహారాలు.. కొన్ని రోజులు అధికార వ్యవహారాలకు కేటాయించాల్సి వస్తోంది. మరో వైపు ఎంపీ టిక్కెట్ల కోసం పోరాటం ఓ రేంజ్ లో జరుగుతోంది. పార్టీ నేతల మధ్య అంతర్గత పోరాటంతో.. ఎవరూ మాట వినే పరిస్థితి లేకపోవడంతో.. పార్టీ హైకమాండ్ కూడా లైట్ తీసుకుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   మొత్తంగా తెలంగాణలో రాజకీ పరిస్థితులు  కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి