రేవంత్ మారిపోయారు

By KTV Telugu On 13 December, 2023
image

KTV TELUGU :-

కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అత్యంత వేగంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాయకుడిగా చరిత్ర సృష్టించిన రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేయడానికి  పకడ్బందీ వ్యూహాలతో  దూసుకుపోతున్నారు. మంత్రులకు శాఖల కేటాయింపులో తనదైన ముద్ర వేసిన రేవంత్ రెడ్డి హుందాగా వ్యవహరిస్తూ  మంచి మార్కులే కొట్టేస్తున్నారు. మరోవైపు ప్రజాదర్బార్ నిర్వహణతో వేలాది మంది ప్రజలకు చేరువ అయిపోయారు. ఇదే పద్ధతిని ఇలాగే కొనసాగిస్తే  రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో  నిలిచిపోవడం ఖాయమంటున్నారు రాజకీయ  పండితులు. ముఖ్యమంత్రి కాకముందు ఆయనలో కనిపించే దూకుడు  ఇపుడు కనపడ్డం లేదు. అది  అద్భుతమైన  పరిణతికి నిదర్శనమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల హామీల అమలుపై దృష్టి సారిస్తూనే అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా ఆయన వ్యవహరిస్తున్నారు.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కేవలం ఆరేళ్లు అయ్యిందంతే. ఇంత స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని ..అక్కడి ఆచారాలను   అధ్యయనం చేసి వాటిని పట్టుకోవడంలోనే రేవంత్ రెడ్డి తొలి విజయం సాధించారు. పార్టీలోని సీనియర్లతో మొదట్లో  ఇబ్బందులు విబేధాలు వచ్చినప్పటికీ చాలా తెలివిగా కూల్ గా అన్నీ సరిదిద్దుకుంటూ ఆయన ఎన్నికల ఏరు దాటారు.  అదృష్టం బాగుండి కాంగ్రెస్ పార్టీకి అనుకూల వాతావరణం కూడా ఏర్పడ్డంతో కాంగ్రెస్ పార్టీ విజయం తేలిక అయ్యింది. అయితే  గ్రేటర్ పరిధిలోని 24 నియోజక వర్గాల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోవడం రేవంత్ రెడ్డికి కూడా మింగుడు పడని  విషయమే. దీనిపై ఆయన ఆత్మపరిశీలన చేసుకుంటూనే ముఖ్యమంత్రిగా  తనదైన ముద్ర వేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెను వెంటనే ఆయన ఎక్కువ రోజులు  సమయం తీసుకోకుండా  ప్రజాదర్బార్ కు శ్రీకారం చుట్టారు. ఉదయాన్నే  ప్రజలు  జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్ కు తండోపతండాలుగా వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నేరుగా తమ  సమస్యలు చెప్పుకుంటున్నారు. వారి సమస్యలను  పద్ధతి ప్రకారం ఓపిగ్గా వింటూ వారి ఫిర్యాదులు స్వీకరిస్తూ  వాటిని మానిటర్ చేయాల్సిందిగా అధికారులకు తక్షణ ఆదేశాలిస్తూ రేవంత్ రెడ్డి మంచి మార్కులు కొట్టేశారు. మూడు రోజుల్లోనే ఏడు వేలకు పైగా ఫిర్యాదులు అందుకున్నారు. ఫిర్యాదులు అందుకోవడమే కాదు వాటి స్టేటస్ ఏంటో ఫిర్యాదు దారుల ఫోన్లకు మెసేజీల రూపంలో తెలియ జేస్తున్నారు. దీంతో ప్రజలు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు కూడా తమ గోడు వినే పరిస్థితి ఉండేది కాదని..ఇపుడు సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రికే చెప్పుకోగలుగుతున్నామని  ప్రజలు ఎగిరి గంతేస్తున్నారు.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి  ప్రజాదర్బార్ సంస్కృతికి శ్రీకారం చుట్టిన మొట్ట మొదటి ముఖ్యమంత్రి.  ఆయన మరణానంతరం ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన రోశయ్య కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ  ప్రజాదర్బార్ నిర్వహించలేదు. రాష్ట్ర విభజన తర్వాత తొమ్మిదేళ్ల పాటు బి.ఆర్.ఎస్. అధికారంలో కొనసాగింది. ఆ సమయంలోనూ ప్రజల నుండి  ఫిర్యాదులు స్వీకరించడమనే పద్ధతిని అమలు చేయలేదు. 14సంవత్సరాల తర్వాత  రేవంత్ రెడ్డి రూపంలో   వై.ఎస్. ఆర్.   మొదలు పెట్టిన ప్రజాదర్బార్ తిరిగి  తెరపైకి వచ్చింది. ఫిర్యాదులు స్వీకరించే క్రమంలోనూ రేవంత్ రెడ్డి చిరునవ్వు చెదరకుండా ప్రజలతో ఆత్మీయంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వానికీ..పార్టీకి కూడా మంచి పేరు తెస్తుందని పార్టీ వ్యూహకర్తలు సైతం భావిస్తున్నారు.న

అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీల్లో రెండింటిని  అమల్లోకి తెచ్చేశారు. మిగతా నాలుగు గ్యారంటీలను  100 రోజుల లోపే  అమల్లోకి తెస్తామని భరోసా ఇచ్చారు. ముందుగా  ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత  ప్రయాణ సదుపాయాన్ని అందించే  మహాలక్ష్మి పథకం ,  ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం కూడా అమల్లోకి వచ్చేశాయి.  మహాలక్ష్మి పథకం అమలు కావడంతోనే రాష్ట్రంలోని మహిళా లోకం ఆనందం వ్యక్తం చేస్తోంది. ఈ పథకం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని అమ్మాయిలు కూడ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక పార్టీలోని సీనియర్లు కూడా రేవంత్  రెడ్డితో సన్నిహితంగా ఉంటున్నారు. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి వారు రేవంత్ ను ప్రత్యేకంగా అభినందించి ఆశీర్వదించడం కూడా కాంగ్రెస్ పార్టీలో గొప్ప విషయంగానే చెబుతున్నారు.

ఇక రాజకీయాల్లో  రేవంత్ రెడ్డి  పై ఎక్కువగా  విమర్శలు చేసే మాజీ ముఖ్యమంత్రి  బి.ఆర్.ఎస్. అధినేత కేసీయార్  తుంటి ఎముక సమస్యతో ఆసుపత్రిలో  ఆపరేషన్ చేయించుకుని  వైద్యుల పర్యవేక్షణలో ఉంటే  రేవంత్ రెడ్డి ఈగోలను పక్కన పెట్టి  ఆసుపత్రికి వెళ్లి కేసీయార్ ను పరామర్శించడం..ఆయనకు మంచి వైద్యం అందేలా చూడండంటూ అధికారులను ఆదేశించడం పై ప్రశంసల జల్లు కురుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా రేవంత్ రెడ్డి చాలా పరిణతితో హుందాగా వ్యవహరిస్తున్నారని  రాజకీయ పండితులు మెచ్చుకుంటున్నారు. బి.ఆర్.ఎస్. అభిమానుల మనసుల్లోనూ రేవంత్ మంచి మార్కులు సంపాదించారని వారు అంటున్నారు. మొత్తానికి  ప్రస్తుతం అనుసరిస్తోన్న వైఖరినే  నిలకడగా కొనసాగిస్తే రేవంత్ రెడ్డి మంచి ముఖ్యమంత్రిగా   చిరస్థాయిగా పేరు తెచ్చుకోవడం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి