రహస్య స్నేహితులు..?

By KTV Telugu On 7 May, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరంటారు. అవసరాన్ని బట్టి స్నేహం, అవసరం తీరాక వైరం మామూలేనంటారు. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య లోపాయకారి స్నేహం మొదలైందని అంటున్నారు.  రేవంత్ రెడ్డిని కాపాడేందుకు మై హూనా అంటున్నారూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ. అది బీజేపీ భయం వల్ల కావచ్చు. వేరే  ఏదైనా పరిస్తితుల వల్ల  కావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి..

పాత బస్తీ అనేది హైదరాబాద్ మహానగరంలో  ఓ బలమైన  ప్రాంతం. అక్కడ రాజకీయంగా ఎవరూ అడుగు పెట్టలేరు.  ఒక్క ఎంఐఎంకే అది సొంతమన్న ఫీలింగ్ వచ్చి చాలా రోజులైంది. అక్కడ ఎంఐఎం పాలనే  నడుస్తుంది. అధికారులు కూడా అక్కడి జనంతో పెద్దగా పెట్టుకోరు. బిల్లులు కడితే తీసుకుంటారు  తప్పితే, ప్రత్యేకంగా అడగరు.ఎంఐఎం కుడా స్థానిక ముస్లింల సంక్షేమం కోసం పనిచేస్తుందని చెబుతారు. అయితే పార్టీ  ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం చాలా తెలివైన నాయకుడని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో  అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి కొమ్ము  కాస్తూ ఆయన  తమ  ప్రయోజనాలను కాపాడుకుంటారు. పదేళ్లపాటు మౌనంగా ఆయన బీఆర్ఎస్ తో అంటకాగారు. బీఆర్ఎస్ తో ఆయన ఎంత క్లోజ్  అయ్యారంటే.. కేసీఆర్ ఉండే ప్రగతి భవన్లోకి ఆయనకు ఫ్రీ ఎంట్రీ ఉండేది. ఎంఐఎం నేతలు  నాలుగు తిట్లు తిట్టినా బీఆర్ఎస్ పెద్దలు సీరియస్  గా తీసుకునే వాళ్లు  కాదు.. ఇప్పుడు బీఆర్ఎస్  దిగిపోయి  కాంగ్రెస్ అధికారానికి వచ్చిన వేళ ఐఎంఎం కూడా ప్లేట్ ఫిరాయించింది. తెలంగాణ అధికార పార్టీతో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తోంది….

ఎంఐఎంకు బీజేపీ భయం పట్టుకుందని వార్తలు వస్తున్నాయి. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత దూసుకుపోతున్న తీరు  చూస్తే హైదరాబాద్ లోక్ సభా స్థానంలో ఏదో జరగబోతోందన్న భయం ఎంఐఎం వర్గాల్లో  కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు ఎంఐఎం  స్లోగా కాంగ్రెస్ వైపుకు జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒవైసీ మద్దతిస్తున్నారు…

బీజేపీ చాలా  కాలంగా  పాతబస్తీపై స్పెషల్  ఫోకస్ పెట్టింది. బండి సంజయ్ టీబీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తుర్రు తుర్రుమని పాతబస్తీకి వెళ్లేవారు.  చార్మినార్ కు  ఆనుకుని ఉన్న  భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్లి ఒట్లు  పెడుతుండేవారు. ఆ క్రమంలో పాతబస్తీ హిందువుల్లో భావోద్వేగాలను ఆయన రెచ్చగొట్టారనే చెప్పారు. పైగా ఒకటి రెండు సార్లు కేంద్ర హోం మంత్రి అమిత్  షాను  కూడా పాతబస్తీకి తీసుకెళ్లి పబ్లిసిటీ చేశారు.  కిషన్ రెడ్డి  టీబీజేపీ అధ్యక్షుడయ్యాక కూడా ఆ పని కొనసాగింది. ఇప్పుడు లోక్  సభ ఎన్నికల వేళ..తెలంగాణ మొత్తం  హైదరాబాద్ పాతబస్తీ చర్చే జరుగుతోంది.. మాధవీలత ప్రచారంలో దూసుకుపోతున్న తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ క్రమంలో పోటీ  అసదుద్దీన్, మాధవీలత మధ్య  ఉందని తేల్చేశారు. అక్కడ కాంగ్రెస్,బీఆర్ఎస్  అభ్యర్థులెవ్వరో కూడా తెలియడం లేదు. హైదరాబాద్ లోక్ సభా నియోజకవర్గం వరకు ఆ రెండు పార్టీలు డమ్మీలయ్యాయని  చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత  రేవంత్ రెడ్డి కావాలనే డమ్మీ  అభ్యర్థిని పెట్టారన్న చర్చ కూడా జరుగుతోంది. అందుకు ఒక  కారణం కూడా ఉంది.  రేవంత్ కు శత్రువులు  పెరిగిపోతున్న తరుణంలో అసద్ ఆయనకు రహస్య  మద్దతిస్తున్నారని చెబుతున్నారు. రేవంత్ నాయకత్వానికి  ఎసరు వస్తే అవసరాన్ని బట్టి ఎంఐఎం ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతిచ్చే అవకాశం కూడా ఉందని  అంటున్నారు. మరో పక్క రాష్ట్రంలో ముస్లింలు కాంగ్రెస్ కు ఓటేయ్యాలని అసద్ ఓ సందేశం పంపినట్లు కూడా  వార్తలు వస్తున్నాయి…

అసదుద్దీన్ ఈ మధ్య ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్ల పాటు ఎలాంటి చీకు చింతా లేకుండా  అధికారాన్ని కొనసాగిస్తుందని ఆయన ప్రకటించారు.కాంగ్రెస్  నేతలు కూడా చెప్పని మాట అసద్ చెప్పారు.  ఇదీ రేవంత్ కు అసద్ ఇస్తున్న మద్దతు. నిజంగా అది అజెండా  నెంబర్ టూ కావచ్చు. పాతబస్తీలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వకుండా చూసుకోవడం అజెండా నెంబర్  వన్ అని చెప్పాలి. ఎందుకంటే  అసద్ కు పాతబస్తీపై పట్టు చాలా అవసరం…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి