రేవంత్ కు ఆ మూడింట భయం !

By KTV Telugu On 14 May, 2024
image

KTV TELUGU :-

తెలంగాణలోని 17 లోక్ సభా నియోజకవర్గాల్లో మెజార్టీ స్థానాలు తమకే  దక్కుతాయని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. ఒకటి రెండు ఎక్కువ వచ్చినా ఆశ్చర్యం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే మూడు నియోజకవర్గాలు మాత్రం ఆ పార్టీని టెన్షన్ పెట్టిస్తున్నాయి. అక్కడి గెలుపు వాళ్లకు చాలా అవసరం కావడంతో ఓడితే ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పరువు పోతుందోనని కాంగ్రెస్ జనం భయపడుతున్నారు….

ఓటరు దేవుడి మనోగతం ఎలక్ట్రానిక్  ఓటింగ్ యంత్రంలోకి చేరిపోయింది. ఎవరికి ఎవరు  ఓటేశారో  చెప్పడం కూడా కష్టమే అవుతుంది. తెలంగాణలో 17 నియోజకవర్గాలుండగా.. మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగానే ప్రచారం చేశాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తాము అమలు చేస్తున్న గ్యారెంటీలతో ఎక్కువ సీట్లు గెలుస్తామని చెబుతోంది. ఉత్తర తెలంగాణ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని కాంగ్రెస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. అయితే మూడు నియోజకవర్గాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. అక్కడ సీఎం రేవంత్ విస్తృతంగా ప్రచారం చేసి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పేరుకే అభ్యర్థులున్నప్పటికీ అసలు అభ్యర్థి  తనే అన్నట్లుగా రేవంత్ ప్రవర్తించారు.  దీంతో.. ఆ మూడు స్థానాల్లో వచ్చే ఫలితం ఎలా ఉండనుంది? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అందులో మొదటిది  మొదటిది మల్కాజిగిరి. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బరిలోకి దిగి విజయాన్ని సొంతం చేసుకున్న రేవంత్.. ఆ తర్వాత నుంచి ఎదగటమే తప్పించి తగ్గింది లేదు. అయితే అక్కడ బీజేపీ తరపున రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. అదే ఇప్పుడు కాంగ్రెస్  పార్టీ టెన్షన్  కు కారణమవుతోంది. ఈటల స్థానికుడు కాకపోయినా మల్కాజ్ గిరిలో ఆయనకు మంచి పేరుందని చెబుతున్నారు. దానితో మల్కాజ్ గిరిలో టగ్ ఆఫ్ వార్ అయిపోయిందని తేల్చేశారు….

కాంగ్రెస్ టెన్షన్ పడుతున్న మిగతా రెండు స్థానాలు చేవెళ్ల, మహబూబ్ నగర్. పైగా పాలమూరు ప్రాంతం రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలోకి వస్తుంది. అక్కడ ఓడితే ముఖ్యమంత్రి సొంత ప్రాంతంలోనే మట్టికరిచారన్న అపవాదు మూటగట్టుకోవాల్సిన దుస్థితిలోకి నెట్టబడతారు. అందుకే రేవంత్ అక్కడ ఎక్కువ చెమటోడ్చారని చెబుతారు….

ఆ మూడు స్థానాల్లో ఏ ఒక్కటీ ఓడిపోయినా రేవంత్ కు కష్టకాలమేనని లెక్కగడుతున్నారు. అందుకే ఆయా నియోజకవర్గాల్లో రేవంత్ ఎక్కువ సార్లు పర్యటించారు. మల్కాజిగిరిలో అత్యధికంగా తొమ్మిది సభల్ని నిర్వహించారు రేవంత్.ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో సొంతం చేసుకోవాలని భావిస్తున్నా.. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఈటల రాజేందర్ కారణంగా ఫలితంపై ప్రభావం పడుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ఈ ఎంపీ స్థానం పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు ఒక్కస్థానం కూడా లేదు. చేవెళ్ల.. మహబూబ్ నగర్ రెండు చోట్ల ఏడేసి చొప్పున సభల్ని నిర్వహించటం ద్వారా  రేవంత్ తన ప్రాధాన్యతను చెప్పకనే చెప్పేశారు. ఎంపీ ఎన్నికల్లో భాగంగా రేవంత్ తెలంగాణ రాష్ట్రంలో53 సభల్లో పాల్గొంటే.. కేరళలో రెండు.. కర్ణాటకలో రెండేసి చోట్ల పాల్గొన్నారు. తెలంగాణలో ఆయన పాల్గొన్న 53 సభల్లో ఆ మూడు నియోజకవర్గాల పరిధిలోనే 22 సభల్లో పాల్గొనటం చూస్తే.. ఈ మూడింటి మీద ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపారన్నది అర్థమవుతుంది. అయితే.. ఆ మూడు చోట్ల బీజేపీ అభ్యర్థులు బలంగా ఉండటం రేవంత్ కు ఇబ్బంది కలిగించే అంశంగా చెబుతున్నారు.

జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు తాము మద్దతిస్తున్నామని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన  ప్రకటన.. ఆ మూడు నియోజకవర్గాలపై ఏ మేర ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి కూడా నెలకొంది. అసద్ మాటల కారణంగా ముస్లిం ఓటర్లు ఎటు వైపు ఓటేసారన్నది కూడా చూడాలి. ఏదేమైనా ఫలితాలు వచ్చే జూన్ 4 వరకు మాత్రం వేచి చూడాల్సిందే…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి