కాంగ్రెస్ లో రేవంత్ చిచ్చు…

By KTV Telugu On 25 April, 2024
image

KTV TELUGU :-

రాజకీయాల్లో ఒక డైలాగ్ పరిపరివిధాలుగా పోతుంది. అగ్రనేత ఒక మాట మాట్లాడారంటే వంద రకాల అర్థాలు తీసే వాళ్లుంటారు. ఇలా అని ఉండొచ్చు. అలా అని ఉండొచ్చు అని విశ్లేషించే  జనముంటారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒక మాటకు  కొత్త అర్థం వచ్చేసింది. నిప్పులేనిదే పొగరాదన్నట్లుగా ఆ డైలాగుకు చరిత్రను కూడా వెదికేవారు తయారయ్యారు. తన తర్వాత సీఎం అయ్యే అర్హత ఉన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డికి  మాత్రమేనని ప్రకటించి రేవంత్ ఒక తేనెతుట్టెను కదిలించారనే చెప్పాలి…

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల హోరు తారా స్థాయికి చేరింది. పార్టీలన్నీ జోరుగా ప్రచారం చేస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ వరుస బహిరంగ సభలతో ప్రచారాల వేడిని పెంచేసింది. ఇందులో భాగంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ సందర్భంగా జరిగిన సభలో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి . తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతి భవన్‌ కంచెలు కూలాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండా మోసి నేడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఈ స్థాయిలో ఉన్నారని ఆయన అన్నారు. ఇదే సమయంలో ఒక ప్రత్యేక సందర్భంలో తనకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పిన ఆయన.. ఆ పదవిని తాను బాధ్యతగానే చూసినట్లు తెలిపారు. ఇదే క్రమంలో.. తన తర్వాత ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డే అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో రేవంత్  రెడ్డి మాటలు కాంగ్రెస్  పార్టీలో   తీవ్ర చర్చనీయాంశమైంది. ఏవైనా ప్రత్యేక పరిస్థితులు ఏర్పడి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తే తన వారసుడిని ఆయనే  నిర్ణయించేశారని కొందరంటున్నారు. అసలు  ఆ మాట మాట్లాడటానికి రేవంత్ ఎవరూ అని ప్రశ్నించే వాళ్లూ ఉన్నారు….

కాంగ్రెస్  పార్టీలో ఎవరు, ఎప్పుడు, ఏ పదవిలో ఉంటారో చెప్పలేము. ఒకప్పుడు ఏడాదికి ఒక సీఎంను మార్చిన చరిత్ర  కాంగ్రెస్ పార్టీదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రేవంత్ దిగిపోవాల్సిన పరిస్థితే  వస్తే.. ఆ పదవికి ఆశావహులు చాలా మందే ఉన్నారు. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సీఎం ఎందుకు  ప్రమోట్ చేశారన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న…..

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు  చెందిన మల్లు  భట్టి విక్రమార్క ఇప్పుడు తెలంగాణ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్న మాట వాస్తవం. అందుకోసం ఎన్నికలకు ముందు భట్టి పాదయాత్ర కూడా చేశారు. రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ముందే డైసైడైనందున భట్టికి  అవకాశం రాలేదు. కాకపోతే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న భట్టీకి తర్వాత వచ్చిన రేవంత్ నాయకత్వంపై పెద్దగా ఆసక్తి లేదు. అందుకే ఆయన్ను లెక్కచేసేవారు కాదు. ఎన్నికల ముందు జరిగిన అనేక పబ్లిక్ మీటింగ్స్ లో రేవంత్  పేరును కూడా ప్రస్తావించలేదు. ఆ సంగతులన్నీ ప్రస్తుత సీఎంకు గుర్తుండే ఉంటాయి. పైగా రేవంత్, భట్టీ ఉత్తర ధృవం, దక్షిణ ధృవంగా రాజకీయాలు నడుపుతున్నారు. దానితో ఆయన ప్రస్తావన చేసే కంటే కోమటిరెడ్డిని ప్రమోట్ చేస్తేనే బెటరని రేవంత్ భావించి ఉండొచ్చు. అందుకే అవకాశం  దొరికినప్పుడు చిన్న  మాట అనేశారు….

రేవంత్ రెడ్డి కాకతాళీయంగా అనేశారా. దీర్ఘకాలిక వ్యూహంతో అనేశారా అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. రేవంత్ రెడ్డి టీమ్ ఇచ్చే బ్యాకప్ సమాచారంతో పాటు అనుకూల మీడియా నుంచి  వచ్చే ఫీడ్ బ్యాక్ కూడా జతచేసుకునే ఆయన మాట్లాడతారు. ఈ సారి కూడా అదే జరిగి ఉండొచ్చు.మరో సందర్భంలో ఆయన కోమటిరెడ్డిని సీఎం అంటూ ప్రస్తావించారంటే మాత్రం జరూర్ దాల్ మే కుఛ్ కాలా హై అని అనుకోవాల్సిందే….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి