ముఖ్యమంత్రి అనే పదవికి ఓ గౌరవం ఉంది. ఎలాంటి వారు అయినా ఆ పదవిలో కూర్చున్నప్పుడు ఆ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడాలి. కానీ తెలంగాణ యువత ఎన్నో ఆశలతో అధికారం కట్టబెట్టిన రేవంత్ రెడ్డి ఆ గౌరవాన్ని కాపాడుతున్నారా ?. అనుచితమైన భాషను బహిరంగసభల్లో ప్రయోగిస్తూ ఆయన సాధించేదేమిటి ? తన పదవి పోతుందని ఆయన భయపడుతున్నారా .. లేక పదవిలో ఉన్నానని భయపెట్టాలనుకుంటున్నారా ?
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి ఇలాంటి భాషతో ప్రారంభించారు. నా కొడకల్లారా అంటూ ప్రారంభించి మాననబాంబులమవుతామనే హెచ్చరిక వరకూ చేశారు. ఆయన భాష విష విని సభకు హాజరైన వారు కూడా ముందుకూ వెనక్కి చూసుకోవాల్సి వచ్చింది. మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా అని. ఎందుకంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డి ఇలాంటి భాష ప్రయోగించలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. కానీ దానికి భిన్నంగా జరుగుతోంది ?
రేవంత్ దారుణమైన భాషతో విరుచుకుపడటం ఇదే మొదటి సారి కాదు. ఆదిలాబాద్ లో.. కొడంగల్ లో జరిగిన సభల్లోనూ భాష విషయంలో కంట్రోల్ తప్పారు. బీఆర్ఎస్ పై విరుచుకుపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ లపై అనుచితమైన భాషతో తిట్లందుకుంటున్నారు ఇతర విషయాల్లో ఎలా ఉన్నా తన ప్రభుత్వ మనుగడ గురించి వ్యాఖ్యలు చేస్తున్న అంశంపై మాట్లాడే సమయంలో ఆయన పూర్తిగా కంట్రోల్ తప్పుతున్నారు. ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల తర్వాత పడిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తన ప్రభుత్వంపై కన్నేవారిని భయ పెట్టడానికన్నట్లుగా మాటలతో ప్రయత్నాలు చేస్తున్నాన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ ప్రజల్లో మాత్రం వేరే రకమైన సందేశం వెళ్తోంది. రేవంత్ రెడ్డి తన పదవి పోతుందని భయపడుతున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది.
రేవంత్ రెడ్డి భాషను సమర్థించేవారు కూడా ఉన్నారు. కాంగ్రెస్ నేతల్లో కూడా కొంత మంది ఇదేం భాష అని అసంతృప్తి వ్యక్తమవుతోంది.కానీ బయటపడలేరు. అయితే రేవంత్ ఏం చేసినా సరే ఓకే అనే జీ హూజూర్ బ్యాచ్ మాత్రం.. గతంలో బీఆర్ఎస్ నేతల భాష సక్కగా ఉందా అని ప్రశ్నించడం ప్రారంభించారు. గతంలో బీఆర్ఎస్ నేతల భాష సక్రమంగా లేదు. అధికారం ఉందన్న అహంకారంతో అందర్నీ చులకనగా చూసేవారు. అందుకే కదా ప్రజలు ఓడగొట్టారు. ఇప్పుడు వారు అన్నారని.. తాను అంటే… రేవంత్ రెడ్డి, కేసీఆర్ కు తేడా ఏముంది..?. ప్రజలు కేసీఆర్ ను కాదని రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టాల్సిన అవసరం ఏముంది ?. ఈ చిన్న లాజిక్ ను కాంగ్రెస్ .. ముఖ్యంగా రేవంత్ రెడ్డి మద్దతుదారులు మిస్సవుతున్నారు.
రేవంత్ రెడ్డి అధికారం చేపట్టి మూడు నెలలు మాత్రమే అయింది. పాలనలో ఆయన తనదైన ముద్ర ఇంకా వేయలేదు. గత ప్రభుత్వంలో ప్రక్రియ అంతా పూర్తయిన ఉద్యోగాల నియామక పత్రాలను అందించి… తానే భర్తీ చేసినట్లుగా చెప్పుకోవడం మాత్రమే చేస్తున్నారు. ఆరు గ్యారంటీ హామీల అమలులో గందరగోళం ఉంది. పద్దతి లేకుండా వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ది కోసం పథకాలను ప్రారంభిస్తున్నారు. కానీ అంతా గందరగోళమే. అడ్మినిస్ట్రేషన్ విషయంలోనూ అంత స్పష్టత కనిపించడం లేదు. ముందు రేవంత్ రెడ్డి పాలనలో తనదైన ముద్ర వేయాలి. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇతర పార్టీలు ప్రయత్నిస్తాయి.. అందులో దాపరికమేమీ ఉండదు. అధికారం లో ఉండి.. తన ప్రభుత్వాన్ని కాపాాడుకోలేకపోతే అది రేవంత్ వైఫల్యం అవుతుంది. ప్రజల నుంచి సానుభూతి రాదు. ముఖ్యంగా ఇలాంటి లాంగ్వేజ్ ను ప్రయోగించడం ద్వారా.. అయితే అసలు రాదు.
రేవంత్ రెడ్డి భాష విషయంలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తే… ప్రజాభిప్రాయం తెలుస్తోంది. మొదటి రెండు నెలలు ఎంతో సంయమనంతో ఉన్నట్లుగా కనిపించిన సీఎం ఇప్పుడు.. కంట్రోల్ తప్పుతున్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఆయన రాజకీయానికే మంచిదని కాదని అనుకోవచ్చు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…