తెలంగాణ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై అనుమానాలు కలుగుతున్నాయా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సహచరుల మధ్య సమన్వయం లోపించిందా. ఎవరికి వారు సూపర్ సీఎం అన్న ఫీలింగ్ వచ్చేసిందా. మంత్రులంతా సొంత పబ్లిసిటీకి ప్రాధాన్యమిస్తూ రేవంత్ నాయకత్వాన్ని పెద్దగా పట్టించుకోలేదా… తొలి యాభై రోజుల్లోనే సమిష్టితత్వం లోపించిందన్న అనుమానాలు కలుగుతున్నాయా….
బీఆర్ఎస్ సర్కారు దిగిపోయింది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై అర్థ శతదినోత్సవం దాటింది. ఆరు గ్యారెంటీల్లో రెండు మాత్రమే ప్రభుత్వం ప్రస్తుతానికి అమలు చేయగలిగింది. అందులోనూ ప్రభుత్వానికి తక్షణ వ్యయం లేని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపును మాత్రమే అమలుకు తెచ్చారు. ఇంకా నాలుగు గ్యారెంటీలు విషయంలో స్పష్టత రాలేదు. అధికారానికి వచ్చిన వంద రోజుల్లో అన్ని హామీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతుంటే… ఫిబ్రవరి మొదటి వారంలోనే అన్నీ పూర్తవుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సెలవిస్తున్నారు. అక్కడే మంత్రివర్గంలో తొలి వైరుధ్యం, విభేదం కనిపించాయి.50 రోజుల పాలనలో 99 శాతం ఫెయిల్యూర్ కనిపిస్తోందని బీఆర్ఎస్ పార్టీతో పాటు , ప్రభుత్వ వ్యతిరేక మీడియా కోడై కూస్తోంది. ఐనా రేవంత్ టీమ్ ఇప్పుడు బీఆర్ఎస్ ను తిడుతుందే తప్ప.. తమలో సమన్వయ లోపానికి కారణం ఏమిటో అంచనా వేసుకోలేకపోతోంది. ముఖ్యమంత్రికి మంత్రులకు మధ్య ఏదో దూరం పెరిగిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అసలు సీఎంను మంత్రులు పట్టించుకుంటున్నారా అన్న చర్చ కూడా ఊపందుకుంది. ఇటీవల వైద్య శాఖపై నివేదిక నిర్వహిస్తున్న సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే వైద్యారోగ్య శాఖామంత్రి దామోదర రాజనర్సింహ ఒళ్లు విరుచుకంటూ, ఆవులిస్తూ ఎటో చూస్తున్న సన్నివేశం కనిపించింది. రేవంత్ రెడ్డి మాటల్లో ఆయనకు ఆసక్తి ఉన్న దాఖలాలు కనిపించలేదు. సీఎంను కొందరు మంత్రులు పెద్దగా పట్టించుకుంటున్నట్లుగా కూడా అనిపించడం లేదు..
కాంగ్రెస్ పార్టీలో ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. ఛాన్స్ మిస్సయి రేవంత్ సీఎం అయ్యారని అనుకుంటున్న వాళ్లే. ప్రతీ ఒక్కరూ స్వాతంత్రం ప్రకటించుకున్న సామంతరాజుల్లాగే ప్రవర్తిస్తుంటారు. తెలంగాణలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది.రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా ఎవరికి వారు దర్బారు నిర్వహించుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ ఇమేజ్ కంటే పర్సనల్ ఇమేజ్ కు ప్రాధాన్యమిస్తున్నారు….
రేవంత్ కంటే ముందే సీఎం కావాలనుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అందులో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ లాంటి వారిని లెక్కించే వీలుంది. సీతక్క, కొండ సురేఖ లాంటి మహిళా మంత్రులు మాత్రమే తమ స్థాయిని అర్థం చేసుకుని రేవంత్ కు అనుకూలంగా ఉంటున్నారు. నిజానికి మంత్రివర్గంలో ఉన్న సీనియర్లంతా రేవంత్ కంటే ముందు నుంచే పార్టీలో ఉంటున్నారు. పార్టీ గెలిచిన తర్వాత సీఎం పదవిపై చర్చ జరిగినప్పుడు ఉత్తమ్, శ్రీధర్ బాబు కూడా రేసులో ఉన్నామంటూ కొంత హడావుడి చేశారు. దామోదర రాజనర్సింహ గతంలో డిప్యూటీ సీఎంగా చేశానని కూడా గుర్తుకు తెచ్చారు. ఇక డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కది ప్రత్యేకమైన శైలి. ఊరందరిదీ ఒక దారి అయితే ఉలిపికట్టెది మరో దారి అన్నట్లుగా ఆయన ప్రవర్తిస్తుంటారు. ఒక దశలో రేవంత్ కు సీఎం ఇవ్వకపోతే దళిత సామాజిక వర్గానికి చెందిన భట్టికి ఆ పదవి ఖాయమన్న చర్చ జరిగింది. వీటన్నింటిని గుర్తుపెట్టుకుని మరీ సీనియర్లు తమ రాజకీయాలను కొనసాగిస్తున్నారు. కోమటిరెడ్డి అయితే తనకు సీఎంకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటారు. పార్టీకి ఇబ్బంది కలిగినా ఆయన పెద్దగా పట్టించుకోకుండా తన శైలిలో స్పందిస్తుంటారు. ఒక మీటింగులో బీఆర్ఎస్ కు చెందిన జెడ్పీ చైర్మన్ తో గొడవ పడి మరీ ఆయన్ను బయటకు పంపిన తీరుతో కోమటిరెడ్డి విమర్శల పాలయ్యారు.ఆయన తీరు కాంగ్రెస్ పార్టీకి నచ్చకపోయినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆయన చాలా తెలివిగా పార్టీలో ఎవరినీ విమర్శించడం లేదు. పైగా ఇప్పుడు సీనియర్ మంత్రులంతా ఎవరి జిల్లాలో వాళ్లు సూపర్ సీఎంలుగా మారిపోయారన్న చర్చ జరుగుతోంది.ఉమ్మడి కరీంనగర్ జిల్లాను మంత్రి పొన్నం దున్నేస్తున్నారన్న చర్చ జరుగుతోంది.పార్టీ అనుమతిలో సంబంధం లేకుండానే కొంతమంది బీఆర్ఎస్ నేతలను పొన్నం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇటీవలే జమ్మికుంట మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్లు 13 మందిని ఆయన కాంగ్రెస్ లో చేర్చుకునే వరకు పీసీసీకి తెలియదని చెబుతున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నప్పటికీ ఆయన చూస్తూ ఊరుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా సీఎంతో సంబంధం లేకుండా సొంత అజెండాను అమలు చేస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.అయితే వాళ్లు చాలా తెలివిగా రేవంత్ ను పొగుడుతూ మంచి మార్కులు వేయించుకునేందుకు ఇష్టపడుతున్నారు…
లేటుగా వచ్చి లేటెస్తుగా సీఎం అయిన రేవంత్ ను ఎందుకు లెక్క చేయాలని మంత్రులు అనుకుంటూ ఉండొచ్చు. పైగా జాతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం మోతాడుకు మించి ఉండొచ్చు. ప్రతీ ఒక్కరికీ అత్యున్నత పదవిపై ఆకాంక్ష ఉండటంతో పోటీ పడాలన్న కోరిక ఉండొచ్చు. ఏదేమైనా సరే మొదటి యాభై రోజుల్లోనే రేవంత్ కు, మంత్రులకు మధ్య గ్యాప్ బాగానే పెరిగిందని చెప్పక తప్పదు. పైగా ప్రతీ ఒక్కరూ తమ ఆధిపత్యాన్ని చూపుంచుకోవాలని ప్రయత్నిస్తుంటారు కదా…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…