కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి లేదని.. ఆ పార్టీని తుక్డే తుక్డే గ్యాంగ్, అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఇప్పుడు చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. గతంలో మహాత్మాగాంధీతో సంబంధమున్న పార్టీ కాదన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మహారాష్ట్రలోని వార్దాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీలో విద్వేషం అనే దెయ్యం ప్రవేశించింది. అందుకే కాంగ్రెస్ పార్టీలో దేశభక్తి అనే ఆత్మ తుది శ్వాస విడిచింది. కాంగ్రెస్ నేతలు విదేశీ పర్యటన సందర్భంగా దేశ వ్యతిరేక అజెండాపై మాట్లాడుతుంటారు. ఇప్పటి కాంగ్రెస్ పార్టీ గణపతి పూజను కూడా ద్వేషిస్తోంది. స్వాతంత్య్ర పోరాటంలో లోకమాన్య తిలక్ నేతృత్వంలో గణపతి వేడుకలు దేశ ఐక్యతా ఉత్సవాలుగా మారాయి. గణపతి వేడుకల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనేవారు. అందుకే కాంగ్రెస్ పార్టీ గణపతి పూజ పట్ల వ్యతిరేక భావంతో ఉందని ప్రధాని మోడీ మండిపడ్డారు.
నేను గణేశ్ పూజ కార్యక్రమానికి వెళ్లాను.. దీంతో కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయం నిద్ర లేచింది. గణేశ్ పూజను కూడా వ్యతిరేకించటం మొదలుపెట్టింది. బుజ్జగింపు రాజకీయాల కోసం ఏమైనా చేస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం గణపతి బప్పాను కూడా కటకటాల వెనక్కి పంపింది. గణపతికి జరిగిన ఈ అవమానాన్ని చూసి దేశం మొత్తం ఉలిక్కిపడింది. కానీ, ఈ విషయంపై పార్టీ మిత్రపక్షాలు మాత్రం మౌనంగా ఉండటం ఆశ్చర్యంగా ఉంది. కాంగ్రెస్ చేసిన ఈ పాపాలకు మనం ఏకమై సమాధానం చెప్పాలి’ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను ప్రగతికి దూరంగా ఉంచిందని, కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రధానమంత్రి విశ్వకర్మ కార్యక్రమాల ద్వారా నిర్లక్ష్యానికి గురైన కళాకారులపై దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పీ విశ్వకర్మ చొరవ ద్వారా, చేతివృత్తుల వారికి రుణాలు, కొత్త యంత్రాలు అందిస్తున్నారు.
గత ప్రభుత్వాలు విశ్వకర్మ కళాకారుల స్థితిగతులపై దృష్టి సారిస్తే ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అయితే, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలను పురోగతికి అనుమతించలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ప్రధానమంత్రి విశ్వకర్మ చొరవతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు అత్యధికంగా లబ్ధి పొందుతున్నాయని ప్రధాని మోడీ తెలిపారు.
ఏడాది కాలంలో 18 వృత్తులకు చెందిన 20 లక్షల మందికి పైగా విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధి పొందారని, 8 లక్షల మందికి పైగా హస్తకళాకారులు నైపుణ్య శిక్షణ పొందారని ప్రధాని మోడీ తెలిపారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, వేల సంవత్సరాల నాటి నైపుణ్యాలను ఉపయోగించుకునే రోడ్‌మ్యాప్ అని అన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని మోడీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. విశ్వకర్మ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒక పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేశారు.
మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ప్రధాని మోడీ విమర్శలు గుప్పించారు. రాజకీయాలు, అవినీతి కోసమే కాంగ్రెస్ రైతులను ఉపయోగించుకుందని మోడీ అన్నారు. ‘తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతులను తిప్పించుకుంటోంది. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల జాగ్రత్త వహించి మరోసారి అవకాశం ఇవ్వకుండా చేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. శివసేన UBT చీఫ్ ఉద్ధవ్ థాకరే పేరు చెప్పకుండానే మహా వికాస్ అఘాడీ మహారాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు సృష్టించి విదర్భ ప్రాంత పత్తి రైతుల సమస్యలను పెంచిందని విమర్శించారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…