అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతామంటారు. నెలవంకను నేలకు దించి తలా కాసేపు చేతిలో పెడతామంటారు. ఏడాది తిరిగే సరికి చూస్తే గొంతెండిపోయే జనమే కనిపిస్తారు. శుష్కవాగ్ధానాలు చేయడం, శూన్య హస్తాలు చూపించడం ఏలిన వారికి బాగా అలవాటైపోయింది. అందులోనూ పాలకపక్షంలో విపక్షంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్ష నేతల కంటే పవర్ ఫుల్ ప్రకటనలు వదిలే సీఎం రేవంత్ రెడ్డికి ఈ అలవాటు బాగా ఎక్కువగానే ఉందని చెప్పాలి. గోరంత నిధులతో కొండంత మూసీని ప్రక్షాళన చేస్తానని చెప్పడం రేవంత్ కే చెల్లింది. ముందూ వెనుకా చూసుకోకుండా తిట్లపురాణం అందుకోవడం మినహా ఆయన చేస్తున్నదేమీ కనిపించడం లేదు. మూసీ ఒక్క రోజులో బాగయ్యిందీ లేదు, అవ్వదు కూడా. దానికి సుదీర్ఘ ప్రణాళిక, సంవత్సరాల తరబడి శ్రమ అవసరమని తెలిసి కూడా రేవంత్ రెడ్డి ఏదోటి మాట్లాడేసి… విపక్షాలపై విరుచుకుపడుతూ టైమ్ పాస్ చేస్తున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి..
రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో కొన్ని సందర్భాల్లో ఎవరికీ అర్థం కాదన్న విమర్శలూ ఉన్నాయి. మూసీ సుందరీకరణ కాదు.. దాన్ని పునరుజ్జీవం అనాలని రేవంత్ కొత్త వాదన అందుకున్నారు. పదం ఏదైతేనే… మూసీలో స్వచ్ఛమైన సాగునీరు, తాగు నీరు ప్రవహించాలని జనం కోరుకుంటున్నారన్నది మాత్రం నిజం. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అవే ప్రాజెక్టులు కొనసాగుతూ పేర్లు మారతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. పైగా అసలు సుందరీకరణ అన్న పేరు కాంగ్రెస్ వాళ్లు పెట్టిందేనని విపక్షాలు ఇప్పుడు నిలదీస్తున్నాయి. తర్వాత మూసీకి 141 కోట్ల బడ్జెట్ ఉంటే చాలని రేవంత్ ఓ సందర్భంలో అన్నారు. తర్వాత గుక్క తిప్పుకుని.. ప్రాజెక్టు రిపోర్టు సమర్పించేందుకు అయ్యే ఖర్చు అంత ఉంటుందని చెప్పుకున్నారు. మొత్తం వెయ్యి కోట్లతో మూసీ మొత్తం క్లీన్ అయిపోయి నందనవనంగా మారుతుందని రేవంత్ మరో క్షిపణి ప్రయోగం చేశారు. అంతవరకు బాగానే ఉన్నా అంత సొమ్ము సరిపోదని విపక్షాలు అంటున్నాయి. మూసీ మొత్తం క్లీన్ అయిపోయి సుందరంగా తయారవ్వాలంటే పాతిక వేల కోట్లు ఖర్చవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. దానికి కౌంటర్ వేసేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్న మాట వాస్తవం…
డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు..అంటే డీపీఆర్ ఎప్పుడు వస్తుంది.. ఇదీ కూడా పెద్ద ప్రశ్నే. మూసీ రివర్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు పేరుతో డీపీఆర్ సిద్ధం చేసేందుకు ఒక కన్సార్టియంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆ రిపోర్టు ఆధారంగా పనులు ప్రారంభించాలన్నది రేవంత్ రెడ్డి ఆలోచన. అయితే ఏ నిబంధనల ఆధారంగా డీపీఆర్ రూపొందించారో ముందే చెప్పాలి. ఎంత ఖర్చవుతుంది,,దానికి టైమ్ ఫ్రేమ్ ప్రకారం డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారు లాంటి అంశాలు కూడా జోడించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ఇప్పుడు విపక్షాలపై విరుచుకుపడుతున్నారు. నిజానికి డీపీఆర్ కోసమే 141 కోట్లు ఖర్చవుతున్నప్పుడు ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఎంత ఖర్చవుతుందని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు.. పైగా ఎప్పటికప్పుడు కాస్ట్ ఎస్కలేషన్ అంటే.. వ్యయ పెరుగుదల అనివార్యమవుతున్న తరుణంలో అదనపు నిధులను విడుదల చేయడమూ అనివార్యమవుతుంది.
రేవంత్ రెడ్డి కొంత గ్రౌండ్ వర్క్ చేసిన మాట నిజమే కావచ్చు. లండన్, సియోల్ పర్యటనల్లో అక్కడి నదులను చూసి మూసీని కూడా అలా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి లండన్, సియోల్ నగరాల్లో పర్యటించారు. లండన్ లో థేమ్స్ నది కూడా ఒకప్పుడు మూసీలాంటి పరిస్థితే ఎదుర్కొంది. 1957లో థేమ్స్ నదిని బయొలాజికల్లీ డెడ్ అని లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకటించింది. తర్వాత బ్రిటన్ ప్రభుత్వం చొరవ తీసుకుని థేమ్స్ నదిని ప్రక్షాళించింది. ఇప్పుడు లండన్ అనగానే థేమ్స్ నది గుర్తొచ్చేలా తయారైంది. అలాగే సియోల్ లోని చియోంగ్ జియోన్ నది కూడా 2003 వరకూ మూసీలాగే ఉండేది. ఆ తర్వాత దాన్ని ప్రక్షాళించారు. ఇప్పుడు ఆ నది అందాలు చూడడానికి రెండు కళ్ళూ చాలవు. ఏటా 2 కోట్ల మంది పర్యాటకులు ఈ నదిని సందర్శిస్తున్నట్టు అంచనా. చియోంగ్ జియోన్ నదిని ప్రక్షాళించిన తర్వాత పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. జీవవైవిధ్యం పెరిగింది. మూసీని కూడా ఇలా ప్రక్షాళించి సుందరంగా తీర్చిదిద్దాలని.. నదికి పునర్జీవం కల్పించాలనేది రేవంత్ రెడ్డి ఆలోచనపై సందేహాలు చాలనే ఉన్నాయి. తాజాగా ఒక బృందాన్ని సియోల్ పంపించి చియోంగా జియోన్ నదీ పరిస్థితులు అధ్యయనం చేసి రావాలని సూచించారు. మరి అధ్యయనం చేసి వదిలేస్తే సరిపోతుందా.. ప్రాక్టికల్ గా చెయ్యాల్సిందేమిటో కూడా ఆలోచించొద్దా….
రేవంత్ రెడ్డి తాను ఏం చేయాలనుకుంటున్నారో చెప్పే కంటే… కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును తిట్టేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. 450 ఏళ్ల హైదరాబాద్ మహానగరంలో మూసీ చరిత్ర, అది కలుషితమైన వైనాన్ని ఆయన అర్థం చేసుకోలేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. నిజాం కాలంనాటి హైదరాబాద్ మహానగరానికి, ప్రస్తుత హైదరాబాద్ కు ఉన్న తేడా ఆయన గుర్తించినట్లుగా కనిపించడం లేదు. ప్రస్తుతం మహానగరం 40 నుంచి 50 కిలోమీటర్ల పరిధికి విస్తరించింది. ఆకాశ హార్మ్యాల కారణంగా… డ్రైనేజీ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి వచ్చింది. నాలాలు ఆక్రమణకు గురయ్యాయి. కొన్ని చోట్ల నాలాలపైనే ఇళ్లు నిర్మిస్తే, మరికొన్ని ప్రదేశాల్లో నాలాలను క్లోజ్ చేసి ఇళ్లు కట్టుకున్నారు. దీనితో మురికినీటి కాలువల విస్తరణ అసాధ్యమవుతోంది. వర్షాకాలంలో తట్టుకోనంతగా వాన పడుతోంది. ఒక్క రోజులో 20 సెంటిమీటర్ల వాన పడితే ఆ నీరంతా ఎటుపోలేక ఇళ్లలోకి వస్తోందన్నది కళ్లకు కనిపించే వాస్తవం. ఎంతనీరు మూసీలోకి పోయినా దాన్ని సహజ రూటు మూసుకుపోయే దుస్థితి ఉంది. అందుకే మూసీ ప్రక్షాళన రేవంత్ రెడ్డి చెప్పినంత ఈజీ కాదని తేలిపోయింది. పైగా ఇంతవరకు ఏ మేర పనులు జరిగాయో తెలుసుకోకుండానే రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తూ… స్టేట్ మెంట్స్ ఇచ్చేస్తున్నారు..
రేవంత్ రెడ్డి ప్రకటనల నేపథ్యంలో మూసీ సుందరీకరణపై నిపుణుల మాటలను కూడా పరిగణించాలి. మూసీకి సంబంధించిన కీలకాంశాలను అర్థం చేసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పర్యావరణవేత్తలు, సబ్జెక్ట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైపై మెరుగులతో ఏదో చేయాలనుకుంటే దీర్ఘకాలిక ప్రయోజనం దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నదిని పునరుద్ధరించడమంటే బహుళ అంతస్తుల భవనాలు, వంతెనలు, పార్కులు నిర్మించడం కాదని పర్యావరణవేత్తలు వాదిస్తున్నారు. మూసీని పునరుద్ధరించాలంటే శుద్ధీకరించిన నీటిని మాత్రమే నదిలోకి వదలాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు..
రేవంత్ రెడ్డి మౌలికంగా ఒక తప్పు చేస్తున్నారని కొందరు నిపుణులు అంటున్నారు. అనంతగిరి నుంచి నల్గొండ జిల్లా వాడపల్లి వరకు మూసీ ప్రవాహం 267 కిలోమీటర్లు ఉంటుంది. రేవంత్ రెడ్డి హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటే 55 కిలోమీటర్ల ప్రాంతంలో జలాలను శుభ్రపరచడంపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. నదిలో ఎక్కడా కాలష్యం ఉండకుండా చూసినప్పుడే ఖర్చుపెట్టిన డబ్బుకు సార్థకత ఏర్పడుతుందని లేని పక్షంలో సంకల్పం సక్సెస్ కాదని వారంటున్నారు. సిటీ వరకు క్లీన్ గా ఉంచినా.. మిగతా ప్రాంతాల్లో మురికి నీరు వచ్చి మూసీలో చేరితే ప్రయోజనం ఏముంటుంది..
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 16 వేల 800 కోట్ల వ్యయంతో మూసీ శుద్ధీకరణ ప్రాజెక్టును ప్రారంభించింది. నాలాల నీరు మూసీలోకి ప్రవేశించకముందు శుద్ధీకరించడం ఆ ప్రాజెక్టు ముఖ్యోద్దేశం. ఇందుకోసం 31 సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటులను ఏర్పాటు చేయదలచుకున్నారు.వాటి కోసం మాత్రమే 3 వేల 886 కోట్లు ఖర్చవుతుందనుకున్నారు. ఆ ప్రాజెక్టు దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చిందని బీఆర్ఎస్ ప్రకటించి చాలా రోజులైంది. వ్యూహాత్మక నాలాల అభివృద్ధి కార్యక్రమం.. ఎస్ఎన్డీపీ.. పేరులో 60 ప్రాజెక్టుల తొలి దశను ఎప్పుడో పూర్తి చేశామని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి దాదాపు వెయ్యి కోట్లు వ్యయం చేసింది. ఆ ప్రాజెక్టు పూర్తయితే మూసీ పరివాహక ప్రాంతంలో కూల్చివేతల ప్రస్తావనే వచ్చేది కాదన్న అభిప్రాయమూ ఉంది. పర్యావరణవేత్తలతో పాటు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు కూడా ఒక విలువైన సమాచారం చెబుతున్నారు. మురికి నీరు మూసీలోకి వెళ్లకుండా ఆపడమే సరైన మార్గమని అంటున్నారు.ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటులను సమర్థంగా నిర్వహించగలిగితే హైదరాబాద్ బాగుపడుతుంది. నల్గొండ పొలాల్లోకి రసాయన నీరు చేరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ లోనే కాటేదాన్ పారిశ్రామిక వాడ నుంచి వ్యర్థ జలాలు మూసీలోకి చేరుకుంటున్నాయి. అందుకే పేదలకు వేరే చోటకు మార్చి పునరావాసం కల్పించే కంటే… కాలుష్యకారక పరిశ్రమలనే వేరు ప్రదేశాలకు చేర్చాలన్న సూచనలు వస్తున్నాయి. మరి ఇన్ని సంగతులను పక్కన పెట్టి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. విపక్షాలను తిడుతూ టైమ్ పాస్ చేస్తున్నారన్న ఫీలింగ్ వస్తోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…