తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు. ఆయన ఎటువంటి చర్యలు తీసుకుంటారు. ఆయన ఎందుకలా చేస్తున్నారు. ఆయన చర్యల్లో సహేతుకత ఉందా. హైడ్రా కూల్చివేతలు తప్ప రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా జరుగుతోందా. లేక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించినట్లుగా అంతా డంబాచారమేనా..ఇవే ఇప్పుడు జనంలో మెదులుతున్న ప్రశ్నలు. ఈ సందేహాలు కొనసాగుతుండగానే రేవంత్ రెడ్డి కొత్త ప్రోగ్రాంకు తెరతీశారు. దాదాపు నెల రోజులు కొనసాగే ప్రోగ్రాం అది…
ఈనెల 14న భారత తొలి ప్రధాని జవాహర్ లాల్ నెహ్రూ జయంతి వస్తుంది. వచ్చేనెల 9వ తేదీన సోనియాగాంధీ పుట్టినరోజు. ఈ రెండు రోజుల సందర్భంగా ఏదైనా ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని రేవంత్ సర్కారు డిసైడైంది. రేవంత్ సర్కారుకు కాస్త క్రియేటివిటీ ఎక్కువ కాబట్టి.. నవంబరు 14 నుంచి డిసెంబరు 9 వరకు ఏకబిగిన ఉత్సవాలు నిరంతరాయంగా నిర్వహించడానికి ప్లాన్ చేసింది. వీటికి ప్రజా విజయోత్సవాలు అని పేరు పెట్టారు.రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఈ విషయం వెల్లడించారు ఏడాదిలో ఎన్నో విప్లవాత్మక, ఊహకు అందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించే ప్రయత్నం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళా శక్తి తదితర పథకాలతోపాటు ప్రభుత్వం అమలుచేస్తున్న అధివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల సందర్భంగా వాడవాడలా వివరిస్తామని తెలిపారు.
ప్రజా విజయోత్సవాల షెడ్యూల్ పై కూడా ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.మూతపడిన కమలాపూర్ రేయాన్స్ పరిశ్రమను 4వేల కోట్లతో పునరుద్ధరించబోతున్నామని, గ్రూప్-4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేస్తామని భట్టి తెలిపారు. స్పోర్ట్ యూనివర్సిటీకి శంకుస్థాపన,16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా దవాఖాన నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం, పోలీస్ శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉత్సవాల చివరి రోజున హైదరాబాద్‌లో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్‌షోలు, క్రాకర్స్ ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు చెప్పారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలేదు. ఇంకా ఆ ఉత్సవాలే నిర్వహించలేదు. కాస్త దూకుడుగా పరిపాలన చేసుకుంటూ వెళుతున్నారు తప్ప.. వారు తీసుకుంటున్న అన్ని నిర్ణయాలకు ప్రజామోదం ఉన్నదని చెప్పడానికి అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల హామీలు చాలా పెండింగులోనే ఉన్నాయి. రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదు. రైతు భరోసా అతీ గతి లేదు. కేసీఆర్ హయాం నాటి నియామకాలు పూర్తి చేస్తున్నారే తప్ప.. కొత్త ఉద్యోగ కల్పన జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాట ఇంకా పరిష్కారం కాలేదు… మరో పక్క నిద్రాణంగా పడున్న బీఆర్ఎస్ మళ్లీ యాక్టివ్ అవుతోంది. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. వచ్చే నెల నుంచి యాత్రలు ప్రారంభిస్తామంటున్నారు. కేటీఆర్ కూడా పాదయాత్ర చేస్తానంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తప్పక గెలుస్తుందని బీఆర్ఎస్ నేతలు ప్రకటించుకున్నారు…
పాలనా పరంగా రేవంత్ రెడ్డికి పాస్ మార్కులే వచ్చాయి. కనీసం ఫస్ట్ క్లాస్ కూడా రాలేదని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వం హయాంలో పెట్టిన పేర్లను మార్చడం తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా చేసిందేమీ లేదు. తాజాగా యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చారు. ప్రభుత్వ నిర్ణయాల్లో చాలా వరకు వివాదాస్పదంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో ప్రజా విజయోత్సవాలు నిర్వహించడం అవసరమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవి అతిశయోక్తి మాత్రమే అవుతాయని, డైవర్షన్ గేమ్ కు ఉపయోగపడతాయని కూడా చెప్పుకుంటున్నారు. ప్రజల జీవితాల్లో మార్పు రానప్పుడు వాళ్లు విజయోత్సవాలు ఎలా జరుపుకుంటారన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…