కాంగ్రెస్ కూడా బీజేపీ పాటే పాడుతోంది. టీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలుకు బేరసారాలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా అదే డిమాండ్ చేశారు. తెలంగాణలో చోటుచేసుకున్నఈ కేసుపై టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఏసీబీ చేత విచారణ చేయించినా, బీజేపీ చెప్పు చేతల్లో ఉన్న సీబీఐ చేత విచారణ చేయించినా అసలు వాస్తవాలు బయటకు రావని ఆయన అన్నారు. ఈ కేసులో అసలు నిజాలు బయటకు రావాలంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీ చేత విచారణ చేయించడమొక్కటే మార్గమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నట్లుగా తమను కొనుగోలు చేసేందుకు స్వామీజీలు రంగంలోకి దిగిన మాట వాస్తవమే అయితే… వారు తమ ఫోన్ సంభాషణల్లో చెప్పినట్లుగా ఢిల్లీలో ఉన్న నెంబర్ వన్, నెంబర్ టూ, ఆ తర్వాత బీఎల్ సంతోష్ లను నిందితులుగా చేర్చాలని, వారి తర్వాతే స్వామీజీలను నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. ఒక వేళ ఈ వ్యవహారాన్ని టీఆర్ఎస్ రూపకల్పన చేసి ఉంటే… తొలి నిందితుడిగా సీఎం కేసీఆర్, రెండో నిందితుడిగా మంత్రి కేటీఆర్, ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు నిందితులుగా ఉండాల్సి ఉందన్నారు. అయినా ఈ కేసులో స్వామీజీ మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన పోలీసులు… ఈ వ్యవహారంలో కీలకంగా మారిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు.
ఇదంతా బీజేపీ, టీఆర్ఎస్ రెండూ కలిసి ఆడిన నాటకంగా రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసేందుకు ఆ రెండు పార్టీలు కలిసి ఇలాంటి కుట్రలు పన్నాయని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే రఘునందన్ రావు ఇంటిలో దొరికిన దబ్బు ఏమైందో ఇప్పటికీ తేలలేదన్నారు. ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకే ఆ రెండు పార్టీలు కలిసి కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు తెలంగాణలో ఎలాంటి ప్రాధాన్యం దక్కకుండా కూడా టీఆర్ఎస్, బీజేపీలు ఈ కుట్రకు పాల్పడ్డాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇలాంటి కుట్ర ఏదో జరగబోతోందని 8 రోజుల ముందుగా తాను చెప్పానని, తాను చెప్పినట్లే జరిగిందన్నారు.