నక్సలైట్ల ప్రస్తావన తేవడం నేరమా?

By KTV Telugu On 9 February, 2023
image

ప్రగతి భవన్ ను పేల్చివేయాలన్న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణా అంతటా రచ్చ రచ్చ అవుతోంది. రేవంత్ పై బి.ఆర్.ఎస్. నేతలు భగ్గుమంటున్నారు. తక్షణమే రేవంత్ పై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు తెలంగాణా వ్యాప్తంగా బి.ఆర్.ఎస్. శ్రేణులు రేవంత్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. కాస్త హుందాగానో మర్యాదగానో ప్రజాస్వామ్యం ఉట్టిపడేలానో ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడితే దాన్ని ఎవరూ పట్టించుకోరు. ఎవరూ అటువైపే చూడరు.

అదే ఓ నేత గీత దాటి ఇష్టాను సారం మాట్లాడితే మాత్రం అగ్గి రాజుకుంటుంది. ఆ వ్యాఖ్యలే వార్తల్లో పతాక శీర్షికలవుతాయి. వాటినే మీడియా హైలెట్ చేస్తుంది. రాజకీయ పార్టీలు కూడా దానిపైనే దృష్టి సారిస్తాయి. ఈ విషయం తెలుసు కాబట్టే తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తన పాదయాత్రలో ఈ లాజిక్ ను బాగా వాడుకున్నట్లు అనిపిస్తోంది. పాదయాత్రలో కేసీయార్ పాలనను ఎండగట్టిన రేవంత్ రెడ్డి తెలంగాణాలో పేద ప్రజలకు ఏ మాత్రం ప్రవేశం లేని ప్రగతి భవన్ ఒకప్పటి గడీలను గుర్తుకు తెస్తోందన్నారు. పేదలకు ప్రవేశంలేని ప్రగతి భవన్ ఉంటే ఎంత పోతే ఎంత అన్న రేవంత్ గతంలో గడీలను పేల్చివేసిన నక్సలైట్లు ఇపుడు ప్రగతి భవన్ ను పేల్చివేసినా తమకు నష్టం లేదని అన్నారు.
రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యే బి.ఆర్.ఎస్. నాయకత్వంలో మంట రేపుతోంది. రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. బి.ఆర్.ఎస్. నేతలు రాష్ట్ర డిజిపిని కలిసి నక్సలైట్ల అజెండాను భుజాలకెత్తుకుని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. నిషిధ్ద నక్సలైట్ల భాష మాట్లాడిన రేవంత్ రెడ్డిపై తక్షణమే దేశ ద్రోహ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా బి.ఆర్.ఎస్. నేతలు స్థానిక పోలీసు స్టేషన్లలో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు చేస్తున్నారు. బి.ఆర్.ఎస్. దూకుడుపై రేవంత్ రెడ్డి దీటుగానే స్పందించారు. ఎన్ని కేసులైనా పెట్టుకోండి నాకు కేసులు కొత్తా అంటూ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ లో ఆంధ్రా నుండి వచ్చిన తోట చంద్రశేఖర్ లకు రావెల కిషోర్ బాబులకు రెడ్ కార్పెట్ పరచి పిలిచి విందు భోజనాలు పెడతారు కానీ తెలంగాణా అమరవీరుల కుటుంబీకులకు మాత్రం నో ఎంట్రీ బోర్డు చూపిస్తున్నారని రేవంత్ దుయ్యబట్టారు. తెలంగాణాకోసం పోరాడిన వారికే ప్రవేశంలేని ప్రగతి భవన్ ఉంటే ఎంత పేలిపోతే ఎంత అని అందుకే అన్నానని తన వ్యాఖ్యలను సమర్ధించుకున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ ను కార్నర్ చేయాలని బి.ఆర్.ఎస్. భావిస్తే దీన్ని కూడా తనకు అనుకూలంగా మలుచుకున్న రేవంత్ తన వ్యాఖ్యలు వీలైనంత ఎక్కువ కాలం వార్తల్లో ఉంటే మంచిదే కదా అనుకుంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యను నిజంగానే తప్పు బట్టాలా. ఎప్పుడో నిషేధించిన నక్సలైట్ల ప్రస్తావన తీసుకురావడం నేరమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి.

అయితే రాష్ట్ర రాజకీయాల చరిత్రను పరిశీలిస్తే మాత్రం రాజకీయ పార్టీల్లో ఉన్న వారు నక్సలైట్ల అజెండాను మెచ్చుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి. ప్రత్యేకించి అధికారంలో ఉన్నవారే నక్సలైట్లను భుజాలకెత్తుకోవడం గతంలో చూశాం. ఎవరో ఎందుకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారకరామారావు అధికారంలోకి వచ్చాక తానే అసలు సిసలు నక్సలైటునని అన్నారు. పేదల గురించి తాను ఆలోచించినట్లు ఇంకెవరూ ఆలోచించరన్న సందర్బంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. అపుడు అంతా దానికి చప్పట్లు కొట్టారు. మీడియా అయితే కార్టూన్లు వేసుకుని కాలక్షేపం చేసింది కానీ అది పెద్ద ఇష్యూ కాలేదు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీయార్ కూడా ముఖ్యమంత్రి హోదాలోనే తనది నక్సలైట్ల అజెండానే అని చెప్పుకున్నారు. కేసీయార్ ఈ వ్యాఖ్య చేసినపుడు నాటి విపక్షాలు రాద్దాంతం చేయలేదు. మీడియాలోనూ ఫోకస్ రాలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర రెడ్డి అయితే సిఎం హోదాలో మావోయిస్టుల సమస్యను పరిష్కరించే కారణంతో వారిని ఏకంగా చర్చలకు పిలిపించారు కూడా. చర్చల్లో రెండు వర్గాలు ఏమేమి ఒప్పందాలు చేసుకున్నాయి అవి ఎంత మేరకు అమలయ్యాయి అన్న అంశాలపై ఆ తర్వాత ఎవ్వరూ కూడా చర్చించలేదు.

ఇపుడు రేవంత్ రెడ్డి నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చేస్తే తనకు నష్టం లేదనడాన్ని మాత్రం వివాదస్పదం అవుతోంది. నక్సలైట్లతో రేవంత్ రెడ్డి కుమ్మక్కై ప్రగతి భవన్ విస్ఫోటనానికి కుట్ర పన్నినట్లు అనుమానాలు ఉన్నాయంటున్నారు బి.ఆర్.ఎస్. నేతలు. రేవంత్ రెడ్డి పాదయాత్రను ఎక్కడికక్కడ అడ్డుకోవలసి వస్తుందని వారు హెచ్చరించారు.
ఎవరు అధికారంలోకి వచ్చినా ఒకప్పుడైతే నక్సలైట్లు ఇపుడయితే మావోయిస్టుల అజెండాలను ఎట్టి పరిస్థితుల్లోనూ భుజాలకెత్తుకోవు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే మావోయిస్టుల సమస్యను శాంతి భద్రతల సమస్యగానే చూస్తుంది. మావోయిస్టు కార్యకలాపాలపై ఉక్కుపాదమే మోపుతాయి. అంతే కానీ మావోయిస్టులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వారి సిద్ధాంతాలను ప్రమోట్ చేసుకోమని ఏ రాజకీయ పార్టీ కూడా చెప్పే పరిస్థితులు ఉండవు. రేపు రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో కాలం కలిసొచ్చి అధికారంలోకి వచ్చినా రేవంత్ కూడా మావోయిస్టులకు వ్యతిరేకంగానే విధానాలు రూపొందిస్తారు. అంచేత ఇపుడు ఆయన నక్సలైట్లను చాలా తెలివిగా తన వ్యాఖ్యలు వార్తల్లో ఉండేందుకే వాడి ఉంటారన్నది రాజకీయ పండితుల అభిప్రాయం.