రేవంత్ పవర్ లెస్ – అద్దంకి దయాకరే సాక్ష్యం – Revanth Reddy – Addanki Dayakar – MLC – MLA – MP

By KTV Telugu On 25 March, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి చాలా పవర్ ఫుల్ అనుకుంటారు.  హైకమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందని అనుకుంటూ ఉంటారు. కానీ రేవంత్ రెడ్డిని ఎక్కడ ఉంచాలో హైకమాండ్ అక్కడే ఉంచుతోందనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి. అందులో మొదటిది అద్దంకి దయాకర్‌కు చిన్న పదవి కూడా రేవంత్ ఇప్పించలేకపోవడం. మాట ఇచ్చి కూడా నిలబెట్టుకోపోవడం.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో దురదృష్ట వంతుడు ఎవరు అంటే.. అద్దంకి దయాకర్ పేరు చెబుతారు ఎవరైనా. ఆయన కాంగ్రెస్‌కు గడ్డు కాలం ఉన్న  రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. కాంగ్రెస్‌కు మంచి రోజులు వస్తాయనుకున్నప్పుడు ఆయనకు టిక్కెట్ దొరకలేదు. అయినా పార్టీ కోసం కష్టపడ్డారు. ఇదిగో ఎమ్మెల్సీ అన్నారు. అదీ  రాలేదు. చివరి క్షణంలో పేరు మారిపోయింది. తర్వాత వరంగల్ ఎంపీ టిక్కెట్ అన్నారు. ఆ పేరూ మారిపోయింది. కంటోన్మెంట్ ఉపఎన్నికలో అయినా సీటు వస్తుందనుకుంటే.. బీజేపీ నేతను చేర్చుకున్నారు.  అద్దంకి దయాకర్‌కు సీటు లేదని చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఇప్పించలేనందుకు అద్దంకి దయాకర్ కి క్షమాపణలు చెప్పినట్టు స్వయంగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీగా గెలిపించుకుంటామని రేవంత్ బహిరంగంగానే ప్రకటించారు.  ఎన్నికల ప్రచారంలో కూడా తనతో పాటు తిప్పుకున్నారు.  కానీ ఇప్పటి వరకూ మాట నిలబెట్టుకోలేకపోయారు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఆఖరి వరకూ అద్దంకి దయాకర్ పేరు వినబడింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోవాలని పార్టీ పెద్దలు ఫోన్ చేశారని, అనుచరులు సంబరాలు కూడా జరుపుకున్నారు. చివరి నిమిషంలో జాబితాలో అద్దంకి దయాకర్ స్థానంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి వెళ్లిన లిస్ట్ లో పేరు లేని మహేష్ గౌడ్ కి పదవి దక్కింది.   రాజ్యసభ ఎన్నికల్లో అద్దంకి దయాకర్ కి అవకాశం దక్కుతుందేమో అనుకున్నారు కానీ, రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ల పేర్లు ఫైనల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయాలని అద్దంకి దయాకర్ అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి వరంగల్ సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లోకి రావడంతో ఆయనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానం భావిస్తోంది.

అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2014,  2018 అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొదటిసారి 1,847 ఓట్లతో, రెండవసారి 2,379 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. మూడవసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటే అసలు టిక్కెట్టే దక్కలేదు.   కాంగ్రెస్ పార్టీ పరిస్థితి  బాగోలేనప్పుడు బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఉపఎన్నిక వచ్చిన సమయంలో రేవంత్ రెడ్డి మునుగోడులో సభ ఏర్పాటు చేశారు.   ఆ సభకి రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి హాజరు కాలేదు. దీంతో ఆ సభలో ప్రసంగించిన అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో ఉంటే ఉండు వెళ్తే వెళ్ళు అని దూషించారు. ఈ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపింది. అద్దంకి బేషరతుగా కోమటిరెడ్డి వెంకట రెడ్డికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ అద్దంకికి టికెట్ రాకుండా కోమటిరెడ్డి బ్రదర్స్ అడ్డుకున్నారని, ప్రస్తుత తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామ్యూల్ ని బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి తీసుకొచ్చి టికెట్ ఇప్పించడంలో చక్రం తిప్పారని చెప్పుకుంటారు.

కాంగ్రెస్ అంటే అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటలు మామూలే. కానీ పార్టీనే నమ్ముకుని ఉన్న ఓ దళిత నేను ఇన్ని సార్లు ఆశ పెట్టి  నిరాశకు గురి చేయడం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అంత మంచిది కాదు.  కోమటిరెడ్డి బ్రదర్స్..  కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి చివరి వరకూ ప్రయత్నించారు. చివరికి కాంగ్రెస్ గెలుస్తుందన్న అంచనాకు వచ్చిన తర్వాతమే మళ్లీ వాళ్లు పార్టీ వైపు యాక్టివ్ అయ్యారు. వారిని చూసుకుని అద్దంకి దయాకర్ వంటి నేతలకు అన్యాయం చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంత మేలు చేస్తుందో కానీ.. క్యాడర్ కు మాత్రం తప్పుడు సంకేతాలు పంపినట్లు అవుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి