మాటలు కోటలు దాటతాయి. చేతలు గుమ్మాలు దాటవు.. అన్న సామెత రాజకీయ నాయకుల్లో చాలామందికి వర్తిస్తుంది. అప్పటి పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని గెలిచి సీఎం అయిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు పరిపాలన చేతగాక, చేవలేక చితికిలపడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని తిట్టడమేగానీ రాష్ట్రానికి ఆయన చేసిందేమిటో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఇక ఆలీబాబా చాలీస్ చోర్..అన్నట్లుగా మంత్రులు కూడా యథారాజా తధాప్రజ అన్న చందాన మీనమేషాలు లెక్కిస్తున్నారు. పడగొట్టుడే గానీ కట్టుడు లేదన్న వాదన ఇప్పుడు తెలంగాణలో ప్రతీ నోటా వినిపిస్తోంది….
గడీల పాలనపై పోరు సాగిస్తాం….నీ ఫామ్ హౌస్ లో జిల్లెళ్లు మొలిపిస్త కొడకా.. ఈ మాటలు వినడానికి ఎంతో బావుంటాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు రేవంత్ చేసిందేమిటని ఆలోచిస్తే మాత్రం ఈ మాటల మాంత్రికుడు.. టైమ్ పాస్ వీరుడన్న సంగతి అర్థమైపోతుంది. ఇంకా తెలంగాణ ఇచ్చిన పార్టీగానే చెలామణి అవుతూ చేతులు దులుపుకోవాలన్న కోరిక తెలంగాణ కాంగ్రెస్ పాలనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సోనియమ్మ రాజ్యం, సోనియమ్మ త్యాగం.. ఇలా ఎన్ని సార్లు చెప్పుకు తిరుగుతారని జనం ప్రశ్నించే రోజులు వచ్చేశాయి.
తెలంగాణ జనం రేవంత్ రెడ్డిని అడుగుతున్న సూటి ప్రశ్న ఒక్కటే. మేము నీకు అధికారం ఇచ్చాం. తిరిగి నువ్వు మాకు ఏమిచ్చావు. బీఆర్ఎస్ పాలన నుంచి విముక్తి కలిగిస్తానన్నావు. అదే తరహా పాత పద్ధతులనే ఎందుకు సృష్టిస్తున్నావ్.. అని జనం ఆగ్రహం చెందుతున్నారు. రేవంత్ అధికారానికి వచ్చి తొమ్మిది నెలలైంది. అది తక్కువ సమయం ఏమీ కాదు. దాదాపు రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడికి పరిస్థితులు, ప్రజల అవసరాలు తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టదు. పైగా భారీ అజెండాతో, ఇబ్బడిముబ్బడి గ్యారెంటీలతో జనాన్ని నమ్మించి అధికారానికి వచ్చిన నాయకుడికి ప్రజల అవసరాలు, ఆకాంక్షలు ఏమిటో తెలియనిది కాదు. రేవంత్ మాత్రం ప్రజల ఎక్స్ పెక్టేషన్స్ అందుకోవడంలేదు. ఎక్కడో తేడా కొడుతోందని జనం తమను తాము ప్రశ్నించుకునే పరిస్తితి తీసుకొచ్చారు. ఒకటి రెండు మినహా అన్నీ హామీలు గాలికి వదిలేశారు. ఇప్పట్లో అమలు జరుపుతారన్న విశ్వాసం కూడా జనంలో కలిగించలేకపోవడం అతి భారీ వైఫల్యమనే చెప్పాలి..
రేవంత్ ఎవరూ, రేవంత్ ఆలోచన ఏమిటి, ఆయన మదిలో ఏముంది, ఏం చేయాలనుకున్నారు.. ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ సమాధానం కోసం జనం శూన్యంలోకి చేస్తున్నారు. నటించడంలో డాక్టరేట్ చేసిన మిస్టర్ చీఫ్ మినిష్టర్.. ప్రజా సేవలో డిగ్రీ కూడా పాస్ కాలేదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరకు ఆయన తెలంగాణ సెంటిమెంటును కూడా పక్కకు తోసేసి సోనియా చల్లని చూపు ఉంటే చాలన్న నిర్ణయానికి వచ్చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం ఉన్న చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి విమర్శల పాలవుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ అన్న గ్రౌండ్ రియాల్టీని రేవంత్ అర్థం చేసుకోలేకపోతున్నారు. కేసీఆర్ ఓడిపోయినంత మాత్రాన తెలంగాణ ఫీలింగ్ పోయిందని రేవంత్ అనుకుంటే అంతకంటే పొరబాటు మరోకటి ఉండకపోవచ్చు. జనం కేసీఆర్ కుటుంబం పట్ల, ఆయన పార్టీ పట్ల వ్యతిరేకత పెంచుకున్నారే తప్ప… తెలంగాణ సెంటిమెంటును దూరం చేసుకోవడం లేదని, ప్రతీ ఒక్కరిలో తెలంగాణ భావన ప్రస్ఫూటంగా ఉందని అర్థం చేసుకోలేకపోవడం రేవంత్ రెడ్డి పెద్ద ఫెయిల్యూరే అవుతుంది.పైగా తెలంగాణ తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ పట్ల అభిమానం కొనసాగుతూనే ఉంది.
పాలకులకు పాలనకు మధ్య సమన్వయం కొరవడిందని చెప్పేందుకు వెనుకాడకూడదు.నేతలకు, అధికారులకు మధ్య వారధి తెగిపోయిందన్న అనుమానమూ రాకమానదు. పాలనపై పట్టులేక రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారనుకోవాలి. పరిపాలనకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు లింకు పెట్టి ఏదో చేయాలనుకోవడం అనవసర తపనే అవుతుంది.
నిజానికి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రగతి, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద అంశం తెరపైకి వచ్చి సర్కార్‌ను అతలాకుతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగిపోవడం, ప్రజల దృ ష్టిని మళ్లించేందుకు పరుష భాషను ప్రయోగించడం, లేదంటే దృష్టి మళ్లింపు చ ర్యలకు అవసరమైన ఆసక్తికరమైన అంశాన్ని ఎంపిక చేసుకోవడమే పాలనగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ లోని కవి చౌడప్ప బయటకు వస్తున్నారు. అసలు అసంపూర్ణ రుణమాఫీపై రైతులు ఊరూరా రణగీతం ఆలపిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. ఆ వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మ ళ్లించే ఎత్తుగడలో భాగంగా ఇతర అంశాలను ఉద్దేశపూర్వకంగానే తెరమీదికి తెస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. డిసెంబరు 7న కాంగ్రెస్ సర్కారు కొలువుతీరినప్పటి నుంచి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత దాకా, ఆ తర్వాత కూడా.. అనేక ఘటనలు రేవంత్ వైఖరిపై అనుమానాలనే కలిగిస్తున్నాయి. దూకుడు మినహా ఒరిగించిందేమే లేదని ఆరోపణలు వస్తున్నాయి. పైగా అంతే చేస్తా, బరాబర్ చేస్తా అనడం కూడా జనానికి ఏ మాత్రం నచ్చడం లేదు. రెండు లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తోంది. సగం మందికి రుణమాఫీ చేయకుండానే అందరికీ ఇచ్చినట్లుగా మమ అనిపించడం పేద ప్రజల ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. సర్కారును నమ్ముకుని నిలబడినందుకు ఇప్పుడు కొత్త అప్పు పుట్టక నానా తంటాలు పడాల్సి వస్తోంది. రుణమాఫీ విషయంలో రైతుల్లో ఆగ్ర హం పెల్లుబికుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలతోపా టు కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ రైతులు నిలదీస్తున్నారు.బియ్యం కొనుగోళ్ల టెండర్లో 11 వందల కోట్ల కుంభకోణం జరిగిందనే అంశం వెలుగులోకి రావడంతో ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ హయాంలో వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి కొన్ని రోజులు టైమ్ పాస్ చేశారు. బియ్యం సంగతి జనం మరిచిపోగానే, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి వదిలేశారు.
రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ సాక్షిగా సర్కార్ వైఫల్యాలను ఎండగడితే, వాటిపై సమాధానం చెప్పాల్సిందిపోయి ‘ఆ ఇద్దరు అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండే’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి తీరును రాజకీయ విశ్లేషకులు ఎండగడుతున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు కొనుగోళ్లపై చర్చ జరిగిన సందర్భంలో ‘మోటర్లకు మీటర్లు పెడతామని కేసీఆర్ సర్కార్ సంతకాలు చేసింది’ అంటూ సభలో సమాధానాలు చెప్పకుండా అసత్యాలు ప్రచారం చేయడం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలోనూ సభను తప్పుదారి పట్టించి విమర్శల పాలు కావడం, బీఆర్‌ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసులు ఇవ్వడం కూడా రేవంత్ రెడ్డి గేమ్ ప్లాన్లో భాగమేనని చెప్పాలి.అంతకు మించి యువతకు ఉద్యోగాల విషయంలోనూ మోసపూరిత కప్పదాటు వైఖరినే పాటించారు. అసెంబ్లీ వేదికగా రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పి….చివరకు ఉద్యోగాల సంఖ్య లేకుండా కేవలం స్టేట్ మెంట్ విడుదల చేయడంతో రేవంత్ రెడ్డి సర్కారుపై యువత తీవ్ర ఆగ్రహంతో ఉంది.
అసలు రేవంత్ పాలన ఉందా. అధికారులపై సీఎంకు పట్టు ఉందా అని ఎవరైనా ప్రశ్నిస్తే అవును అని సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మంత్రులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బ్యూరోక్రాట్లపై ప్రభుత్వానికి పట్టు లేదు. కేసీఆర్ హయాంలో చీఫ్ సెక్రటరీగా ఉన్న శాంతి కుమారి ఇప్పుడు కూడా అదే ఉద్యోగంలో కొనసాగుతున్నారు. అప్పుడు, ఇప్పుడు రామకృష్ణారావే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నారు. చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీని మార్చుకోలేని సీఎం పాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా అని ప్రశ్నించేవారూ ఉన్నారు. వారంటే ఇష్టం లేకపోయినా, ఎలా మార్చుకోవాలో..ఎవరినీ తెచ్చి సీట్లో కూర్చోబెట్టాలో అర్థం కాక అలా కొనసాగిస్తున్నారన్న టాక్ కూడా నడుస్తోంది. ఒకప్పుడు కేసీఆర్ అధోగతిపాలనకు కారణమయ్యారంటూ ఏ అధికారులపై కాంగ్రెస్ పార్టీ దుమ్మెత్తిపోసిందో…సోషల్ మీడియాలో కథనాలు వండి వార్చిందో… వాళ్లంతా ఇప్పుడు కూడా కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. అధికారులను దారిలో పెట్టి సమర్థులైన వారిని కీలక స్థానాల్లో కూర్చోబెడితే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్న చిన్న విషయం కూడా రేవంత్ రెడ్డికి బోధపడలేదు. ఇక మంత్రుల విషయానికి వస్తే ఉత్తమ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం బ్యాచ్ ఇలా ఎవరికి వారు సూపర్ చీఫ్ మినిష్టర్లుగా చెలామణి అవుతున్నారు. రేవంత్ రెడ్డి స్వతంత్రం ప్రకటించుకున్న సామంతరాజుగా కనిపించినా.. అసలు స్వేచ్ఛాజీవులు మంత్రులేనని చెప్పాలి. ఎవరి గ్రూపు వారికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులు ప్రకటనలు ఇవ్వడం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం మినహా ప్రజలకు ఒరిగించిందేమీ లేదు.పైగా ఒక మంత్రివల్ల రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం కలిగిందని చెప్పుకునే పరిస్థితి లేదు. ప్రతీ ఒక్కరికీ ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తప్ప.. ప్రజాసేవ చేస్తామన్న ఇంగిత జ్ఞానం లేదనే చెప్పాల్సి ఉంటుంది.
కేసీఆర్, కేటీఆర్ ను తిట్టుకుంటూ కూర్చుంటే టైమ్ పాస్ కావచ్చు. పరిపాలన ముందుకు సాగదు. ఎన్నికల ముందే గ్రౌండ్ వర్క్ చేసుకుని ఉంటే గెలిచిన తర్వాత గ్రౌండ్ రియాల్టీ త్వరగా అర్థమయ్యేది.సోనియా, రాహుల్ ఆశీస్సులు ఉంటే చాలు ప్రజలతో పనిలేదనుకంటే.. దీర్ఘకాలంలో శంకరగిరి మాన్యాలే మిగులుతాయి. ఒక్క పక్క బీఆర్ఎస్ దుస్థితిని చూసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే కష్టమే. ఎందుకంటే కాంగ్రెస్ పాలిటిక్స్ ఎలా ఉంటాయో ఆయన ఇంకా ఖచితంగా అర్థం చేసుకున్నట్లు లేదు. కాంగ్రెస్ కు ఆయన కూడా కొత్తే కదా…అపోహలు పెట్టుకోకుండా.. ప్రజలను నమ్ముకుని, ప్రజలకు మేలు చేసినవాళ్లే ఎక్కువకాలం మనగలుగుతారని రేవంత్ రెడ్డి గుర్తించాలి….
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…