రేవంత్ ఫస్ట్ టార్గెట్ ఫిక్స్ !

By KTV Telugu On 14 December, 2023
image

KTV TELUGU :-

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బాధ్యతలను మరింతగా పెట్టేందుకు కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమయింది. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి మెజార్టీ సీట్లు గెలిపించే బాధ్యతను కూడా రేవంత్ రెడ్డి మీదనే పెట్టినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇప్పటికిప్పుడు కొత్త పీసీసీ చీఫ్ ను నియమించే అవకాశం లేదని పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ఆలోచిస్తామని హైకమాండ్ సంకేతాలు పంపుతోంది.  ఓ రకంగా రేవంత్ రెడ్డికి ఇది సవాల్ మాత్రమే కాదు.. చాన్స్ లాంటిది కూడా. ఎందుకంటే.. లోక్ సభ సీట్లను అత్యధికంగా గెలిపిస్తే ఆయనకు హైకమాండ్ వద్ద తిరుగులేని పట్టు లభిస్తుంది.

తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి మొదటి టాస్క్ పార్లమెంట్ ఎన్నికలు.   కేంద్రంలో జాతీయపార్టీకి పార్లమెంట్ సీట్లను సాధించి పెట్టడం ద్వారా ఆయన మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంది.  తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. ఇందులో నుంచి ఓ స్థానాన్ని లాక్కోవడం కష్టం. మిగిలిన పదహారు స్థానాల్లోనూ కాంగ్రెస్ కు విజయావకాశాలు ఉంటాయి. గతం వేరు ఇప్పుడు వేరు.  విజయం సాధించి…అధికారంలోకి వచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉండే క్రేజ్..  రేవంత్ వంటి బలమైన నాయకత్వం తోడైతే స్వీప్ చేయడానికి అవకాశం ఉంటుంది.   రేవంత్ పై నమ్మకం పెట్టుకున్న హైకమాండ్ ఆయనకే ఫ్రీ హ్యాండ్ ఇ,స్తోంది.

తెలంగాణ పీసీసీ చీఫ్ పార్టీని అధికారంలోకి వచ్చేలా చేసిన రేవంత్ రెడ్డి ప్రతిఫలంగా ముఖ్యమంత్రి పదవి పొందారు.  కాంగ్రెస్ లో రెండు పదవులు ఒకరికే కొనసాగించే సంప్రదాయం లేదు.అందుకే  టీపీసీసీ పదవికి కొత్తవారిని నియమించాల్సి ఉంటుంది. అందుకే నూతన రథసారధి ఎవరవుతారనే చర్చ మొదలైంది. పార్లమెంటు ఎన్నికల తర్వాతే టీపీసీసీ అధ్యక్షున్ని అధిష్టానం నియమిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  రేవంత్‌ సారధ్యంలోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనను ఇప్పటికే రాష్ట్ర నేతలకు హైకమాండ్ పంపింది.  ఏఐసీసీ అధిష్టానం కూడా పార్లమెంటు ఎన్నికల వరకు అధ్యక్షున్ని మార్చకపోవడం మంచిదని డిసైడయింది.  రేవంత్ రెడ్డి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయని  భావస్తోంది. ఈ సారి తెలంగాణ నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు గెలిపించుకునే బాధ్యతను తానే తీసుకుంటానని రేవంత్ రెడ్డి హైకమాండ్ కు హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.అభ్యర్థు్ల ఎంపికతో పాటు మొత్తం బాధ్యతలు రేవంత్ కే కట్టబెడతారని అంటున్నారు. ఇప్పటికిప్పుడు కొత్త టీ పీసీసీ చీఫ్ ను నియమిస్తే సమన్వయం కొరవడితే మొదటికే మోసం వస్తుందని రిస్క్ తీసుకోకపోవడం మంచిదని  భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

కాంగ్రెస్ పార్టీకి గత రెండు లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పెద్దగా సీట్లు రాలేదు.  రెండు, మూడు స్థానాలే వస్తున్నాయి.  కానీ ఈ సారి మాత్రం డబుల్ డిజిట్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అసెంబ్లీ ఫలితాలను విశ్లేషిస్తే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధి మినహా మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ విజయం సాధించడానికి అవకాశం ఉంది. పైగా ఇప్పుడు అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ ఉండనే ఉంటుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన క్రేజ్ కూడా ఉంటుంది. యువనాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో దూకుడైన పరిపాలన కూడా కాంగ్రెస్ కతు ప్లస్ అవుతుంది. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకూ.. సిద్దిపేట నియోజకవర్గంలో వచ్చే మెజార్టీతో  బీఆర్ఎస్‌ గెలుపును అడ్డుకోలేరన్న అభిప్రాయం ఉంది. మిగిలిన  పార్లమెంట్ సీట్లను గెల్చుకోవడానికి కూడా ఈ సారి బీఆర్ఎస్, బీజేపీ ఎక్కువ కష్టాలు పడాల్సి రావొచ్చు. గ్రేటర్ పరిధిలో  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎక్కువగా గెలిచినప్పటికీ.. జాతీయ రాజకీయాల ప్రాధాన్యంతో  ఓటింగ్ జరుగుతుంది. దాని వల్ల జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. ఈ విషయంలో  కాంగ్రెస్ పార్టీ కి అడ్వాంటేజ్ ఉంటుంది.  తెలంగాణలో నరేంద్రమోదీ కన్నా…  రాహుల్ గాంధీకే ఎక్కువ క్రేజ్ ఉంటుంది.

ఈ లోక్ సభ ఎన్నికల్ోల  పదిహేను స్థానాలను రాష్ట్రం నుంచి రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ హైకమాండ్ కు ఇవ్వగలిగితే…  ఆయన స్థానం మరింత బలోపేతం అవుతుంది. ఆయనపై హైకమాండ్ మరింత నమ్మకం పెట్టుకుంటుంది.  తెలంగాణ లో కొత్త చరిత్ర రాసే అవకాశం రేవంత్ రెడ్డికి లభిస్తుంది. అందుకే.. రేవంత్ రెడ్డి కూడా..  లోక్ సభ ఎన్నికలను ఓ టాస్క్ గా తీసుకునే చాన్స్ ఉంది.

మెరుగైన లోక్ సభ సీట్లను తెలంగాణ నుంచి గెలిపించి తీసుకు వస్తే.. టీ పీసీసీ చీఫ్ గా ఎవరుండాలో కూడా…  చాయిస్ రేవంత్ రెడ్డిదే అవుతుంది. ఆయన మాటలను కాదనే పరిస్థితి హైకమాండ్‌కు ఉండదు.

టీ పీసీసీ చీఫ్ గా ఉన్న వ్యక్తి  ముఖ్యమంత్రితో వర్గ పోరాటానికి దిగితే వచ్చే సమస్యల గురించి చెప్పాల్సిన పని లేదు. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో ఏం జరిగిందో కాంగ్రెస్ కు బాగా తెలుసు. అలాగని డమ్మీని పీసీసీ చీఫ్ గా చేయలేరు.  రేవంత్‌రెడ్డి తర్వాత సమర్థవంతమైన నాయకుడయి ఉండాలి.. రేవంత్ కనుసన్నల్లో పని చేస్తూ ఉండాలి.   గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ పదవిలో ఉన్నారు. కానీ ఆయన ఫలితాల్ని చూపించడంలో విఫలమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు పదవి ఆశించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కీలక నేతలంతా ప్రస్తుతం రాష్ట్ర మంత్రు లయ్యారు. కీలకమైన నేతలందరికీ మంత్రి పదవులు దక్కాయి. మరో ఆరుగురికి మంత్రు లయ్యే అవకాశం ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, హైదరా బాద్‌ జిల్లాలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. అక్కడి నుంచి సీనియర్‌, జూనియర్‌ నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కీలకమైన నేతలు మంత్రి పదవుల్లో ఉంటే, మిగిలిన నేతలకు టీపీసీసీ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు పార్గీ వర్గాలు చెప్పాయి.

ఈసారి బీసీ సామాజిక తరగతికి పెద్ద పీట వేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గానికి రెండు చొప్పున మొత్తం 34 సీట్లు ఇస్తామని ప్రకటించింది. కానీ అన్ని సీట్లు ఇవ్వలేకపోయారు.   దీంతో పార్టీలో ఆ సామాజిక వర్గానికి తరగతికి చెందిన కీలకమైన నేతలు కొంత అసంతృప్తి చెందుతున్నారు. ఈ కారణంగానే టీపీసీసీ అధ్యక్ష పదవిని ఆ తరగతికి చెందిన నేతలకు ఇచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. పీసీసీ చీఫ్ పదవిని ఈ సారి బీసీ నాయకుడికి అప్పగించాలని కాంగ్రెస్ అధినాయకత్వం యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో రెడ్డి   సామాజిక వర్గానికి చెందిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మల్లు భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం పదవిని కేటాయించారు.  మంత్రులుగా కేవలం ఇద్దరు బీసీలకే అవకాశం కల్పించింది. వారిలో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడంలో భాగంగా పీసీసీ చీఫ్​ పదవిని ఆ సామాజిక వర్గానికి చెందిన  నేతలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది.   మధుయాష్కీని పీసీసీ చీఫ్​ గా నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగోతంది.నిజామాబాద్ అర్బన్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్ గౌడ్ పేరు కూడా ఈ పదవికి పరిశీలనలో ఉందని చెబుతున్నారు.

ఈ సారి ముస్లింలకు ఇస్తే ఎలా ఉంటుదంన్న చర్చ కూడా జరుగుతోంది.   రేవంత్ రెడ్డికి సన్నిహితుడు అయిన షబ్బీర్ అలీ ని టీ పీసీసీ చీఫ్ ను చేస్తే…  మజ్లిస్ ప్రభావం నుంచి  ముస్లింలు బయటకు వస్తారని.. కాంగ్రెస్ కు అండగా నిలుస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో  టీపీసీసీ అధ్యక్షులుగా ఎన్నికయ్యే నేత అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదే సమయంలో టీ పీసీసీ చీఫ్ తన పరపతిని  పెంచుకంటే..వర్గపోరాటానికి సిద్ధమయితే మాత్రం.. గడ్డు పరిస్థితి ఎదురవుతుంది.ఇటీవల పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి ఇలాంటి వర్గపోరాటమే కారణం అని చెబుతున్నారు. అందుకే.. రేవంత్ రెడ్డి చాయిస్ మేరకు టీ పీసీసీ అధ్యక్షుడ్ని నియమిస్తారని అంటున్నారు. ఏది అయినా పార్లమెంట్ ఎన్నికల తర్వాతేనని భావిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీలో మెరిట్ చూపించి… పలుకుబడి పెంచుకోవచ్చు.  రేవంత్ రెడ్డికి ఇప్పుడా అవకాశం వచ్చింది.  లోక్ సభ ఎన్నికల తర్వాత రేవంత్ బలపడతాడో.. బలహీనపడతాడో క్లారిటీ వస్తుంది….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి