తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు. ఈ ప్రశ్నకు సమాధానం తొందరలోనే బయటకు వస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 15 రోజుల్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల లోపు, అంతకంటే ఖచితంగా చెప్పాలంటే బడ్జెట్ సమావేశాల లోపే పూర్తి స్థాయి మంత్రివర్గం కొలుపు తీరుతుందని పార్టీ పెద్దలు విశ్వసిస్తున్నారు….
బంపరాఫర్ దక్కేదెవరికన్న ప్రశ్నలకు సమాధానం దొరకడానికి ఎక్కువ కాలం వేచి చూడాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రితో కలుపుకొని మంత్రివర్గంలో 18 మందికి చాన్స్ ఉంటుంది. ఈ లెక్కన ప్రస్తుతం 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా ఆరు ఖాళీలున్నాయి. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ వంటి అత్యంత కీలకమైన ప్రాంతానికి మంత్రి లేరు. ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ఒక్కటే సీటు గెలవడం, సామాజిక సమీకరణాల ప్రకారం ప్రాధాన్యం ఇవ్వాల్సి రావడంతో తొలి విడతలో ఎవరికీ చాన్స్ ఇవ్వలేదు. లోక్ సభ ఎన్నికలకు పూర్తిస్థాయి మంత్రివర్గంతో వెళ్లేందుకే సీఎం రేవంత్, కాంగ్రెస్ అధిష్ఠానం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. అందుకనే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేని వారికి కేబినెట్ హోదాతో నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియ కూడా వేగం పుంజుకుంది. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మల్లు రవిని ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఆయన డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కకు స్వయాన సోదరుడని మరిచిపోకూడదు.
ఇంతవరకు అవకాశం రాని జిల్లాలకు, ఛాన్సు దక్కని సామాజిక వర్గాలకు మంత్రి పదవులు ఇస్తారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ఖాళీగా ఉన్న స్థానాల్లో కనీసం 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకే దక్కుతాయని బహిరంగంగానే చెబుతున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ కోసం గట్టిగా పనిచేసే సత్తా ఉన్న వారిని అమాత్య పదవి వరించబోతోంది..
ఈ సారి విస్తరణలో మూడు బీసీ, ఎస్సీ -ఎస్టీలకు చెరో స్థానం ఇస్తారని చెప్పుకుంటున్నారు. ఓసీలకు ఒకటి రెండు స్థానాలు రావచ్చు. అదే జరిగితే బీసీలకు ఒక మంత్రి పదవి తగ్గుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఎస్టీ కోటా బాలూ నాయక్, ఎస్సీ విభాగంలో వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. వాకిటి శ్రీహరి , ఈర్లపల్లి శంకర్ కు బీసీ కోటాలో చోటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెడ్డి వర్గం నుంచి నల్లొండ జిల్లాకు చెందినకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేదా గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన మల్ రెడ్డి రంగారెడ్డి లో ఒకరికి బెర్తు ఖాయమని అంటున్నారు. నిజామాబాద్ నుంచి ఇప్పటి వరకు ఎవరికీ ఛాన్స్ ఇవ్వకపోవడంతో ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.వెలమ సామాజికి వర్గానికి చెందిన ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ కు అవకాశం వస్తుందని ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని అంటున్నారు. రాహుల్ గాంధీ కోటాలో తాజా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పేరు కూడా వినిపిస్తోంది.
నిజానికి ఆరు బెర్తులకు ఇరవై మంది వరకు పోటీ పడుతున్నారు.దానితో మంత్రివర్గ విస్తరణ కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. మరో పక్క ప్రొఫెసర్ కోదండరామ్ కు మంత్రి పదవి ఇస్తారా లేక వేరే ఏదైనా పదవి ఇస్తారా అన్నది ఇంకా తేలలేదు. ఏదైనా ఫిబ్రవరి పది లోపు తేలిపోతుందని మాత్రం నమ్మకంగా చెప్పొచ్చు. అంతవరకు ఖాయం…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…