రేవంత్ చెప్పిందేమిటి..చేస్తున్నదేమిటి…

By KTV Telugu On 7 September, 2024
image

KTV TELUGU :-

విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. అధికారానికి వచ్చిన తర్వాత మరో చేత. అదే మన రాజకీయ నాయకుల మాటలకు, చేతలకు ఉన్న తేడా. ప్రస్తుత తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి  కూడా అదే రాజకీయ  బృందంలో చేరిపోయినట్లున్నారు. ఎన్నికల ముందు తాను చెప్పిన దానికి ఇప్పుడు  హైడ్రా రూపంలో తాను  చేస్తున్న పనులకు పొంతన లేకుండా పోయింది.  పైగా ఇప్పుడు  ఇచ్చిన హామీలను నెరవేర్చలేక హైడ్రా రూపంలో డైవర్షన్ కు తెరతీశారన్న  ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అప్పుడు చెప్పిందేమిటి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నదేమిటి.. వాచ్ దిస్ కేటీవీ స్పెషల్ స్టోరీ….

తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించడంలో  రేవంత్  రెడ్డికి కీలక పాత్రే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడం ఎవరి తరం కాదని భావించిన తరుణంలోనే నేనున్నానంటూ రేవంత్  ముందుకొచ్చి పీసీసీ సారధ్యం చేపట్టి విజయతీరాలకు చేర్చారు. కాంగ్రెస్  పార్టీ కూడా ఆయన సేవలను, అంకితభావాన్ని, నాయకత్వ లక్షణాలను గుర్తించి సీఎం పదవి కట్టబెట్టింది. అయితే అధికారానికి వచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి అనేక హామీలిచ్చారు.ఆ గ్యారెంటీల వారెంటీ దాటి పోయే పరిస్థితి  వచ్చినా ఇంకా కొన్ని అమలుకు నోచుకోలేదు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఒక్కటే సమర్థంగా నడుస్తోంది. రైతు రుణమాఫీలో  లొసుగులు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. రైతు భరోసా ఉసే ఎత్తడం లేదు.నిధులు లేక  కొన్ని ప్రధాన హామీల జోలికి పోవడం లేదు. ఈ లోపే హైడ్రా పేరుతో హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించి  కట్టిన భవనాల కూల్చివేత మొదలు పెట్టారు. ఎవడైతే నాకేమిటని రేవంత్ ముందుకు సాగుతున్నారు. తన సోదరుడు తిరుపతి రెడ్డి కట్టిన ఇంటికి సైతం నోటీసులు ఇప్పించారు. నటుడు అక్కినేని నాగార్జున … చెరువును ఆక్రమించి కట్టిన ఎన్ కన్వెన్షన్ ను మొహమాటం లేకుండా కూల్చేశారు. రేవంత్  రెడ్డి అజెండాను హైడ్రా కమిషనర్ రంగనాథ్ తూచ తప్పకుండా పాటిస్తున్నారు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న భవనాల కూల్చివేత తొలుత  ప్రారంభమైంది. ఎఫ్టీఎల్ పూర్తయిన తర్వాత బఫర్ జోన్లోకి వస్తారని భావిస్తున్న  తరుణంలో రేవంత్ రెడ్డి నిన్న చెప్పిందేమిటి ఇవాళ చేస్తున్నదేమిటన్న చర్చ జరుగుతోంది.ఎన్నికల ముందు  ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ..అక్రమ కట్టడాల రెగ్యులరైజేషన్  కు మద్దతిస్తూ మాట్లాడారు. అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలను అప్పట్లో వ్యతిరేకించిన ఆయన అక్రమ కట్టడాలను  రెగ్యులరైజ్ చేయడం చట్టంలోనే ఉందని చెప్పుకొచ్చారు. ఇళ్లు కట్టుకున్న వాళ్లు దేశ ద్రోహం ఏమి చేయలేదని వాదించారు. కొంత ఫీజు కట్టించుకుని క్రమబద్ధీకరించడంలో తప్పులేదని ఆయన అన్నారు. కట్ చేసి చూస్తే అధికారానికి వచ్చిన తర్వాత అక్రమ కట్టడాలను వెదికి వెదికి కూల్చుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా, తమ పార్టీ హైకమాండ్ ను కూడా ఆయన దారికి తీసుకు వచ్చారు. హైడ్రా కూల్చివేతల్లో తప్పేమీ లేదని ఏఐసీసీ అంతర్గత సమావేశాల్లో రాహుల్ గాంధీతోనే ఆయన చెప్పించగలిగారు.

బీఆర్ఎస్ హయాంలో  బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒకటి ఉండేది. దాని ద్వారా లక్షలాది భవనాలు క్రమబద్ధీకరణకు జనం ఫీజు చెల్లించారు. సుప్రీం కోర్టులో కేసు కారణంగా అది ఆగిపోయింది. ఆ సంగతి తెలిసి కూడా రేవంత్ రెడ్డి కూల్చివేతలకే ప్రాధాన్యమిచ్చారు. ఆయన  లెక్కప్రకారం మరో ఏడాది కాలంలో కనీసం లక్ష భవనాలు నేలకూలాలి. ఇంతకు ఆయన ఎందుకలా చేస్తున్నారు. రేవంత్ అసలు ఉద్దేశం ఏమిటి…

ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి రెండూ ముందుకు సాగడం లేదు. పావలా ఉంటే ముప్పావలా ఖర్చు అవుతోంది. అధికారానికి వచ్చిన రోజే రేవంత్ రెడ్డి ఒక అంచనాకు వచ్చారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ వ్యవస్థను సజావుగా నడపడం కుదరదని ఆయనకు అర్థమైంది. దానితో మొదటి  రోజు  నుంచి రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. రాష్ట్ర ప్రగతి, ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్న ఒక పెద్ద అంశం తెరపైకి వచ్చి సర్కార్‌ను అతలాకుతలం చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగిపోవడం, ప్రజల దృ ష్టిని మళ్లించేందుకు పరుష భాషను ప్రయోగించడం, లేదంటే దృష్టి మళ్లింపు చ ర్యలకు అవసరమైన ఆసక్తికరమైన అం శాన్ని ఎంపిక చేసుకోవడమే పాలనగా భావిస్తున్నారు. అసంపూర్ణ రుణమాఫీపై రైతులు ఊరూరా రణగీతం ఆలపిస్తున్న  వేళ.. ఆ వాతావరణం నుంచి ప్రజల దృష్టిని మ ళ్లించే ఎత్తుగడలో భాగంగా హైడ్రా సహా అనేక అంశాలు తెరపైకి తెచ్చారు. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు చేసిన వ్యాఖ్యలపై రైతుల నుంచి వ్యతిరేకత  వస్తోంది. గతంలో బియ్యం కొనుగోళ్ల టెండర్లో 11 వందల కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలు రాగానే.. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బయటపెట్టి డైవర్ట్ చేసేశారు. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు కోసం ఉద్దేశించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏ ర్పాటు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ మేధో సమాజం సీఎం వ్యవహరిస్తున్న తీరుపై రాహుల్‌గాంధీకి లేఖ రాసింది. అమెరికా పర్యట నలో సీఎం రేవంత్‌రెడ్డి తన సోదరుడి సంస్థతో 1,000 కోట్ల ఒప్పందం దుమారం రేపింది. వీటి నుంచి దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీ సాక్షిగా సర్కార్‌ వైఫల్యాలను ఎండగడితే, వాటిపై సమాధానం చెప్పాల్సిందిపోయి ‘ఆ ఇద్దరు అక్కలను నమ్ముకుంటే బతుకు జూబ్లీ బస్టాండే’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి మరో డైవర్షన్ కు తెరతీశారు.రెండు లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ అంటూ హడావుడి చేసిన రేవంత్ సర్కారు…చివరకు ఉద్యోగాల సంఖ్య, పరీక్షల తేదీల లెక్క చెప్పకుండా అసెంబ్లీ సాక్షిగా ఒక క్యాలెండర్ విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ క్రమంలో కొన్ని  రోజులు టైమ్ పాస్  డైవర్షన్ పాలిటిక్స్ కు అవకాశం పొందింది. ఏదైనా సరే హైడ్రా  అనే పేరుతో ఒక కుదుపు కుదిపి…అన్ని సమస్యల నుంచి  పక్కతోవ పట్టించే ఏర్పాటు చేసుకుంది.

ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా మామూలు జనానికి ఇబ్బంది ఉండదని రేవంత్ హామీ  ఇస్తూ వచ్చారు. ఇప్పుడు మాత్రం సామాన్యులను సైతం టార్గెట్ చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పైగా ప్రజల్లో ఆయన ఎలాంటి విశ్వాసాన్ని పొందలేకపోతున్నారు. ఆర్థిక నిస్సహాయత నుంచి బయట పడేందుకే ఆయన డైవర్షన్ కు  ప్రయత్నిస్తున్నారనుకోవాలి…

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి