తెలంగాణ రాజకీయాలకు రేవంత్ ట్విస్ట్

By KTV Telugu On 24 April, 2023
image

చార్మినార్ చౌరస్తాలో తెలంగాణ రాజకీయాలు కాకెక్కినట్లుగా ఉన్నాయి. భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా కంట తడి పెట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రజల సానుభూతి పొందినట్లే ఉన్నారు. పైగా బీజేపీ గేమ్ ను ఆ పార్టీపైనే ప్రయోగించినట్లుగా కూడా నిర్థారణకు వచ్చారు రాజకీయ ప్రత్యర్థులు మాత్రం సీన్ సితారైందని సింపథీ కోసం రేవంత్ చేసిన ప్రయత్నం అట్టర్ ప్లాప్ అయ్యిందని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డివి దొంగేడుపులేనని వాటి వల్ల తమకు ఎలాంటి నష్టమూ లేదని ప్రకటించేశారు. రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ అనడంలో సందేహం లేదు. రాజకీయ అవకాశాలను వినియోగించుకోవడంలో తప్పులేదు. ప్రత్యర్థుల కంటే రెండాకులు ఎక్కువ తినడంలోనే అసలు మజా కూడా ఉంటుంది. అయితే గుడిలో ప్రమాణం చేసి రెవంత్ రెడ్డి తొందర పడ్డారని కొందరి వాదన లేదు లేదు సరైన సమయంలో సరైన దెబ్బే కొట్టారని మరి కొందరు విశ్లేషిస్తున్నారు.

రేవంత్ రెడ్డి భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్లడంలో కూడా ఒక సందేశం ఉంది. టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తరచూ భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా సవాలు చేస్తుంటారు. ఎప్పుడంటే అప్పుడు గుడికి వెళ్లి రండి చూసుకుందామని తొడ కొడుకుంటారు. దానితో బీజేపీ వాళ్లు కూడా సవాలుగా అక్కడకు వస్తారని మీడియా భావించి ఉండొచ్చు. వాళ్లు రారని రేవంత్ రెడ్డికి ఇతర కాంగ్రెస్ నేతలకు తెలుసు. కాకపోతే ఇంకెప్పుడూ బీజేపీ వాళ్లు భాగ్యలక్ష్మి సాక్షిగా సవాలు చేయకుండా చూడాలన్నది రేవంత్ ఆలోచన కావచ్చు. పైగా మునుగోడు ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పాతిక కోట్లు తీసుకుందని ఈటల రాజేందర్ చేసిన ఆరోపణ తప్పని నిరూపించాలంటే భాగ్యలక్ష్మి ఆలయమే సరైన ప్రదేశమని కూడా రేవంత్ అనుకుని ఉండొచ్చు. ఈటల ఎక్కడా రేవంత్ పేరు ప్రస్తావించలేదు. పాతిక కోట్లు తీసుకున్న మాట నిజమేనని దాన్ని నిరూపించడం మాత్రం కష్టమని ఈటల ప్రకటించారు. కాకపోతే తానే పార్టీ అధ్యక్షుడిని కాబట్టి తనపైనే ఆరోపణలు చేసినట్లుగా భావించి రేవంత్ రియాక్ట్ అయ్యారు. అందులోనూ ఓ రాజకీయం ఉంది. ఈ సవాళ్లను అడ్డం పెట్టుకుని కేసీఆర్ ను కూడా నాలుగు తిట్టొచ్చని రేవంత్ కు తెలిసే ముందుకు సాగారు. తాను కేసీఆర్ కి లోంగిపోయే టైపు కాదని కడిగిన ముత్యం లాంటి వ్యక్తినని రేవంత్ చెప్పుకోవడానికి కూడా ఈ అవకాశం లభించింది. పైగా కంటతడి పెట్టిన పక్షంలో వచ్చే సానుభూతి ఏమిటో ఆయనకు బాగానే తెలుసు.

రేవంత్ గేమ్ ప్లాన్ తెలిసినందునే ఆయన ఆరోపణలను సవాళ్లను తిట్లను బీజేపీ పెద్దగా పట్టించుకోలేదు. తాను ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదని ఈటల ప్రకటించేశారు. భయంతోనే రేవంత్ కంటతడి పెట్టుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అందరినీ భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి తీసుకురావాలన్న తన కోరిక నెరవేరిందని మాత్రం సంజయ్ చెప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తాయని సంజయ్ అంటున్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పాతిక కోట్లు ఇచ్చింది మాత్రం నిజమని సంజయ్ మరోసారి ఆరోపించారు. రేవంత్ రెడ్డి బహుముఖ వ్యూహాన్ని అమలు చేశారనే చెప్పాలి. తనపై వేరోకరు ఆరోపణలు చేసేప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని ఆయన హెచ్చరించినట్లయ్యింది. లేని పక్షంలో భాగ్యలక్ష్మీ అమ్మవారి గుడికి రావాల్సి ఉంటుందని ఆయన చెప్పకనే చెప్పారు. పార్టీలోనూ పెరుగుతున్న అసమ్మతిని చల్లార్చేందుకు ఇదో అస్త్రంగా ఆయనకు ఉపయోగపడింది. ఎందుకంటే ఇప్పుడు టీకాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులున్నట్లు లెక్కేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి వీకైపోయిన తర్వాత భట్టి విక్రమార్క రేణుకా చౌదరి గ్రూపులు బలపడుతున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హైకమాండ్ అవకాశం ఇస్తే సీఎం అవుతానని భట్టి విక్రమార్క తన పాదయాత్ర సందర్భంగా ప్రకటించడంతో రేవంత్ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. రేణుకా చౌదరి కూడా వేరుగా మీటింగులు పెట్టి సీఎం పదవికి కర్చిఫ్ వేస్తున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తెచ్చే బాధ్యతను తాను తీుకుంటానని రేణుకు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తన అనుచరులు పదిమందికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే కాంగ్రెస్ లోకి వస్తానని పొంగులేటి షరతు పెట్టారట. ఇదే ఇప్పుడు టీ కాంగ్రెస్ లో టెన్షన్ కు కారణమవుతోంది. అధిష్టానం మదిలో ఏముందో రేవంత్ కు ఖచితంగా తెలీదు. అవసరమైతే అవకాశం వస్తే బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం వెనుకాడదన్న వార్తలు చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నాయి. మే 10న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత పొత్తులపై స్పష్టత వస్తుంది. అప్పటి నుంచి తెలంగాణ ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే టైమ్ ఉంటుంది. కాకపోతే అధిష్టానం తీరుతో రేవంత్ కు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ ను కేసీఆర్ జైలుకు పంపారు. ఆ కసి టీకాంగ్రెస్ అధ్యక్షుడిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. శనివారం భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా కంటతడి పెట్టినప్పుడు కూడా రేవంత్ పదే పదే అదే విషయాన్ని చెప్పారు. ఆయన మనసులో ఉన్న బాధంతా ఒకటే. కాంగ్రెస్ అధిష్టానం తన ఆలోచనతో సంబంధం లేకుండా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటుందని ఆయన భయపడుతున్నారు. అందుకే పొత్తులు వద్దని అంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు. బీజేపీ నేతల భుజం మీద గన్ పెట్టి కాంగ్రెస్ అధిష్టానాన్ని కాల్చేందుకు ఆయన ప్రయత్నించారు.