జిల్లాల తగ్గింపు… రేవంత్ చెలగాటం

By KTV Telugu On 12 January, 2024
image

KTV TELUGU :-

రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో  కొత్త చర్చకు కారణం అవుతోంది.  జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని, జిల్లాల సంఖ్య తగ్గిస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలతో పాటు మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తామన్నారు. దీంతో ఎన్ని జిల్లాలను తగ్గిస్తారు ? ఏ ప్రాతిపదిక తీసుకుంటారు ? రాజకీయంగా జరిగే వివాదాలను ఎలా ఎదుర్కొంటారన్నది సస్పెన్స్‌గామారింది.

తెలంగాణలో జిల్లాల విభజన శాస్త్రీయంగా జరగలేదు. రాజకీయ అవసరాలు, కృత్రిమ ఉద్యమాల ఆధారంగా జరిగింది. ఇందులో వంద శాతం నిజం ఉంది. ఎందుకంటే ఒక్కో నియోజకవకర్గంలో సగం ఓ జిల్లా.. సగం మరో జిల్లా ఉంటోంది. ఒక్ పార్లమెంట్ నియోజకవర్గం నాలుగు జిల్లాల్లో కలిసి ఉన్న పరిస్థితి కూడా ఉంది.  కొన్ని జిల్లాల్లో ముగ్గురు నలుగురు జడ్పీటీసీలు మాత్రమే ఉన్నారని .. జడ్పీ సమావేశం నిర్వహిస్తే వేదికపై ఉండేవారు తప్ప కింద ఉండే వారు ఉండరు.  అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేయాల్సి ఉందని అంటున్నారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత పది జిల్లాలను  33 జిల్లాలుగా తెలంగాణ ప్రభుత్వం విభజించింది.  464 మండలాలను 612 మండలాలుగా విభజించింది. రెవెన్యూ డివిజన్లు 37 ఉంటే వాటిని 74కు పెంచారు. 8368 గ్రామపంచాయతీలను 12,769 గ్రామపంచాయతీలుగా పునర్వ్యవస్థీకరించారు. రాజకీయ పరంగా ఎక్కడ మేలు జరుగుతుందని అనుకుంటే అక్కడ జిల్లాలు, మండలాలు, రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారన్న ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి.  పునర్విభజన సమయంలో ప్రజాభిప్రాయ సేకరణ, ముందస్తు కసరత్తు లేకుండా హడావిడిగా నిర్ణయాలు తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తొలుత 31 జిల్లాలను ఏర్పాటు చేసిన కేసీఆర్ అనంతరం సమ్మక్క ములుగు, నారాయణపేట జిల్లాలను ప్రకటించారు.

కొత్త జిల్లాలకు సమీకృత కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. అయితే బీఆర్ఎస్ నేతల రియల్ ఎస్టేట్ కోసమని వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.  33 జిల్లాలకు తగ్గ అధికారుల, ఉద్యోగస్తులు, సిబ్బంది నియామకం మాత్రం కొత్తగా చేపట్టలేదు.  జిల్లా పరిషత్తులు తమ ప్రాభవాన్ని కోల్పోయాయి. అసెంబ్లీ తరహాలో సాగాల్సిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశాలు.. మండల పరిషత్తు సర్వసభ్య సమావేశాలను తలపించాయి. ఇక మండల పరిషత్తు సమావేశాలు, గ్రామపంచాయతీ సమావేశాల పరిస్థితిని ఊహించుకోవచ్చు.  పైకి సమీకృత కలెక్టరేట్లు కనిపిస్తున్నాయి కానీ అంతర్గతంగా పాలన మొత్తం గందరగోళంగా మారింది. అయితే ఇప్పుడు జిల్లాల ను ముట్టుకుంటే రాజకీయ ఉద్యమాలు వస్తాయి.   అందుకే రేవంత్ రెడ్డి జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తమని అంటున్నారు. ఆ కమిషన్ సిఫారసు మేరకు జిల్లాలలను తగ్గించే అవకాశం ఉంది. 33 జిల్లాను హేతుబద్దంగా చేస్తే.. .పద్దెనిమిది జిల్లాల వరకూ రావొచ్చన్న అంచనా ఉంది.  జిల్లాలు తగ్గుతాయని తెలుసు కాబట్టే బీఆర్ఎస్ నేతలు ముందస్తుగా ఉద్యమాలకు కార్పెట్ రెడీ చేసుకుంటున్నారు.  జిల్లాలు తగ్గిస్తే  ప్రజలు ఊరుకుంటారా అని కేటీఆర్ ముందే హెచ్చరించారు.   ఏర్పాటైన జిల్లాలను మళ్లీ రద్దు చేస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా? అన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. కొత్త జిల్లాల ఏర్పాటు సందర్భంగా అనేక ప్రాంతాల ప్రజలు తమకు జిల్లా కావాలంటూ రోడ్డు ఎక్కారు. కొన్నిచోట్ల నెలల తరబడి నిరసనలు కొనసాగాయి. గతంలో తాము పోరాడి సాధించుకున్న జిల్లాలు, మండలాలను రద్దు చేస్తే ప్రజలు ఎలా స్వీకరిస్తారన్నది రేవంత్‌ సర్కారుకు గట్టి సవాలుగా  మారుతుంది. దీన్ని ఎలా అధిగమిస్తారన్నది కీలకం.

సున్నితమైన భావోద్వేగపూరితమైన జిల్లా అంశాలన్ని  గందరగోళం చేసుకుంటే… లేనిపోని సమస్యను నెత్తికెక్కించుకున్నట్లే అవుతుందన్న వాదన ఉంది.  కాంగ్రెస్ పార్టీలోనే ఏకాభిప్రాయం రాకపోవచ్చు.  రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆ పార్టీలోనూ ఉత్కంఠగా మారింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి