హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర చేస్తున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రస్తుతం వరంగంల్ నగరంలో కొనసాగుతోంది. అంతకుముందు రోజు హన్మకొండలో రేవంత్ పాదయాత్ర రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఆయన హన్మకొండలో అడుగు పెట్టడంతోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తరువాత ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి తనదైన శైలిలో హన్మకొండ, వరంగల్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. నన్నపునేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ ఇద్దరు బిల్లా, రంగా లాంటి వారిని పేర్కొన్నారు. వరంగల్ ఎమ్మెల్యేలు దండుపాళ్యం బ్యాచ్ లాంటివారని భూకబ్జాలలో వీరికి మించిన వాళ్లు ఇంకెవరూ లేరు అంటూ వ్యాఖ్యలు చేశారు. వాళ్లు కేవలం భూములనే కాకుండా పందుల్ని కూడా వదలడం లేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
వరంగల్ కార్పోరేషన్ పరిధిలోని ఐదుగురు ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారని ఎంపీ దయాకర్ హన్మకొండ సిటీలో అయిదు ఎకరాలు కబ్జా పెట్టారని ఆరోపించారు. తాను కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకుడిని నాయకులకు కాదు అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ దండుపాళ్యం ముఠాకు తాను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నానని అన్నారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించినవారిని వదిలిపెట్టం వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. పోలీసులను కూడా హెచ్చరిస్తున్నా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయకండి మీరు రిటైర్ అయినా మిమ్మల్ని వదిలిపెట్టం అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బొందల గడ్డగా మారిందన్నారు రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ జెండా మోసే ప్రతి కార్యకర్తకు మంచి భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు.
హన్మకొండలో రేవంత్ రెడ్డి సభ ముగిసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై కొందరు వ్యక్తులు దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం పవన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వెంటనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దాడిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పోలీస్ కమిషనర్‌ను కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలే దాడి చేశారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ దీని వెనుక ఉన్నారని పవన్ హత్యకు ఎమ్మెల్యే కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. దాడిలో గాయపడ్డ పవన్ ను రేవంత్ రెడ్డి పరామర్శించారు. మొత్తానికి హన్మకొండ లో జరిగిన రేవంత్ రెడ్డి పాదయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. బుధవారం వరంగల్ సిటీలో జరగబోయే పాదయాత్రలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీలసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.