టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వచ్చే సంవత్సరం జనవరి మొదటి వారంలో తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. కానీ ఆ పార్టీ సినియర్ నాయకుల తీరు గమనిస్తే అసలు ఏనాటికైనా తెలంగాణ లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా అనే అనుమానాలు రాకమానవు. వివిధ గ్రూపులుగా విడిపోయి తమలో తాము కీచులాడుకుంటూ, నిత్య అసమస్యతితో తమ పరువు తామే తీసుకుంటున్నారు. పార్టీలో మార్పు తీసుకురావాలని, నాయకులందరూ సమన్వయంతో పనిచేయాలని అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించడం లేదు. అంతకుముందు ఉన్న మాణిక్కం ఠాగూర్ రేవంత్ రెడ్డికి వంత పాడుతున్నాడని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో ఆయనను తీసేసి ఠాక్రే ను పంపించింది అధిష్టానం. ఆయన వచ్చీ రావడంతోనే వివిధ వర్గాలుగా విడిపోయిన పార్టీని గాడిలో పెట్టాలని తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అందరూ ఐమకత్యంతో పనిచేయాలని సీనియర్లకు సూచించారు. అయినా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేవంత్ రెడ్డి పాదయాత్ర సాక్షిగా మరోమారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. రేవంత్ పాదయాత్రకు సీనియర్ల నుంచి సరైన సహకారం లేనట్లుగా కనిపిస్తోంది. ఆయన పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి కూడా ఎవరూ వెళ్లలేదు. ఇప్పటివరకు మల్లు రవి తప్ప ఇతర సీనియర్ నాయకులు ఎవరు రేవంత్ పాదయాత్రలో పాల్గొనలేదు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, కోమటిరెడ్డి, పొన్నాల, షబ్బీర్‌అలీ వంటి నాయకులు ఏమీ పట్టనట్లే ఉన్నారు. పాదయాత్ర సాగుతున్న కొద్దీ సీనియర్ నాయకులు ఒక్కొక్కరిగా జాయిన్ అవుతారని షబ్బీర్ అలీ చెప్పారు కానీ అది జరిగే అవకాశాలు కనిపించం లేదు.
కొంతమంది పార్లమెంటు సమావేశాలు ఉన్నాయని పాదయాత్రకు గైర్‌హాజరు అయితే, మరి కొంతమంది అసెంబ్లీ సమావేశాలను సాకుగా చూపి తప్పించుకున్నారు. పైగా తాను రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనబోనని, తాను స్వయంగా పాదయాత్ర చేస్తానంటూ భట్టి విక్రమార్క చెప్పారు. జగ్గారెడ్డి కూడా రేవంత్ రెడ్డి పాదయాత్రలో తాను పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. తాజాగా ఈ నెల 13 నుంచి తాను కూడా యాత్ర చేస్తానని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా సీనియర్ నాయకులను ఎలా దారికి తీసుకురావాలో అధిష్టానంకు కూడా అర్థం కావడం లేదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ఐదు విడతలు పాదయాత్ర పూర్తి చేశారు. ఈ యాత్రను విసయవంతం చేయడం కోసం బీజేపీ నాయకత్వం కలిసికట్టుగా పని చేసింది. పార్టీ హైకమాండ్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. కానీ రేవంత్ రెడ్డి పాదయాత్ర కు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, సీనియర్లు మాత్రం ఖాతరు చేయడం లేదు. సీనియర్ల వ్యవహరిస్తున్న తీరు చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించాల్సిన అవసరం లేదు…ఆ పార్టీ నాయకులే ఓడిస్తారనే మాటను మననం చేసుకుంటున్నారు.