కేసీఆర్‌కు షాక్‌.. రేవంత్‌రెడ్డి పాదయాత్రలో కామ్రెడ్లు

By KTV Telugu On 14 February, 2023
image

ఫిరాయింపు ఎమ్మెల్యేలను పాతరేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి. వారిని మళ్లీ శాసనసభలో అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించారు. 2018లో కాంగ్రెస్‌ బీఫాం మీద గెలిచిన పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని అశ్వాపురం జగ్గారం, గోపాలపురం, మిట్టగూడెం, కల్యాణపురం, గుల్లపల్లి గ్రామాల మీదుగా సాగింది. మధ్యాహ్నం మణుగూరు మండలం తోగ్గూడెంలోని సమ్మక్క సారలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అయితే ఈ రోజు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. సీపీఐ నాయకులు రేవంత్‌ రెడ్డితో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడంలోని పినపాక వద్ద ఏఐసీటీయూ నాయకలు రేవంత్‌తో కలిసి నడిచారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కామ్రెడ్లు కేసీఆర్‌కు బేషరతుగా మద్దతు ఇచ్చారు.

ఇక ముందు కూడా ఉభయ కమ్యూనిస్టు పార్టీలో బీఆర్‌ఎస్‌తో కలిసి నడుస్తాయని భావించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా రేవంత్‌ రెడ్డి పాదయాత్రలో సీపీఐ క్యాడర్‌ ప్రత్యక్షం కావడం బీఆర్‌ఎస్‌ నాయకులకు మింగుడు పడడం లేదు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రాబల్యం ఎక్కువ. ఈ పరిణామాలు గమనిస్తుంటే కమ్యూనిస్టులు మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రేవంత్‌ రెడ్డి పాదయాత్రకు దూరంగా ఉన్న సీనియర్లు కొందరు ఇప్పుడిప్పుడే పాదయాత్ర పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారు. భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే పోడెం వీర‌య్య చేసిన కామెంట్ రేవంత్ పాద‌యాత్ర‌కు కాంగ్రెస్ పార్టీలో మ‌ద్ద‌తు పెరుగుతుంద‌న్న అభిప్రాయం కలుగుతోంది. రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో పాద‌యాత్ర చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమ‌ని ఆయన అన్నారు. మరోవైపు 14న భద్రాచలంలో జరిగే హాత్‌ సే హాత్‌ జోడో పాదయాత్రలో రేవంత్‌ రెడ్డితో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొనబోతున్నారని మరో సీనియర్‌ నాయకుడు మల్లు రవి తెలిపారు.