సొంత పార్టీలో సపోర్టు లేదు ప్రతర్థి పార్టీల విమర్శలకు కొదవలేదు ఇదీ రేవంత్ రెడ్డి యాత్ర పరిస్థితి అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మొక్కవోని దీక్షతో రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అంటున్నారు. పార్టీ కార్యకర్తల నుంచి స్పందన బాగానే ఉంది. నాయకులే సాధ్యమైనంత దూరం పాటిస్తున్నారు. కొందరు అసలు యాత్ర వైపే కన్నెత్తి చూడపోతే కొందరేమో మొక్కుబడిగా వచ్చి వెళ్తున్నారు. బహుకొద్ది మంది మాత్రమే రేవంత్ రెడ్డికి ఆప్తమిత్రుల్లా కొనసాగుతూ యాత్రను సక్సెస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
నిజానికి రేవంత్ రెడ్డి ఫైర్ బ్రాండ్ ఎవరొచ్చినా రాకపోయినా తానొక్కడే నడిచి తెలంగాణ కోటలో అడుగుపెట్టగలనన్న ధీమా ఆయనది. అందుకే ఎంతమంది సీనియర్లు వ్యతిరేకించినా అధిష్టానాన్ని ఒప్పించి యాత్రకు గ్రీన్ సిగ్నల్ పొందారు. ఇప్పటికే మూడు వారాలు పూర్తి చేసుకుంటున్న యాత్రలో రేవంత్ ఎక్కడా మాట జారలేదు. అందరినీ కలుపుకుపోతున్నట్లే కనిపించారు. అందరినీ అన్ని సామాజికవర్గాలను కార్మిక కర్షక లోకాన్ని పలుకరించుకుంటూ వెళ్తున్నారు. రేవంత్ ఫుల్ ప్రిపరేషన్ చేసుకునే యాత్రకు బయలుదేరారు. ప్రతీ ప్రాజెక్టును అధ్యయనం చేసిన ఆత్మ విశ్వాసంతో వ్యవసాయదారుల వద్దకు ఆయన వెళ్తున్నారు. కేసిఆర్ ప్రభుత్వం ఏ ప్రాజెక్టును ఎలా నిర్లక్ష్యం చేసిందో చెబుతున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టూ కట్టుకున్న ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తున్నారని వైఎస్ హయాంలోని పథకాలను పక్కన పెట్టేశారని లెక్కలతో సహా చెబుతున్నారు. అది నిజమే కావడంతో జనం కూడా రేవంత్ మాటలను విశ్వసిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ వ్యతిరేకులున్నారు. వారు రేవంత్ యాత్రను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొంతమంది తెరచాటుగా ఇతరులను రెచ్చగొడుతున్నారు. ఇప్పుడిప్పుడే యాత్రకు ఊపు వస్తుందనుకుంటున్న తరుణంలో ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా పాదయాత్ర చేపట్టడం కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతోంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి హైదరాబాద్ వరకు మొదటి విడతగా ప్రజా సమస్యలపై పోరు యాత్ర పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. ఆ పాదయాత్ర ప్రారంభానికి రేవంత్‌తో పొసగని సీనియర్ నేతలంతా హాజరు కావడంతో చర్చగా మారింది. అంతేకాదు రేవంత్ పాదయాత్రకు పోటీగా నిర్వహిస్తున్నారనే ప్రచారం కూడా మొదలైంది.
వాస్తవానికి మహేశ్వర్‌రెడ్డి రేవంత్‌రెడ్డి మధ్య కొన్నాళ్ళుగా విభేదాలు ఉన్నాయి. రేవంత్ తీరు నచ్చని మహేశ్వర్‌రెడ్డి అనేక సందర్భాల్లో బహిరంగంగానే తప్పుపట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తన ఉనికి నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న కోపం మహేశ్వర్‌రెడ్డిలో ఉంది. అలాగే పార్టీ నుంచి పొమ్మన లేక పొగ పెడుతున్నారని కూడా ఆరోపించారు. దాంతో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో టచ్‌లో ఉంటున్న మహేశ్వర్‌రెడ్డి జిల్లాలో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే సమాంతర హాత్ సే హాత్ జోడో పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.పైగా తన యాత్రకు అధిష్టానం మద్దతు ఉందని మహేశ్వర్ రెడ్డి చెప్పుకుంటున్నారు. మహేశ్వర్ తీరు రేవంత్ రెడ్డికి కోపం తెప్పించినా ఆయన వ్యూహాత్మకంగా వ్యవహిస్తున్నారు. పార్టీ అభీష్టం మేరకే యాత్రలు జరుగుతున్నాయని రేవంత్ అంటూ వివాదాలకు తెరదించుతున్నారు.
రేవంత్ పై టీ కాంగ్రెస్ నేతలకు ఉన్న అక్కుసుకు మహేశ్వర్ రెడ్డి యాత్రే నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిల్లాలో యాత్రను నిర్వహించాలని ఏఐసీసీ ప్రతినిధి మాణిక్ రావు ఠాగూర్ ఆదేశించిన సంగతి నిజమే అయినా మహేశ్వర్ రెడ్డిని ఆ పని చేయమని మాత్రం చెప్పలేదంటున్నారు. యథాలాపంగా అన్న మాటను పట్టుకుని మహేశ్వర్ యాత్ర చేస్తున్నారనుకోవాల్సి వస్తోంది. పైగా రేవంత్ పార్టీని పరపతిని పక్కన పెట్టి వ్యక్తిగత ఇమేజ్ కోసం యాత్ర చేస్తున్నారని మహేశ్వర్ సహా కొందరు నేతలు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. అయినా రేవంత్ మాత్రం అదేమీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.
టీపీసీసీ చీఫ్ పాదయాత్రతో అధికార బీఆర్ఎస్ లోనూ కలవరం మొదలైంది. యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి బీఆర్ఎస్ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నట్లు చెబుతున్నారు. రేవంత్ కంటే పైచేయిగా ఉండాలన్న ఉద్దేశంతో కేటీఆర్ రంగంలోకి దిగి రాష్ట్ర పర్యటన మొదలు పెట్టారు. రేవంత్ పాదయాత్ర పూర్తి స్థాయిలో ఎన్నికల యాత్రగా మారకముందే ఫోకస్ తమవైపు తిప్పుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా మంత్రి కేటీఆర్ కొద్దిరోజులుగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలే అయినా పొలిటికల్ కలర్ రావడంతో బీఆర్ఎస్ లో కూడా జోష్ కనిపిస్తోంది. అన్ని పార్టీల కంటే ముందే ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్లు అయిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రేవంత్ యాత్రకు మంచి స్పందన వచ్చిన చోటే కేటీఆర్ కార్నర్ మీటింగులు పెడుతున్నారు.
కొద్దిరోజుల క్రితం రేవంత్‌రెడ్డి భూపాలపల్లి నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఓ రేంజ్‌లో మాటల తూటాలు పేల్చారు. అంతేకాదు వెళ్లిన ప్రతిచోట రేవంత్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. అయితే రేవంత్ సభ పెట్టిన మరుసటి రోజే కేటీఆర్ కూడా భూపాలపల్లి వెళ్లారు. ఒక్క ఛాన్స్ అంటున్న రేవంత్ గతంలో కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే ఏం చేసిందో చెప్పాలని కౌంటర్ ఎటాక్ చేశారు. స్టేషన్‌ఘనపూర్‌లోనూ రేవంత్ పాదయాత్ర చేసి స్థానిక ఎమ్మెల్యే రాజయ్యపై చార్జిషీట్ వేశారు. మళ్లీ కేటీఆర్ కూడా అదే నియోజకవర్గంలో సభ నిర్వహించి రేవంత్ విమర్శలను తిప్పికొట్టి డ్యామేజ్‌ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు. ఏదేమైనా రేవంత్ కు ఇప్పుడు ఇంటా బయట సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతుండగా ఆయన మాత్రం ఉక్కుసంకల్పంతో ముందుకు సాగుతున్నారు. నా దారి రహదారి డోన్త్ క్రాస్ మై వే అంటున్నారు.