తెలంగాణ కాంగ్రెస్‌ కోమాలోంచి ఇప్పుడే లేచింది!

By KTV Telugu On 6 January, 2023
image

తెలంగాణకాంగ్రెస్‌ పార్టీ కోమాలోంచి ఇప్పుడే లేచినట్లుంది. ఎందుకంటే ఎప్పుడో పార్టీమారిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలకోసం ఇప్పుడు ఫిర్యాదుచేసింది. మరి ఇన్నాళ్లు ఏం చేసినట్లో? బీజేపీ మీద కేసీఆర్‌ పార్టీ చేసిన ఆపరేషన్‌కి ఇది కౌంటర్‌లా కనిపిస్తోంది. ఎమ్మెల్యేల ఎర కేసును న్యాయస్థానం సీబీఐకి అప్పగించిన నేపథ్యంలో టీకాంగ్రెస్‌కి గోడదూకిన తమ పార్టీ ఎమ్మెల్యేలు గుర్తుకొచ్చారు. తమ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ కొనుగోలు చేసిందంటూ పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదుచేశారు. సీబీఐ, ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తున్నారు. గులాబీపార్టీ ఎమ్మెల్యేలు నలుగురిని ప్రలోభపెట్టడానికి బీజేపీ ప్రయత్నించిందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. ముగ్గురిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కేసు నడిపింది. కొనుగోళ్ల కుట్రను భగ్నం చేయాలనుకుంటున్న సమయంలో కేసు రాష్ట్ర పోలీసులనుంచి జారిపోయింది. ఈ కేసులో ఆ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రిని కూడా సీబీఐ విచారించవచ్చన్న ప్రచారం జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎంట్రీ ఇచ్చింది.

రాష్ట్రంలో రెండోసారి బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌నుంచి గెలిచిన 12మంది ఎమ్మెల్యేలు అధికారపార్టీలోకి ఫిరాయించారు. పినపాక ఎమ్మెల్యే కాంతారావు , పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి , కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ, నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్య , ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ , కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూర్ నుంచి గెలిచిన పైలట్ రోహిత్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ ఫిరాయింపుదారుల్లో ఉన్నారు. వీరిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రి అయ్యారు. మిగిలిన నేతలు కూడా ఏదో రూపంలో లబ్ధిపొందారన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో కొందరు రాజకీయ ప్రయోజనాలు పొందితే మరికొందరు కాంట్రాక్టులు, డబ్బులు అందుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని బీఆర్‌ఎస్‌ అరచిగోలచేస్తుంటే తమ ఎమ్మెల్యేలను ఎలా తీసుకున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. పైకి అభివృద్ధిని కారణంగా చూపినా రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలకోసమే వారు పార్టీ మారారని చట్టపరంగా నిరూపించాలనుకుంటోంది కాంగ్రెస్‌పార్టీ. ఆ ఎమ్మెల్యేలు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవాలని భావిస్తోంది. ఫిర్యాదుతోనే ఆగడంలేదు కాంగ్రెస్‌నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ధర్నాలకు సిద్ధమవుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ఎలాగైతే విచారించారో తమ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని కూడా నిగ్గుతేల్చాలని కాంగ్రెస్‌ కోరుతోంది. కేసీఆర్‌మీద కేంద్రం గుర్రుగా ఉండటంతో కేంద్ర దర్యాప్తుసంస్థలకు కూడా ఫిర్యాదుచేసి ఆయన్ని ఇరకాటంలో పడేయాలన్నది కాంగ్రెస్‌ ప్లాన్‌. వర్కవుట్‌ అవుతుందో లేదోగానీ రాష్ట్ర ఇంచార్జి మారాక టీకాంగ్రెస్‌లో కొత్త హుషారైతే కనిపిస్తోంది.