ఎప్పుడూ నవ్వుతూ కనిపించే తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తాజాగా ఉగ్రావతారం ఎత్తారట.
ఓ సమావేశంలో అందరినీ ఉద్దేశించి కటువుగా మాట్లాడుతూనే ఒకరిద్దరు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారట. తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ప్రస్తుతం ఇది హాట్ టాపిగ్గా మారింది.
ప్రశాంతంగా, నవ్వుతూ నవ్విస్తూ కనిపించే రేవంత్ రెడ్డి హఠాత్తుగా కోపధారిగా ఎందుకు మారిపోయారు?
మంత్రులకు, ఎమ్మెల్యేలకు చీవాట్లు పెట్టేంత తప్పు వారేం చేశారు?
ఒళ్లు దగ్గర పెట్టుకొని పని చేయకపోతే ఖబడ్డార్ అనేంత పరిస్థితి తెలంగాణ కాంగ్రెస్లో ఎందుకు వచ్చింది?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కోపం వచ్చింది.. అవును మీరు వింటున్నది నిజమే…ఎప్పుడూ లేనంతగా ఆయన రుద్రతాండవం చేశారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారట. ఈ మధ్యకాలంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుపడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. వాటన్నిటిని అంశాలవారీగా తిప్పి కొట్టలేక అధికార పార్టీ నేతలు, మంత్రులు, అధికార ప్రతినిధులు, ప్రజాసంబంధాల అధికారులు చోద్యం చూస్తున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి పసిగట్టారు. ఆయనకు ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయో లేక ఆయన సొంత మనుషులు వివరించారో తెలియదుగానీ ప్రతిపక్షాలకు ధీటుగా సమాధానం చెప్పకపోవడాన్ని ఆయన సీరియస్గా తీసుకున్నారు.
ఉద్యోగాల నోటిఫికేషన్లు, హైదరాబాద్లో శాంతిభద్రతలు, రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న నేరాల తీవ్రత, విద్యుత్ కోతలు..ఇలా పలు సమస్యలపై ప్రతిపక్షాలు చీల్చి చెండాతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెయిన్ మీడియాలో, సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు తీవ్రస్థాయిలో వుండడం వాటిపై అన్ని వర్గాల ప్రజల్లో చర్చలు జరుగుతున్న విషయం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చింది.
ప్రతిపక్షాల విమర్శలకు సమయానికి సరైన విధంగా ఫిట్టింగ్ రిప్లయి ఇవ్వకపోతే ప్రజల్లో పలుచనయిపోతామని తెలుసుకున్న రేవంత్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగారు.
ప్రభుత్వ తరఫున స్పందించాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తుండడంతో ఇక ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిసైడయిపోయారు. అందుబాటులో వున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాసంబంధాల అధికారులను వెంటనే తనింటికి పిలిపించుకొని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలు, వాటికి ప్రభుత్వం తరఫునుంచి స్పందన లేకపోవడాన్ని ఉదాహరణలతో సహా వారి ముందుంచారట. ఇలాగైతే ఎలా..అన్ని విమర్శలకు నేనే బదులివ్వాలా..మరి మీరంతా వున్నది ఎందుకు? అని మంత్రులను, అధికార ప్రతినిధులను, ప్రజాసంబంధాల అధికారులను గట్టిగానే నిలదీశారని కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు.
ప్రతిపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తుంటే చూస్తూ కూర్చుంటారా ,స్పందించాల్సిన అవసరం మీకు లేదా.. అంటూ తీవ్ర స్థాయిలో రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతి అంశాన్ని తాను ప్రస్తావించలేనని..ఎవరి స్థాయిలో వారు గట్టిగా స్పందించి విమర్శలను తిప్పి కొట్టాలని లేకపోతే అందరమూ ఇబ్బందులపాలవుతామని ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఘాటుగా చెప్పినట్టు తెలుస్తోంది. చాలా కాలంగా రాజకీయాల్లో వున్నారు..ఈ మాత్రం కూడా మీకు తెలియదా.. అని కన్నెర్ర చేసినట్టు చెబుతున్నారు.
ఇక నుంచి అవసరాన్ని బట్టి అందరూ మాట్లాడాల్సిందేనని, ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ నాకు తెలుసునని, అంటీముట్టనట్టుగా వుండేవారి విషయంలో ఏం చేయాలో నాకు తెలుసని ఆయన హెచ్చరించారట.
ఆ విధంగా ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో అక్షింతలు వేయడంతో ప్రతిపక్ష నేతల విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…