కాంగ్రెస్ వంద రోజుల పాలన ముగిసింది. ఈ లోపు మళ్లీ ఎన్నికలు వచ్చాయి. వంద రోజుల పాలనపై ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి వస్తోంది. బీఆర్ఎస్ పాలన బాగోలేదని ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిన ప్రజలకు … అనుకున్న పాలన అందిస్తున్నారా ? బీఆర్ఎస్ లాగే రాజకీయం చేసి గడిపేస్తున్నారా ?
తెలంగాణ ఏర్పడిన పదేండ్ల తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వందరోజుల పాలన విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రభుత్వాన్ని పడగొడతామని, పడిపోతుందన్న గందర గోళం మధ్య సాఫీగానే వందరోజులు దాటింది. కేసీఆర్ ఉన్నంత కాలం సీఎంగా ఉంటారన్న అంచనాలను బద్దలు కొట్టి సీఎం అయిన రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలోనూ, అటు పార్టీలోనూ తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. ఆయన సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే… మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటితోపాటు రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ సౌకర్యాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు అంకురార్పణ చేసింది. తద్వారా ఆరు గ్యారెంటీల పరిధిలో ఉన్న 13 అంశాలకు సంబంధించి ఐదింటిని పూర్తి చేశామని ప్రకటించింది. మిగతా 8 అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని, నిధులు కేటాయించాల్సి ఉంది.
వంద రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలను తీసుకుంది. ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెతచ్చింది. ప్రజాపాలన కార్యక్రమం ద్వారా పథకాల లబ్దిదారుల ఎంపిక చేపట్టింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ప్రభుత్వం. నిజానికి గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయింది. నియామక పత్రాలు మాత్రం ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణను ప్రారంభించారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించటంలో గట్టి ప్రయత్నమే చేశారు. అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ. గొర్రెల పంపిణీ పథకం, చేప పిల్లల పెంపకం పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశం. ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణ. మిషన్ భగీరథ విలేజ్ లెవల్ ఇంట్రా పైపులైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ అధికారుల పాత్రపై విచారణ. వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రూ. వందల కోట్లకుపైగా వ్యాట్ ఎగవేత. వంటి వాటిపై విచారణలు చేయిస్తున్నారు. వంద రోజుల పాలన పూర్తిగా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సాగింది. లోక్ సభ ఎన్నికల్లో కనీసం పది సీట్లు సాధించకపోతే ప్రభుత్వ మనుగడ కష్టమన్నట్లుగా పరిస్థితి ఉంది. అందుకే ప్రజల్ని మెప్పించడమే టార్గెట్ గా పాలన చేస్తున్నారు.
ప్రజలు కాంగ్రెస్కు ప్రేమతో ఓట్లు వేయలేదు. కేవలం బీఆర్ఎస్పై ఉన్న వ్యతిరేకతతోనే గద్దెనెక్కించారు. ఇప్పుడు ఆ వ్యతిరేకతను తమకు అను కూలంగా మలుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కాబట్టి మిగిలిన హామీలను కూడా కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిజమైన ప్రజా సమస్యలైన నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టిపెట్టాల్సి ఉంది. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అమలు చేస్తానని చెప్పిన రేవంత్రెడ్డి ఈ విషయంలో మాత్రం ప్రజలకిచ్చిన మాట తప్పుతున్నట్టుగా కనిపిస్తుంది.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ‘ఈ వంద రోజులు ఒక ముఖ్యమంత్రిగా అద్భుతంగా పని చేశాను, ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా నా రాజకీయం ఏంటో చూపిస్తాను’ అంటూ సవాల్ విసిరి గేట్లు తెరిచానంటూ ప్రకటించారు. అంటే ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో కలుపుకొని ప్రతిపక్షాన్ని ఖాళీ చేసే పని మొదలు పెట్టినట్టే కదా! అప్పట్లో కేసీఆర్ ఇదే చేశాడు. ఇప్పుడు రేవంత్ కూడా అదే బాట పట్టారు.
విధానాలను విభేదించి ఒకరిద్దరు తన పార్టీలోకి రావడాన్ని ఎవ్వరూ తప్పు పట్టరు. కానీ ఆశలు చూపించి బేరసారాలాడి ప్రతి పక్షమే లేకుండా చేయాలని చూడడం ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనిపించుకోదు. తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు ఇది కాదు. ప్రజలు కోరుకుంటున్న నిజమైన మార్పును చూపించాల్సిన బాధ్యత కాంగ్రెస్కు ఉంది. లేకపోతే అంతిమంగా తీర్పు చెప్పాల్సింది ప్రజలేనన్న సంగతిని గుర్తు చేస్తారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…