తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉక్కపోత ప్రారంభమయింది. పార్టీలో వెల్లువలా చేరికలంటూ పెట్టుకున్న ఆశలన్నీ కల్లలైపోగా ఇప్పుడు ఉన్న వాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోతారా అన్న టెన్షన్ పడుతోంది. ఈ పరిస్థితిని డీల్ చేయడంలో సున్నితంగా వ్యవహరించకపోగా ఉంటే ఉండండి పోతే పోండి అన్న సంకేతాలు ఇవ్వడంతో ఇక అటూ ఇటూ చూస్తున్న నేతలంతా కాంగ్రెస్ గూటికి చేరుకునే ముహుర్తం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఓ క్లారిటీ వస్తోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి తెలంగాణ బీజేపీ డిఫెన్సివ్ మోడ్‌లో ఉంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎటాకింగ్ పొజిషన్ లోకి వచ్చింది. టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఎమోషనల్ పాలిటిక్స్ తో బీజేపీపై మైండ్ గేమ్ ప్రారంభించారు. ఈ ట్రాప్‌లో బీజేపీ చాలా సులువుగా పడిపోయిందని తాజా పరిమామాలు నిరూపిస్తున్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలవగానే వెంటనే రేవంత్ రెడ్డి తెలంగాణలో ఆపరేషన్ ప్రారంభించారు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేశారు. ఆ పార్టీని మరింత బలహీనం చేసేందుకు రెడీ అయ్యారు. ఎందుకంటే తెలంగాణలో ముఖాముఖి పోరు కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ముక్కోణపు పోటీ జరిగితే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్‌కు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ విషయం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఉంది. అలా అని బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేసేంత శక్తి రేవంత్ రెడ్డి దగ్గర లేదు. కానీ బీజేపీని చేయగలరు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి కొన్ని బయటకు చెప్పుకోలేని బలహీనతలు ఉన్నాయి.అదే సమయంలో తెలంగాణలో బీజేపీ నేతల మీద ఆధారపడి బలపడే ప్రయత్నం చేస్తోంది. అంటే బీజేపీలో చేరే నేతలు ఉన్న చోట్ల మాత్రమే బలంగా తయారవుతోంది. ఇతర చోట్ల ఎవరూ బలపడలేదు. ఇంకా చెప్పాలంటే బండి సంజయ్ లాంటి నేతలు బలపడనివ్వలేదని అనుకోవచ్చు. తనకు మాత్రమే క్రేజ్ రావాలని ఆయన అనుకోవడం ఎలాంటి కార్యక్రమం అయినా తానే లీడ్ తీసుకోవడంతో ఇతరులు ఎదగలేకపోయారు. చివరికి ఇమేజ్ ఉన్న నేతలు ఫోకస్ కావడానికి కూడా ఆయన అంగీకరించలేదు అవకాశం కల్పించలేదు. దీంతో సహజంగానే అంతర్గత అసంతృప్తి కమ్ముకుపోతూ వచ్చింది.
తెలంగాణ బీజేపీలో ఏర్పడిన పరిస్థితిని రేవంత్ రెడ్డి పక్కాగానే అంచనా వేశారు. అందుకే కర్ణాటక ఫలితాలు వచ్చిన వెంటనే బీజేపీ ముఖ్య నేతలందరికీ ఓ సందేశం పంపించారు. కేసీఆర్‌ను ఓడించాలంటే అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రేవంత్ కొంత మంది పేర్లు చెప్పారు కొంత మందివి చెప్పలేదు కానీ ఆయన జాబితాలో డీకే అరుణ, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇలా పలువురు కీలక నేతలు ఉన్నారు. వీరంతా గత నాలుగైదేళ్ల కాలంలో బీజేపీలో చేరిన వాళ్లే. నిఖార్సైన బీజేపీ నేతల్లో మాస్ లీడర్లు తక్కువగా ఉన్నారు. కానీ బీజేపీలో చేరిన ఇతర మాస్ లీడర్లను వారు ఎదగనీయలేదు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. అయితే ఇంత కాలం కాంగ్రెస్ ప్రత్యామ్నాయయం అవుతుదని వీరెవరికీ నమ్మకం లేదు అందుకే బీజేపీలోనే ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ కాస్త మెరుగుపడటం కాంగ్రెస్ గాలి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందేమో అన్న సంకేతాలు వస్తూండటంతో వారిలోనూ మార్పు కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డితో పాటు కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేసిన ప్రకటనలు చూస్తే వీరు ఇక తమ దారి తాము చూసుకునేందుకు సిద్ధమయ్యారన్న అభిప్రాయం ఎవరికైనా వస్తుంది.
పరిస్థితిని గమనించకుండా బీజేపీ పెద్దలు కూడా సీనియర్ నేతలకు వార్నింగ్ లు ఇస్తున్నట్లుగా ప్రకటనలు చేస్తున్నారు. సర్వేల్లో గెలుస్తారని వచ్చే వారికే టిక్కెట్లు ఇస్తామని బండి సంజయ్ హెచ్చరిస్తున్నారు. ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకోబోమని సునీల్ భన్సల్ కూడా హెచ్చరికలు జారీ చేశారు. కొంత మంది నేతలు చేస్తున్న ప్రకటనలపై తమకు సమాచారం ఉందని తగిన సమయంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇవి బీజేపీలో పరిస్థితిని ఏ మాత్రం సద్దుమణిగేలా చేయకపోగా మరింత క్లిష్ట పరిస్థితిని సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే వలస వచ్చిన నేతలంతా పోలోమంటూ కాంగ్రెస్ లోకి వెళ్లిపోతే బీజేపీ మైనస్ లోకి వెళ్లిపోతుంది. ఎందుకంటే బీజేపీకి ఇప్పటికే నేతలకొరత ఉంది. ఉన్న వారు కూడా వెళ్లిపోతే ప్రజాదరణ లేని పాత నేతలతో డిపాజిట్ల కోసం పోరాడాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితి కోసమే రేవంత్ రెడ్డి బీజేపీని ట్రాప్ చేస్తున్నారు. ఈ విషయం గుర్తించని బీజేపీ అగ్రనేతలు రేవంత్ రెడ్డి ప్లాన్ ను అమలు చేసేందుకు తమ వంతు సాయం తాము చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి లక్ష్యం ముఖాముఖి పోరు తీసుకు రావడం. అందుకోసం బీజేపీలో ఉన్న వలస నేతలందర్నీ ఎలాగైనా బయటకు తీసుకు రావాలన్న లక్ష్యంతో ఉన్నారు. బీజేపీ తెలంగాణలో గెలవడం అసాధ్యమన్న అభిప్రాయాన్ని ఇప్పటికే కల్పిస్తున్నారు. తాను జూనియర్ ను అని తన నాయకత్వంలో పని చేయడానికి ఎవరైనా సంకోచిస్తూంటే వారిని మంచి చేసుకోవడానికి తాను పది మెట్లు తగ్గుతానని కూడా చెబుతున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా వేస్తున్న ట్రాప్. ఇది వర్కవుట్ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు బీజేపీ నేతలంతా కాంగ్రెస్ లో చేరుతారనేదే కీలకం. కాంగ్రెస్ కు మరింత సానుకూల వాతావరణ ఏర్పడుతున్న సమయం చూసుకుని వీరంతా చేయి ఎత్తి జై కొడితే బీజేపీకి గడ్డు పరిస్థితే. అలాంటి రాజకీయం జరిగితే రేవంత్ రెడ్డి కేసీఆర్ ను మించిన తెలంగాణ రాజకీయ వ్యూహ చతరుడు అయిపోతారు.