అక్రమంగా వైద్య కళాశాల నిర్వహిస్తున్న మల్లారెడ్డి..

By KTV Telugu On 20 September, 2024
image

KTV TELUGU :-

ప్రైవేటు వైద్య కళాశాల అంటే.. ఫీజుల దందా ఒక్కటే కాదు..చాలా చాలానే ఉంటాయి. ఏదోక విధంగా కాలేజీని నడిపేసి ఏడాదికి వంద కోట్లు సంపాదించెయ్యాలన్న తపన నిర్వాహక యజమానుల్లో కనిపిస్తుంది. దేశంలో చాలా వరకు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో అదే పరిస్తితి ఉంటుంది. తెలంగాణ మాజీ మంత్రి చేమకూర మల్లారెడ్డి నిర్వహించే విద్యా సంస్థల్లో అది కాస్త ఎక్కువనే చెప్పాలి. కబ్జా రాయుడిగా పేరుపొందిన మల్లారెడ్డి, దానితో పాటుగా విద్యా సంస్థల నిర్వహణలో కూడా తిల్లుముల్లు చేశారని సాక్ష్యాలు ఒకటొకటిగా బయటపడుతున్నాయి. ఆయన కాలేజీలకు హైడ్రా ముప్పు ఉండగా, ఇప్పుడు వైద్య కళాశాలకు డీమ్డ్ హోదా విషయంలోనూ ఆయన అక్రమాలకు తెరతీశారని బయటపడింది..

మల్లారెడ్డి వైద్య కళాశాలపై తెలంగాణ సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. అన్ని కోణాల్లోనూ విచారణ జరపాలని సీఎం రేవంత్ రెడ్డి, తమ అధికారులను ఆదేశించారు. డీమ్డ్ హోదాతో లోకల్ కోటా సీట్లకు గండి కొడుతున్నారని ఇటీవల మెడికల్ స్టూడెంట్స్, పేరెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో తీగె లాగితే డొంక కదిలినట్లుగా పరిస్తితి తయారైంది. ప్రభుత్వం లేదా, కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అంటే ఎన్ఓసీ తీసుకోకుండానే డీమ్డ్ యూనివర్సిటీ హోదా పొందారని మల్లారెడ్డి వైద్య కళాశాలపై వస్తున్న ఆరోపణలు ఇప్పుడు విచారణ దిశగా అడుగులు వేస్తున్నాయి…

మెడికల్ కాలేజీలకు, యూజీసీకి అసలు సంబంధం ఉండదని వైద్యాధికారులు చెప్తున్నారు. కాలేజీల అనుమతులు, పర్యవేక్షణ వ్యవహారాలన్నీ నేషనల్ మెడికల్ కమిషనే చూస్తుంది. డీమ్డ్ హోదా కోసం దరఖాస్తు చేసుకుంటే, ఆయా కాలేజీ అప్పటికే అఫిలియేట్ అయిన వర్సిటీ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. యూజీసీ నిబంధనలు ఇవే స్పష్టం చేస్తున్నాయి. అయితే మల్లారెడ్డి కాలేజీలకు అసలు తాము ఎన్‌వోసీ ఇవ్వలేదని, అయినా డీమ్డ్‌ హోదా తెచ్చుకున్నారని కాళోజీ హెల్త్ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. దీంతో పాటు ఫీజుల విషయంలోనూ ఎన్‌ఎంసీ నుంచి స్పష్టమైన గైడ్‌లైన్స్‌ ఉన్నాయని, 50 % సీట్లకు రాష్ట్ర సర్కారు నిర్ణయించిన ఫీజులనే చార్జ్ చేయాల్సి ఉంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ, ఈ రూల్సేవీ మల్లారెడ్డి కాలేజీ పాటించడం లేదనే విమర్శలున్నాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘనల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. మరి కొన్ని ప్రైవేటు వర్సిటీల పరిధిలోని కాలేజీలపైనా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

డీమ్డ్ వర్సిటీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా అమలు చేయాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేనున్నది. డీమ్డ్‌ వర్సిటీలైనా, ప్రైవేటు నివర్సిటీలకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీలైనా సగం సీట్లను కన్వీనర్ కోటాకు ఇచ్చేలా కొత్త నిబంధనలు తీసుకురావాలని ఆలోచిస్తున్నది. ఈ అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్, కాళోజీ హెల్త్ వర్సిటీ ఆఫీసర్లను ఇప్పటికే హెల్త్ మినిస్టర్ రాజనర్సింహ ఆదేశించారు. మల్లారెడ్డి మెడికల్, డెంటల్ కాలేజీలకు ఇటీవలే యూజీసీ డీమ్డ్ వర్సిటీగా అనుమతులు ఇచ్చింది. దీని వల్ల కన్వీనర్ కోటాలోకి రావాల్సిన 200 ఎంబీబీఎస్ సీట్లు, వంద బీడీఎస్‌ సీట్లు మేనేజ్‌మెంట్ కోటాలోకి మారిపోయాయి. అపోలో, సీఎంఆర్ సహా మరో 4 కాలేజీలు కూడా డీమ్డ్ హోదా కోసం యూజీసీ వద్ద ప్రయత్నాలు చేస్తున్నాయి. వీటికి కూడా యూజీసీ నుంచి అనుమతులు వస్తే, దాదాపు 400 సీట్లకు పైగా కన్వీనర్ కోటా సీట్లు మేనేజ్‌మెంట్‌ కోటాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా రాష్ట్రానికి చెందిన లోకల్ స్టూడెంట్లకు నీట్‌లో మంచి ర్యాంకులు వచ్చినా, ఆయా కాలేజీల్లో సీట్లు లభించవు. అంటే పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువులు చట్టుబడ్డలవుతాయి. లక్షల్లో ఫీజులు, కోట్లలో డొనేషన్లు కట్టే వారికి మాత్రమే ఆయా కళాశాలల్లో సీట్లు వస్తాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఎంత త్వరగా మేల్కొని ప్రైవేటు విద్యా సంస్థలను దారికి తీసుకొస్తే అంత మంచిది..

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి