రుణమాఫీ – రేవంత్ మాస్టర్ ప్లాన్ !

By KTV Telugu On 18 May, 2024
image

KTV TELUGU :-

రెండు లక్షల రుణమాఫీకి ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు   సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ జరుగుతుందన్న నమ్మకం ప్రజలకు లేదు. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం  లక్ష రుణమాఫీని పూర్తి చేయలేకపోయింది.  అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తారన్నది చాలా మందికి సస్పెన్సే. అయితే రేవంత్ ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఆయనకు ఎన్నికల కోడ్ ఇందుుకు కలసి వస్తోంది.  అప్పులు చేయకుండా నిధులు సర్దుబాటు  చేసుకునే అవకాశం కూడా కలుగుతోందని చెబుతున్నారు.

లోక్‌సభ ఎన్నికలు ముగియగానే ఈనెల 15వ తేదీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రుణమాఫీపై ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నుంచి రైతు రుణమాఫీ చేయాల్సిందేననీ తేల్చిచెప్పారు. దానికోసం అవసరమైన సంపద సృష్టికి ఆయనే స్వయంగా కొన్ని సూచనలు చేశారు. ఆదాయ పెంపు మార్గాలపైనా సమీక్ష చేశారు.  ప్రధానంగా  జీఎస్టీ ఎగవేత వల్ల ఎక్కువ నష్టం జరుగుతోందన్న అంచనాకు వచ్చారు. అందుకే  ఆదాయం పెంచేందుకు క్షేత్ర స్థాయిలో నిత్యం తనిఖీలు, ఆడిటింగ్‌ చేయాలని ఆదేశించారు.  కొత్త పన్నులు విధించే అవకాశం లేదు. అందుకే ఆదాయం పక్కదారి పడుతున్న చోట్ల అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తున్నారు.

తెలంగాణలో దాదాపు 40 లక్షల మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీని కోసం రూ. 34 వేల కోట్ల వరకు నిధులు అవసరం అవుతాయని అంచనా. రైతు సంక్షేమం, అభివృద్ది కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడి నుంచి వస్తాయన్న దానిపై రేవంత్‌కు క్లారిటీ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చింది. కాంగ్రెస్‌ సర్కారు కేవలం వంద రోజులు మాత్రమే పూర్తి యాక్షన్‌లో పనిచేసింది. ఆ తర్వాతి నుంచి పరిపాలన ఎన్నికల కమిషన్‌ పరిధిలోకి వెళ్లింది. వివిధ ప్రాజెక్టులకు సంబందించి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు సహా అన్నీ పెండింగ్‌లో పడ్డాయి. కేవలం రోజువారీ సాధారణ ఖర్చుల్ని మాత్రమే ప్రభుత్వం చేస్తున్నది. ఎలక్షన్‌ కోడ్‌ అమల్లోకి వచ్చిన మార్చి నెల నుంచి రాష్ట్ర ఖజానా ద్వారా అత్యధికంగా అయిన ఖర్చు ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగుల జీతభత్యాలే ఈ ఖర్చు నెలకు దాదాపు రూ.3,800 కోట్ల వరకు ఉంది.  అప్పులకు కిస్తీలు పోను నెలకు ఐదు వేల కోట్ల వరకూ మిగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రంలో మార్చి నెల నుంచి మే నెల వరకు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. దానితో పాటే నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్‌ జరగనుంది. దీనితో ఈనెలాఖరు వరకు ఎలక్షన్‌ కోడ్‌ వర్తిస్తుంది. జూన్‌ 4వ తేదీ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతాయి. ఆ మరుసటి రోజే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వస్తాయి. జూన్‌ రెండో వారంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌ ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తుంది. జులై రెండో వారానికి స్థానిక ఎన్నికల పర్వం ముగుస్తుంది. అంటే మార్చి నెల నుంచి జులై వరకు వరుసగా రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో అదనపు ఖర్చులు ఏమీ లేనందున ప్రభుత్వ ఖజానాలో దాదాపు 25 వేల కోట్లకు పైగా సొమ్ము ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే ఖర్చులన్నీ బిగబట్టి .. బిల్లులు చెల్లించకుండా ఉన్న నిధులతో రుణమాఫీ చేయడం అనేది సాధ్యమయ్యే విషయం  కాదు. బిల్లులు కూడా  చెల్లించాలి. అందుకే కొంత మిగిల్చి..కొంత రుణం తీసుకుని ఆగస్టు పదిహేనో తేదీ నుంచి రుణమాఫీ ప్రారంభించాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఆగస్టు 15 నుంచి అక్టోబర్‌ నెలాఖరు వరకు రైతు రుణమాఫీని విడతలవారీగా చేయాలని రేవంత రెడ్డి భావిస్తున్నారు. మొదట చిన్న మొత్తం కాకుండా.. రెండు లక్షల రుణమాఫీని చేయాలనుకుంటున్నారు.  2 లక్షల వరకు రుణం తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత అక్టోబర్ కల్లా చివరి రైతుకు రుణమాఫీ చేయాలనుకుంటున్నారు.  ఐదు నెలల ఎలక్షన్‌ కోడ్‌ కాలాన్ని, వచ్చే ఆదాయం, చేసే ఖర్చుల్ని దృష్టిలో ఉంచుకొని, మిగులు ఆదాయం ఉంటుందనే భరోసాతోనే సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ఒట్లేస్తున్నారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.

రుణమాఫీ ఎన్నికల హామీ. అతి ఖరీదైన హామీ. ముఫ్పై వేల కోట్లు సర్దుబాటు చేయడం అంటే చిన్న విషయం కాదు. దీన్ని రేవంత్ చేసి చూపిస్తే… ఆయన ఇమేజ్ ఆమాంతం పెరుగుతుంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి