రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసుకై భయపడుతున్నారు

By KTV Telugu On 4 April, 2024
image

KTV TELUGU :-

తెలంగాణాలో రాజకీయ పార్టీలు చిత్ర విచిత్ర ఆరోపణలతో   నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్నాయి. మూడు ప్రధాన రాజకీయ  పార్టీల ఆరోపణలు చూస్తే  ప్రతీ పార్టీ కూడా మిగతా రెండు పార్టీలూ కుమ్మక్కు అయ్యాయన్న విమర్శే చేస్తోంది. కాంగ్రెస్ ఏమో బి.ఆర్.ఎస్.-బిజెపిలు  తోడు దొంగలంటోంది. బిజెపి ఏమో బి.ఆర్.ఎస్,-కాంగ్రెస్ లను నమ్మద్దంటోంది. బి.ఆర్.ఎస్. అయితే రెండు జాతీయ పార్టీలను నమ్మితే నట్టేట మునుగుతారని ప్రజలను హెచ్చరిస్తోంది. వీటిలో ఎవరి మాటలు నమ్మాలో అర్ధం కాక జనం అయోయమంలో ఉన్నారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  తెలంగాణాలో కాంగ్రెస్-బిజెపి-బి.ఆర్.ఎస్. పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. మాటల తూటాలు సంధించుకుంటున్నాయి. ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి కేంద్రంలోని బిజెపికి భయపడుతున్నారని బి.ఆర్.ఎస్. నేతలు అంటున్నారు.  అందుకే బిజెపికి పరోక్షంగా సహకరించేందుకు కొన్ని లోక్ సభ స్థానాల్లో రేవంత్ రెడ్డి బలహీన అభ్యర్ధులను బరిలో దించుతున్నారని  బి.ఆర్.ఎస్. నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలీదు కానీ ఈ ఆరోపణ మాత్రం ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇటీవలి ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని పంతంగా ఉంది. ఎన్నికలకు ముందే బి.ఆర్.ఎస్. నుండి కీలక నేతలు  కాంగ్రెస్ లో చేరడంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తోంది. దానికి భిన్నంగా బి.ఆర్.ఎస్. కాస్త ఆత్మరక్షణలో పడింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటోన్న కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ కేసునూ తెరపైకి తెచ్చి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇది బి.ఆర్.ఎస్. ను  దెబ్బతీయడానికే అని రాజకీయ పండితులు భావిస్తున్నారు. ఈకేసులకు భయపడే కేసీయార్ పరోక్షంగా  కాంగ్రెస్ కు సహకరించే పరిస్థితులు ఉన్నాయని బిజెపి వాదిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలకు ముందు బి.ఆర్.ఎస్.-బిజెపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాం తో బిజెపి   కేసీయార్ తనయ కవితపై దర్యాప్తు చేయించగా బిజెపికి చెందిన సాధువులు  ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ బి.ఆర్.ఎస్. కేసు పెట్టింది.  అయితే బి.ఆర్.ఎస్.-బిజెపిల మధ్య సీక్రెట్ డీల్ ఉందని కాంగ్రెస్ నేతలు అనేవారు. వారి మధ్య అవగాహన ఉంది కాబట్టే కవితను అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ పార్టీ నేతలను మాత్రమే అరెస్ట్ చేశారని అప్పట్లో కాంగ్రెస్ ఆరోపించింది. అయితే తాజాగా కవితను అరెస్ట్ చేసినపుడుకూడా కాంగ్రెస్ అదే ఆరోపణ చేస్తోంది.

లోక్ సభ ఎన్నికల ముందు బి.ఆర్.ఎస్. పట్ల ప్రజల్లో సానుభూతి తెప్పించేందుకు కవితను అరెస్ట్ చేసినట్లు చూపిస్తున్నారని..ఎన్నికలు ముగిసిన వెంటనే కవితను విడుదల చేసి కేసు మూసేస్తారని కాంగ్రెస్ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బి.ఆర్.ఎస్. నుండి ఇద్దరు ఎంపీలు బిజెపిలో చేరగా ఇద్దరు కాంగ్రెస్ లో చేరారు. కొద్ది రోజులుగా మాత్రం కాంగ్రెస్ లో దూకుడు కనిపిస్తోంది.  ఈ లోక్ సభ ఎన్నికల్లో పది నుండి 12 స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్ ధీమాగా ఉంది.

జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బిజెపిలు రెండూ కూడా  చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని  బి.ఆర్.ఎస్. నాయకత్వం దుయ్యబడుతోంది. తెలంగాణా ప్రజలతో ఉండే గులాబీ పార్టీనే గెలిపించుకోవాలని..జాతీయ పార్టీలకు తెలంగాణా సంక్షేమంపై   ప్రేమే ఉండదని  బి.ఆర్.ఎస్.నేతలు అంటున్నారు. బిజెపి-కాంగ్రెస్ లు మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని గులాబీ నేతలు అంటున్నారు. మొత్తానికి మే 13న జరగబోయే లోక్ సభ ఎన్నికల కోసం మూడు పార్టీలూ గట్టిగానే కసరత్తులు చేస్తున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి