రేవంత్ నెత్తిన పాలు పోసిన సీనియర్లు 

By KTV Telugu On 19 December, 2022
image

రేవంత్ రెడ్డి టార్గెట్‌గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ల రాజకీయం చివరికి బూమెరాంగ్ అయింది.  కాంగ్రెస్ పార్టీలో చేరిన అనతి కాలంలోనే ఆ పార్టీ రాజకీయాలను వంద శాతం వంటబట్టించుకున్న రేవంత్ అటు హైకమాండ్ దగ్గర మార్కులు కొట్టేయడం దగ్గర్నుంచి ఇక్కడ పార్టీలో తాను తప్ప మరో డైనమిక్ లీడర్ లేడని నిరూపించడం వరకూ చకచకా చేసేశారు. కాంగ్రెస్‌లో ఢక్కామొక్కీలు తిన్న వారు రేవంత్ వ్యూహాలను అర్థం చేసుకోకుండా అనవసరంగా ఆవేశపడి హైకమాండ్ దృష్టిలో పలుచనైపోతున్నారు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అంట్ రేవంత్ అంటే తెలంగాణ కాంగ్రెస్. కాంగ్రెస్ సీనియర్లు చేసిన రాజకీయం మాత్రం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు పార్టీ కంప్లీట్‌గా రేవంత్ రెడ్డి చేతుల్లోకి వెళ్లింది. టీ పీసీసీ కమిటీలను ఏర్పాటు చేసిన హైకమాండ్ వాటి సమావేశాలనూ నిర్వహించాని ఆదేశించింది. రేవంత్ రెడ్డి నిర్వహించారు.

అందరూ వచ్చారు కానీ సీనియర్లుగా కొత్త కుంపటి పెట్టుకున్న 9 మంది మాత్రమే హాజరు కాలేదు. దీంతో వారు తప్ప మిగతా పార్టీ అంతా ఏకతాటిపైకి ఉన్నట్లు తేలింది. అంతేకాదు ఆపార్టీ అంతా రేవంత్ వైపు ఉన్నట్లుగా స్పష్టమయింది.  9 మంది సీనియర్లు ఉద్దేశపూర్వకంగా పూర్తి స్థాయిలో కుట్ర పూరితంగా కాంగ్రెస్‌పై టీడీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని హైకమాండ్‌కు ఇప్పటికే నేతలు నివేదిక పంపారు. కమిటీల్లో కనీసం 13 మంది కూడా టీడీపీ నుంచి వచ్చిన వారు లేకపోయినా సగం మందికి పైగా ఉన్నారని ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని వారు వీడియోలను హైకమాండ్‌కు పంపారు. సీనియర్ నేతలు ఉద్దేశపూర్వకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని రేవంత్ వర్గం అటు హైకమాండ్‌కే కాదు ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లోనూ బలంగా వెళ్లేలా చేయగలిగింది. ఇలా చేయడానికి టీడీపీ నుంచి వచ్చారని చెప్పుకుంటున్న 13 మందితో రాజీనామాలు చేయించారు. అలాంటి వారిలో సీతక్క కూడా ఉన్నారు. సీతక్క ను వలస రాజకీయ నేత అంటే సగటు కాంగ్రెస్ కార్యకర్త అంగీకరించరు. ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీలో అలా కలసిపోయింది మరి.

ఇక కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి పాదయాత్రను ప్రకటించారు. పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఆయన పాదయాత్రకు తిరుగులేదని తేలిపోయింది.  జనవరి 26న ఆయన యాత్ర ప్రారంభం కానుంది. ఏఐసీసీ దేశవ్యాప్తంగా తలపెట్టిన ‘హాత్‌ సే హాత్‌ జోడో’ యాత్ర కార్యక్రమంలో భాగంగా ప్రారంభం కానున్న రేవంత్‌ పాదయాత్ర తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్‌ 2 వరకు ఐదు నెలలపాటు కొనసాగనుంది. ‘మార్పు కోసం యాత్ర’ పేరుతో చేపడుతున్న ఈ యాత్ర హైదరాబాద్‌ నగరం మినహా రాష్ట్రంలోని 99 నియోజకవర్గాల్లో జరగనుంది. నిజానికి పాదయాత్ర విషయంలో ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే చేయడమేమిటని తాము సీనియర్లం ఉన్నామని హైకమాండ్ వద్దకు రాయరాబారాలు నడిపారు. పాదయత్ర కాంగ్రెస్ పార్టీ కోసం కాదని రేవంత్ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికేనని ఫిర్యాదులు చేశారు. ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా ఇతర నేతలు కూడా పాదయాత్ర చేసేలా అంగీకరించాలని ఒత్తిడి చేశారు.

ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ముగిసిన రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలంతా పాదయాత్ర చేయాలని ఏఐసీసీ ఆదేశించింది. ఇదే కోణంలో తెలంగాణలోనూ ఇద్దరితో పాదయాత్ర చేయించాలని కోరారు. దీంతో  హైకమాండ్ కూడా ఈ విషయంలో ఆలోచన చేసింది. దీంతో రేవంత్‌కు తోటుగా భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వారు ఆవేశపడటంతో మొదటికే మోసం వచ్చేసింది. వచ్చే నెలతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగుస్తుంది. ఆ తర్వాత అన్ని రాష్ట్రాల్లో పాదయాత్రలు ప్రారంభమవుతాయి. ఈ అవకాశాన్నిరేవంత్ రెడ్డి పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. అదే సమయంలో సీనియర్లు రెబలిజం చూపించడంతో ఆయన మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇక నుంచి పీసీసీ కార్యక్రమాలకు హాజరు కాబోమని నిర్ణయంచడం కార్యవర్గ సమావేశాలకే హాజరు కాలేదంటే ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల పరిస్థితి ఉన్నా లేనట్లేనని భావిస్తున్నారు. వారిని ఇక కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ప్రోత్సహించదని కనీసం అపాయింట్‌మెంట్లు కూడా ఇవ్వడం కష్టమేనని అంటున్నారు.

ఈ సీనియర్లంతా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసి బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్న సమయంలోనే రాజగోపాల్ రెడ్డి మరింత ముందుకెళ్లి అందరూ బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ఎలా చూసినా కాంగ్రెస్ సీనియర్ల వ్యవహారం రేవంత్ రెడ్డికి ప్లస్ గా మారింది. ఆయన నాయకత్వంపై నమ్మకం ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి లేకపోతే బయటకు వెళ్లిపోవాలన్న పరిస్థితిని వాళ్లే తెచ్చుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయి పట్టు లభించినట్లయిందన్న వాదన వినిపిస్తోంది. నిజానికి రేవంత్ రెడ్డి పై ఓ తెలియని ఒత్తిడి చాలాకాలం నుంచి ఉంది. అదే సొంత పార్టీ పెట్టుకోవడం. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు రావాలనుకున్నప్పుడే ఆయన సొంత పార్టీ పెట్టుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ టీఆర్ఎస్‌ను ఓడించాలంటే ఒకే శక్తి ఉండాలని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన మొదట్లో ఆయనను పూర్తిగా సైలెంట్‌గా ఉంచేశారు. అప్పుడే కొత్త పార్టీ ప్రచారాలు చాలా సార్లు జరిగాయి. కానీ ఎప్పుడూ రేవంత్ ఆవేశపడలేదు. ఓపికగా ఎదురు చూస్తూనే ఉన్నారు.

ఇప్పుడు ఇక సొంత పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం రేవంత్ కి ఇక ఉండదు. ఎందుకంటే టీ కాంగ్రెస్‌లో రేవంత్ వ్యతిరేకులు ఇక ఉండరు. ఉంటే ఇక సైలెంట్‌గా ఉండాలి, లేదంటే బీజేపీలోకి వెళ్లిపోవాలి. అలాంటి పరిస్థితిని సీనియర్లే తెచ్చుకున్నారు. రేవంత్ నెత్తిన పాలుపోశారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ కు ఓ పెద్దసమస్య పరిష్కారమవుతున్నట్లే అనుకోవచ్చు.