ఒకవైపు ప్రజలందరూ సంక్రాంతి పండగ సంబరాల్లో మునిగి ఉన్న సమయంలో జగిత్యాల జిల్లా కోరుట్ల కొందరు దొంగలు ఒక ఏటీఎమ్‌లో డబ్బులు దోచుకోవాలని ప్లాన్ వేశారు. పట్టణంలోని వేములవాడ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో కి నలుగురు దొంగలు దూరి తమ పని మొదలు పెట్టారు. చోరీ చేసిన తరువాత డబ్బులతో పారిపోవడానికి బయట కారుతో మరికొందరు సిద్ధంగా ఉన్నారు. అయితే వాళ్లు ఏటీఎం నుంచి బ్రేక్ చేసి డబ్బులు తీస్తుండగా హైదరాబాద్‌లోని బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అలారం మోగింది. వెంటనే అధికారులు కోరుట్ల పోలీసులను అలర్ట్ చేశారు. దీంతో అప్రమత్తమైన పెట్రోలింగ్ పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఏటీఎంలోని డబ్బును పెట్టెల్లో పెట్టుకున్న దొంగలు.. కారులో ఎక్కుతుండగా పెట్రోలింగ్ వాహనం అక్కడికి చేరుకున్నది.
పోలీసులను గమనించిన దొంగలు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు తమ పెట్రోలింగ్ వాహనంతో వారి కారును ఢీకొట్టారు. అదే సమయంలో డబ్బుల బాక్స్ ఒకటి రోడ్డుపై పడిపోవడంతో అందులో ఉన్న డబ్బు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈలోగా పోలీసుల కళ్లు గప్పి దొంగలు అక్కడినుంచి పారిపోయారు. రోడ్డుపై పడిన డబ్బు 19 లక్షలుగా లెక్కతేలింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ సీసీ ఫుటేజీ అధారంగా పరారీలో ఉన్న దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు.