సలహాదారులను తీసుకోవాలన్న సలహా ఎవరిది?

By KTV Telugu On 8 July, 2024
image

KTV TELUGU :-

తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుల నియామకం వివాదాలకు దారి తీస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు సలహాదారుల నియామకాన్ని విమర్శించిన రేవంత్‌ ఇప్పుడు రాష్ట్రంతో సంబంధం లేని వ్యక్తులను నియమించడంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ సీఎం రేవంత్‌ నియమిస్తున్న సలహాదారులు వివాదాస్పదం కావడానికి కారణం ఏంటి?

కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్నపుడు ఆ పార్టీ నేతలు ముఖ్యంగా ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డి సలహాదారుల వ్యవస్థ మీద తీవ్ర స్థాయిలో విమర్శల దాడి చేశారు. గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు  అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన ఐఏఎస్‌లు రిటైరైతే వాళ్లను సలహాదారులుగా నియమించుకునేవారు. ఆ నియామకాలపై రేవంత్ రెడ్డి వరుసగా విమర్శలు చేస్తుండేవారు. ఇక ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా పనిచేసి రిటైరైన సోమేశ్ కుమార్‌కు సలహాదారునిగా పోస్ట్ ఇచ్చిన సందర్భంలో న్యాయస్థానాలకు వెళ్తానని చెప్పిన రేవంత్…కాంగ్రెస్ ప్రభుత్వంలో సలహాదారుల వ్యవస్థ ఉండదని అప్పట్లో చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే నామినేటెడ్ పోస్టులను పూర్తిగా రద్దు చేస్తూ జీవోను విడుదల చేసింది రేవంత్ సర్కార్. ఇక సలహాదారుల పోస్టులు ఉండవేమో అని అందరూ అనుకున్నారు. అయితే నెల రోజుల్లోనే సీన్ మారిపోయింది.  రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తాను వ్యతిరేకించిన సలహాదారుల వ్యవస్థను పునరుద్ధరించింది. వరుసగా సలహాదారులను నియమించుకుంటోంది. పబ్లిక్‌ అఫైర్స్‌ సలహాదారుడిగా రేవంత్ అనుచరుడు, కాంగ్రెస్ నేత వేం నరేందర్‌రెడ్డిని నియమించగా… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ వ్యవహారాల కోసం షబ్బీర్‌ అలీని నియమించారు.

ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవిని నియమిస్తే ఆయన ఆ పదవికి రాజీనామా చేసి నాగర్‌ కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన స్థానంలో మళ్లీ బిజెపిలో ఉన్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని నియమించారు. ఆయన రీసెంట్ గానే ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారు.  సాధారణంగా సలహాదారులను తనకు నచ్చిన వాళ్లను, లేదా ఆ శాఖకు సంబంధించినటువంటి వ్యక్తులను, సొంత రాష్ట్రానికి చెందిన అధికారులను నియమించుకుంటారు.

రేవంత్ సర్కార్  మాత్రం సబ్జెక్టుకు సంబంధం లేని, రాష్ట్రానికి సైతం సంబంధంలేని వ్యక్తులను సలహాదారులుగా నియమిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రిటైర్డ్‌ అధికారులైన ఆదిత్యనాథ్ దాస్, శ్రీనివాసరాజులను సలహాదారులుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ను నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా నియమించగా, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఐఏఎస్‌ అధికారి శ్రీనివాస్‌రాజును మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టుల సలహాదారుడిగా నియమిస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదిత్యనాథ్ దాస్ ఏపీకి ఇరిగేషన్ చీఫ్ గా ఉన్నప్పుడు తెలంగాణకు నదీ జలాల వాటాల విషయంలో న్యాయం దక్కలేదని, ఆదిత్యనాథ్ దాస్ వల్ల తెలంగాణకు అన్యాయం జరిగిందన్న విమర్శ ఉంది. అలాంటి వ్యక్తులను ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకోవడంలో ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతుంది. ఇక శ్రీనివాసరాజు నియామకం వెనుక కూడా ముందస్తుగానే చర్చలు జరిగాయని, రేవంత్‌ ప్రభుత్వం హామీ మేరకే అక్కడ వీఆర్ఎస్ తీసుకోగానే ఇక్కడ సలహాదారుగా నియామకం చేశారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి