రేవంత్‌కు హైకమాండ్ బలమా ? శాపమా ?

By KTV Telugu On 23 December, 2022
image

“శరీరంలో వైరస్ సోకితే దానికి మందేస్తే తగ్గిపోతుంది కానీ బలం ఇస్తే మరింత పాకిపోతుంది..”ఈ చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ హైకమాండ్ మిస్సయింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి అనే వైరస్ అంతకంతకూ పెరిగిపోవడానికి ఆ పార్టీ అధినాయకత్వమే కారణం అవుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభాన్ని ఆ పార్టీ హైకమాండ్ అంతకంతకూ పెద్దది చేసుకుంటోంది. కఠినంగా వ్యవహరించి అసంతృప్త నేతల నోళ్లు మూయించే వ్యూహాన్ని ధైర్యంగా అమలు చేయలేక బుజ్జగింపులకు దిగుతోంది. తాము అంటే భయపడుతున్నారన్న ఉద్దేశానికి వచ్చేసిన అసంతృప్త వాదులు మరింతగా పార్టీని ఓ ఆట ఆడుకుంటున్నారు. గాందీ భవన్‌లో వ్యూహాత్మకంగా జరిగిన ఓ చిన్న ఘర్షణ తరహా ఘటనతో కాంగ్రెస్ పార్టీ పరువు మరోసారి రోడ్డున పడింది. కాంగ్రెస్ అంటే ఇదేరా అని ఎగతాళి చేసేలా చేసింది. ఇదంతా సీనియర్ల బుజ్జగింపుల కోసం దిగ్విజయ్ సింగ్‌ను హైదరాబాద్ కు పంపడం వల్లే జరిగింది. అదే్ ధిక్కరించిన సీనియర్లపై కన్నెర్ర చేసి ఉంటే ఈ పాటికి వివాదం సద్దుమణిగిపోయి ఉండేది. ఉండేవాళ్లు పార్టీలో ఉంటారు లేని వాళ్లు లేదు.

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ల ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వారి టార్గెట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా తప్పంచాలనేది వారి లక్ష్యం. వారు ఎన్ని కారణాలు చెప్పినా వారి లక్ష్యం ఇదే. టీ కాంగ్రెస్ అంటే వారు రేవంత్ రెడ్డి అనే అనుకుంటున్నారు. ఆ పార్టీలో తాము భాగం అని భావించడం లేదు. రేవంత్ సొంత పార్టీ అన్నట్లుగా చూసుకుంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కాలం టీ పీసీసీ చీఫ్‌గా పని చేశారు. రేవంత్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నది ఆయన టీ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడే. జై ఉత్తమ్..జై జై కాంగ్రెస్ అని నినాదాలు చేసి రేవంత్ రెడ్డి పార్టీలో చేరారు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉండగా ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. హైకమాండ్ కూ ఫిర్యాదులు చేసినట్లుగా ఎక్కడా లేదు. ఉత్తమ్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు రేవంత్ ను దాదాపుగా పక్కన పెట్టారు. ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. అయినప్పటికీ తన లాంటి స్టేచర్ ఉన్న నాయకుడ్ని ఉపయోగించుకోలేదని ఇప్పటి నేతల్లా రేవంత్ అసమ్మతి స్వరం ఎప్పుడూ వినిపించలేదు. కానీ ఆయనకు పీసీసీ చీఫ్ రాగానే సీనియర్లు మొత్తం కట్ట కట్టుకుని ఆయనపై దాడికి దిగుతున్నారు.

రేవంత్ ను పీసీసీ చీఫ్ చేయకుండా ఉండాటనికి ఈ సీనియర్లు తెర వెనుక చేయగలిగినంత చేశారు. కానీ రేవంత్ రెడ్డి తన స్టామినాను చూపించో కాంగ్రెస్ మార్క్ రాజకీయాల్ని ఒంటబట్టించుకునో పదవి పొందారు. రేవంత్ తన లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకున్నారు. ఆయనకు క్లారటీ ఉంది. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కూడా దీన్ని నమ్మింది. ఆయనకు చాన్సిచ్చింది. మరి ఇలాంటప్పుడు రేవంత్ రెడ్డిని బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలి కానీ బలహీనపర్చేలా హైకమాండ్ వ్యవహరిస్తూండటమే ఆశ్చర్యకరంగా మారింది. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వగానే మొదట కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఇంచార్జ్ ఠాగూర్ పై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోకపోగా బుజ్జగించి స్టార్ క్యాంపెయినర్ పదవి ఇచ్చారు. చివరికి ఆయన పార్టీ పరువు మరింతగా తీసేశారు. ఆయన బీజేపీలో చేరిపోవడం ఖాయమని తేలిపోయింది. మొదట్లోనే చర్యలు తీసుకుంటే వెంకటరెడ్డి చేసే డ్యామేజీ తక్కువగా ఉండేది. కానీ ఆయన చేసిన పనుల వల్ల మునుగోడులో కాంగ్రెస్ ఇంకా ఎక్కువ నష్టపోయింది.

ఇప్పుడు సీనియర్ల విషయంలోనూ అదే చేస్తున్నారు. సీనియర్లు ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారు. టీడీపీ ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేవంత్, భట్టి వంటి నేతలు టీఆర్ఎస్ పై పోరాడటం కన్నా ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటారనేది బహిరంగ రహస్యం. అలాంటి నేతలను పార్టీ ఫేస్ గా పెట్టుకుంటే టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా ఓటర్లు కాంగ్రెస్ పార్టీని చూసే ప్రశ్నే ఉండదు. ఆ విషయం హైకమాండ్ కూ తెలుసు. అందుకే రేవంత్ కు పదవి ఇచ్చింది. అలా ఇచ్చినప్పుడు సీనియర్ల అసంతృప్తిని సెట్ రైట్ చేయాల్సిన బాధ్యత హైకమాండ్ పై ఉంది. రేవంత్ చాలా వరకూ అందర్నీ కలుపుకునే ప్రయత్నం చేశారని కళ్ల ముందు కనిపిస్తూ నే ఉంది. కానీ వారు రేవంత్ లో తప్పులు వెదుక్కుని మరీ ఫిర్యాదు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. సునీల్ కనుగోలు నేతృత్వంలోనే ఇది సాగుతోందని అంటున్నారు. నిజానికి సునీల్ కనుగోలును పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ఆయన రేవంత్ అనుచరుడు కాదు. అయినా ఆరోపణలు చేస్తున్నారు. ఇదంతా తెలంగాణ కాంగ్రెస్ ను ప్రజల్లో చులకన చేయడానికి వారిలో వారు కొట్టుకుంటారు తప్ప టీఆర్ఎస్ పై పోరాడలేరు అని చెప్పడానికి ఆడుతున్న గేమ్ అనుకోవచ్చు.

దీన్ని హైకమాండ్ నిరోధించాల్సింది పోయి దిగ్విజయ్ సింగ్ ను హైదరాబాద్ కు పంపింది. దీంతో అసంతృప్త నేతలకు మరింత ధైర్యం వచ్చింది. ఎంత దైర్యం అంటే ఉద్దేశపూర్వకంగా గాంధీభవన్‌లో గలాటా చేసేలా చేయగలిగారు. ఉత్తమ్ ను వ్యతిరేకించిన ఓ మాజీ ఎమ్మెల్యేపై దాడికి ప్రయత్నించారు. దిగ్విజయ్ సింగ్ చక్కబెట్టే వ్యవహారాలు ఏమీఉండవు కానీ ఇలాంటివి హైలెట్ కావడం వల్ల కాంగ్రెస్ మరింత చులకన అవుతుంది. సీనియర్ నేతలు చేసినా ఇతర పార్టీలతో టచ్‌లో ఉంటే మాత్రం ఇవాళ కాకపోతే రేపైనా జంప్ అవుతారు. అందుకే కఠినంగా ఉంటే పార్టీలో ఉండాలనుకునేవాళ్లు ఉంటారు. అలా చేయకుండా అందర్నీ సంతృప్తి పరచాలని చూస్తే రేవంత్ ను బలహీనపర్చినట్లే అవుతుంది. అదే జరిగితే కాంగ్రెస్ పార్టీకీ ఉపయోగడం ఉండదు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తిస్తుందో మరి !